రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడిని అత్యంత క్రూరంగా ఆచరణలో పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. అధికారం ఒక్కటే పరమావధిగా భావిస్తూ, అవసరం ఉన్నప్పుడు మిత్రపక్షాలను భుజాన వేసుకుని.. అవసరం తీరాక వాటిని నట్టేట ముంచేయటం ఆ పార్టీ రాజకీయ సంస్కృతిగా మారింది. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఈ విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన డీఎంకే-కాంగ్రెస్ అనుబంధం ఒక్కసారిగా తెగిపోవటం, ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటిరోజే అధికార పార్టీ టీవీకేతో కాంగ్రెస్ కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుట్టటం డీఎంకే వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
డీఎంకే నేతల ఆవేదనలో ఒక ప్రధాన అంశం ఉన్నది. కాంగ్రెస్‌తో తమకు ఎదురైన చేదుఅనుభవం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాగే వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడిందని వారు గుర్తుచేస్తున్నారు. నిజానికి తమిళ రాజకీయాల్లో కాంగ్రెస్ నయవంచన చరిత్ర 1980 నుంచే మొదలైందని డీఎంకే వర్గాలు చెప్తున్నాయి. ఇందిరాగాంధీ హయాంలో 1980 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్-డీఎంకే కూటమి ఏర్పడింది. అప్పట్లో ఈ కూటమి 39 స్థానాల్లో 37 గెలుపొంది సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఆ విజయాన్ని అడ్డంగా పెట్టుకుని అప్పటి ఎంజీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని ఇందిరా సర్కార్ రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించింది. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎంజీఆర్ ఘనవిజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుని డీఎంకేను పక్కనబెట్టి, అన్నాడీఎంకేతో చేతులు కలిపింది. అప్పుడే డీఎంకేకు కాంగ్రెస్ రాజకీయ స్వభావం మొదటిసారి అర్థమైంది. ఇదే ధోరణి 1991లో మరింత స్పష్టంగా కనిపించింది.
ఎల్టీటీఈకి మద్దతిచ్చారనే ఆరోపణలతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయించటంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. కేంద్రంలో చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చివేయటం అప్పట్లో పెద్ద రాజకీయ కలకలానికి దారితీసింది.
అంతటి చేదు అనుభవాల తర్వాత కూడా1996లో డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతుగా కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో చేరింది. కానీ 1998లో రాజీవ్ గాంధీ హత్యపై జైన్ కమిషన్ నివేదికను సాకుగా చూపి కాంగ్రెస్ మళ్లీ డీఎంకేను టార్గెట్ చేసింది. జైన్ కమిషన్ నివేదికలో రాజీవ్ హత్యకు పాల్పడిన ఎల్టీటీఈ సభ్యులకు డీఎంకే మహిళా నేత సుబ్బులక్మి జగదీశన్ సహకారం లభించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయటం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. జైన్ కమిషన్ నివేదికను ఒక కారణంగా చూపి…డీఎంకేకు చెందిన మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఐకే గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాల అసలు రూపం బయటపడిందనే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే..జైన్ కమిషన్ నివేదికను చూపించి డీఎంకేను దెబ్బతీసిన అదే కాంగ్రెస్..2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎంకే నాయకురాలు సుబ్బులక్ష్మి జగదీశన్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చింది. జైన్ కమిషన్ నివేదిక విషయంలో ఒక్కసారిగా ఎలా మనసు మార్చుకున్నదనే ప్రశ్నకు కాంగ్రెస్ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు.
తమతో 22 ఏండ్ల అనుబంధాన్ని ఒక్కసారిగా తెంచుకుని, అధికారంలో భాగస్వామ్యం కోసం తమిళనాట విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలుపటం డీఎంకే నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ చర్యతో నాటి ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ నాయకత్వం వరకు కాంగ్రెస్ సంస్కృతిలో మార్పు రాలేదని మండిపడుతున్నారు. కేరళలోనూ కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో పినరయ్ విజయన్ బీజేపీతో రహస్య అవగాహన కుదుర్చుకున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలను కమ్యూనిస్టు పార్టీలు ఖండించాయి. ఇండి కూటమిలో కలిసి పనిచేస్తూనే, రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయటం కాంగ్రెస్ ద్వంద్వవైఖరికి నిదర్శనమని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇక్కడ కాంగ్రెస్ గుర్తుంచుకోవాల్సిన ఒక కీలక అంశం ఉన్నది. తమిళనాడు, కేరళలో రాజకీయ లబ్ధి కోసం మిత్రపక్షాలను దెబ్బతీయటం తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు. కానీ జాతీయ రాజకీయాల్లో ఇండి కూటమి మనుగడ డీఎంకే, లెఫ్ట్ పార్టీల మద్దతుపైనే ఆధారపడి ఉన్నది. రానున్న రోజుల్లో పార్లమెంట్లో కీలక ఓటింగ్ జరిగితే డీఎంకే ఎంపీల మద్దతు లేకుండా కాంగ్రెస్ ఏమీ చేయలేని పరిస్థితి రావచ్చు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని రాహుల్ చేస్తున్న ప్రకటనకు జనం నుంచి సరైన స్పందన లేకపోవటానికి ఈ అవకాశవాద రాజకీయాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాలను ఉపయోగించుకుని వదిలేయటం, అధికారమే లక్ష్యంగా రాజకీయ సంబంధాలను తిరగరాయటం వంటి ధోరణులు తాత్కాలిక లాభాలు ఇవ్వవచ్చు. కానీ దీర్ఘకాలంలో అవే పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. తమిళనాడులో డీఎంకే ఆగ్రహం, కేరళలో లెఫ్ట్ పార్టీల అసంతృప్తి, తెలంగాణలో కాంగ్రెస్‌పై ఇంకా పూర్తిగా చెరిగిపోని అనుమానాలు. ఇవన్నీ ఒక భావనను కలిగిస్తున్నాయి. అవకాశవాదంతో రాజకీయాలు నడపవచ్చు గానీ..విశ్వాసాన్ని మాత్రం కొనలేరు.
– (వ్యాసకర్త: సీనియర్ పాత్రికేయుడు)
డీఆర్సీ రావు