గత కాంగ్రెస్ పాలనలో పాలమూరు భూముల్లోఎటూ చూసిన రేగుకంప, తంగేడు చెట్లు, రాళ్లు రప్పలతో నిండి దర్శనమిచ్చేవి. నాడు మారుమూల ప్రాంతాలకు బస్సుసౌకర్యం ఉండేది కాదు. పక్క ఊరు వెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్లాల్చిందే. ఆ సమయంలో దాహం వేస్తే తాగడానికి నీళ్లుండేవి కావు. దారి పొడవునా బోరు బావులున్నా చుక్క నీరుండేది కాదు. కంటి చూపు మేర బీడు వారిన భూములు తప్ప మరేమీ కనిపించేది కాదు. కానీ తెలంగాణ రా్రష్ట్రం సాకారమయ్యాక పాలమూరు పునర్జీవం పోసుకున్నది.
పాలమూరు అంటే దుబాయి, హైదరాబాద్ వలస వెళ్లి పని చేసుకునే శ్రామికులు అని పేరు. భూములున్న వారు వ్యవసాయంపై ప్రేమతో వరుణ దేవుని నమ్ముకొని పంట వేసి ఆకాశం వైపు దిగాలుగా చూడటం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో పాలమూరులో ఎవ్వరిని కదిలించిన కన్నీటి గాథలే వినబడుతుండె. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎండిన మొక్కలకు నీళ్లు పోస్తూ పంటను బతికించుకునే ప్రయ త్నం చేసిన రోజులను పాలమూరు ప్రజలు మరువలె. ఉన్న ఊరి లో పూట గడువని కుటుంబాలు అవ్వతాత దగ్గర పాలు తాగే పిల్లలను వదిలి బతుకుదెరువుకై ముంబై బస్సెక్కి వెళ్లిన రోజులు. ఆ పిల్ల, పిల్లవాడు తల్లిపై బెంగ పెట్టుకున్నాడని ముంబై వెళ్తున్న వారితో కబురు పంపితే ఆ తల్లి ఎన్నో బాధలు పడి వచ్చి పిల్లలను గుండెకు హత్తుకొన్న రోజులు మరువలె. పాలమూరులో ఎవ్వరింటికైనా వెళ్లి తాగేందుకు నీళ్లడిగితే ఉప్పు నీళ్లు ఇస్తారో మంచి నీళ్లు ఇస్తారో అని ఆలోచించే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
కాంగ్రెస్ పాలనలో గిరిజన, మారుమూల గ్రామాలకు తాగునీరు, కరెంట్, రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడింది పాలమూరు. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఎన్నికల ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. పాలమూరు రైతులు ఒకప్పుడు ఒక పూట భోజనానికి ఎదురు చూసిన పరిస్థితి నుంచి నేడు బీఆర్ఎస్ పాలనలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతామని ఏనాడూ అనుకోలేదు. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు రూపు రేఖలు మారుస్తామని హమీలు ఇవ్వటం తప్ప పాలమూరు అభివృద్ధి కోసం ఏ రోజూ తపించలేదు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు కరెంట్కోసం ఎదురు చూస్తూ బోరు బావి దగ్గర ప్రాణాలు వదిలిన రైతన్నలు ఇవే దృశ్యాలు. తాగునీటికోసం మైళ్ల దూరం నడిచిన రోజులు. కాంగ్రెస్ ఏలుబడిలో ఎవ్వరైనా కాలం చేస్తే స్నానం చేయడానికి పడ్డ కష్టాలు వర్ణనాతీతం.ఏండ్లకు ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాం గ్రెస్ ఈనాడు పాలమూరు ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కానీ పాలమూరు ప్రజలు వారు అనుభవించిన కష్టాలను అంత సులువుగా మరచిపోలేరు.
ఒక్కప్పుడు కృష్ణమ్మ పక్కనే ప్రవహిస్తున్న చుక్క నీరు అందలే. నేడు కేసీఆర్ పాలనలో ప్రతి గుంట భూమి తడుస్తుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విశేషమైన కృషే కారణం. గతంలో పాలమూరు బిడ్డలు ముంబై, హైదరాబాద్కు వలసలు వెళ్తే నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, ఆంధ్ర, చత్తీస్గఢ్, మహరాష్ట్ర ప్రాంతాల నుండి పాలమూరుకు ఉపాధికోసం వస్తున్నారు. పాలమూరు ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాలమూరు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి వడి వడిగా పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా ముందుకు పోతున్నారు.
నేడు పాలమూరు పచ్చబడుతుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రాజెక్టులపై కేసులు వేసి అభివృద్ధికి ఆటంకం సృష్టించిన చరిత్ర వారిది. నేడు అసత్య ప్రచారంతో పాలమూరు ప్రజల ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పాలమూరు ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉంటారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ అభివృద్ధిలో దూసుకు పోతున్నది. ధాన్యం దిగుబడిలో రాష్ట్రం ముందున్నదంటే దానిలో పాలమూరు వాటా కూడా ఉన్నది. కేసీఆర్ ఉద్యమ సమయంలో పాలమూరుకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు అందిస్తున్నా రు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు,1200 గ్రామాలకు తాగునీరు అందనున్నది. దీని నీటి నిల్వ సామర్థ్యం 67.67 టీఎంసీలు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాతి స్థానం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు. జూరాల ప్రాజె క్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయ డం ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలను చెరువు, కుంటలను నింపి కాకతీయుల నాటి పూర్వ వైభవాన్ని మిషన్ కాకతీయ ద్వారా తీసుకువస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భ్రమ పడుతున్నది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా మత రాజకీయాలతో సీట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా పాలమూరును అన్ని విధాలుగా అభివృ ద్ధి చేసి, పాలమూరు ప్రజల సంక్షేమానికై కృషి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే ప్రజలుంటారు.
మిద్దె సురేశ్
97012 09355