భారతీయ ప్రాచీన లోహ పరిశ్రమకు కలికితురాయిగా నిలిచిన తెలంగాణ ఉక్కు పరిశ్రమపై ఒకవైపు ప్రపంచ శాస్త్రజ్ఞులు దృష్టిసారిస్తుంటే, స్థానిక ప్రజలకు మాత్రం దాని ప్రాచీనత, ప్రాధాన్యం తెలియడం లేదు. సుమారు 2000 ఏండ్ల కిందట ఉక్కు- ఇనుము తయారీ కేంద్రంగా భాసిల్లిన ధర్మపురి నియోజకవర్గంలోని నూతన మండల కేంద్రమైన బుగ్గారం గ్రామ సమీప రణంకోట గుట్టను కొందరు ఇటీవల మొరం కోసం తవ్వుతున్నారు. దీంతో ప్రాచీన చారిత్రక సాక్ష్యాలు, అపురూప ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి.
కర్ణాటక, సేలం తదితర ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం నుంచే ఇనుము, ఉక్కు తయారయ్యేవి. కోనసీమ ఉక్కుగా, అయస్కాంత తత్వం కలిగిన… పదును తరగని, వన్నె చెరగని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో తయారయ్యే ప్రత్యేక ఉక్కు, ఇనుమును ప్రపంచంలోని అన్ని వృత్తులవారికి అవసరమైన పరికరాల తయారీకి వినియోగించేవారు. క్రీ.పూ 300 నుంచి క్రీ.శకం 1850 వరకు ప్రపంచ వాణిజ్య విపణికి ఇక్కడి ఉక్కు సరఫరా కావడం విశేషం. బ్రిటన్ పారిశ్రామిక విప్లవం అనంతరం దేశీయ ఉక్కు పరిశ్రమ సంక్షోభంలో పడింది. యాంత్రిక స్టీలు వినియోగం పెరిగి, స్థానిక తయారీ వస్తువుల వాడకం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. దాంతో కొంతకాలానికి ఇవి కనుమరుగయ్యాయి.
తెలంగాణ ప్రజల కుటీర పరిశ్రమల్లో ఇనుము-ఉక్కు తయారీ ప్రధాన పాత్ర పోషించింది. ఉత్తర తెలంగాణలోని ఇందూరు, ఇందుర్తి, ఇందారం, ఇనుగుర్తి, ఇనుగుర్రాల, కొలిమికుంట కమ్మరిపెల్లి, చిట్యాల, చిట్టాపూర్, చెక్కల, ముద్దపల్లి తదితర గ్రామాల పేర్లు ఇనుము ఉక్కు పేరిటనే వ్యవహారంలోకి వచ్చాయి. తెలంగాణలో అలనాడు 90 ఇనుము ఉత్పత్తి, 15 ఉక్కు ఉత్పత్తి కేంద్రాలు ఉండేవని డచ్ లోహశాస్త్ర పరిశోధకులు తెల్మాలో తెలిపారు.
అవిభక్త కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, ఇబ్రహీంపట్నం, కల్లెడ ఉక్కు తయారీ, అలాగే మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, వర్షకొండ, కిషన్రావుపేట తదితర అనేక ప్రాంతాల్లో ఇనుము ఉత్పత్తి కేంద్రాలు ఉండేవి. బుగ్గారం సమీపంలోని ‘రణంకోట గుట్ట’ అత్యంత ప్రాచీన తయారీ కేంద్రంగా భాసిల్లినట్టు పరిశోధనల్లో తేలింది. ఈ ప్రాంతాల్లో కాలిన ఇనుము, ఉక్కు ఇందూరు (నిజామాబాద్) నుంచి విదేశీ విపణులకు ఎగుమతి అయినట్టు ఆధారాలున్నాయి. చారిత్రక పరిశోధకులు చెప్తున్నట్టుగా ‘ఇందూరు’ను ‘ఇంద్రపురం’గా కాక ‘ఇనుమూరు’గా పేర్కొని ఉంటారన్న ప్రాచీన లోహశాస్త్ర పరిశోధకుల భావనకు బలమైన ఆధారాలు లభించాయి. ఇంతటి ప్రాధాన్యం గల ఈ ప్రాంత ఇనుము-ఉక్కు తయారీపై దేశ విదేశీ ప్రాచీన లోహశాస్త్ర పరిశోధకులు ఇటీవలి కాలంలో విశేష ఆసక్తి కనబరుస్తున్నారు.
రణంకోట గుట్టపై సహస్రాబ్దుల కాలం నాటి సరాలు, బట్టీలు, చిట్టెం (ఇనుము తయారీలో మిగిలిన వ్యర్థ పదార్థం), శిథిల అవశేషాలను ప్రముఖ చారిత్రక పరిశోధకులు, ధర్మపురి ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ జైకిషన్ కనుగొన్నారు. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాల తయారీ కోసం ఇక్కడి ఉక్కు-ఇనుము పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు ఎగుమతి అయినట్టు ఆయన పరిశోధనల్లో తేలింది. డచ్‌కు చెందిన తెల్మాలో, లండన్‌కు చెందిన జేమ్స్ అలెన్, జోన్ జూలిఫ్, జేక్ కేన్, బెంగళూరుకు చెందిన శారద శ్రీనివాస్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ రంగనాథన్, కాన్పూర్ ఐఐటీ లోహశాస్త్ర విభాగాధిపతిగా పని చేస్తూ దివంగతులైన ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం చేసిన విశేష పరిశోధనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
అనేక ప్రాంతాలు తిరిగి, శ్రమకోర్చి జైకిషన్ వీటితో తయారైన అపురూపమైన, విలువైన వస్తువులను సేకరించారు. వాటిని కాన్పూర్ ఐఐటీ లోహ పరిశోధన శాఖకు సమర్పించి, భద్రపరి చారు. ధర్మపురి క్షేత్రానికి విచ్చేసిన విదేశీ లోహశాస్త్ర పరిశోధకులందరూ జైకిషన్ చేస్తున్న పరిశోధనలను పరిశీలించి అభినందించారు. భారతదేశంలో టీఎల్ (థర్మో లుమినిసెంట్) ల్యాబొరేటరీ పరీక్షల సౌకర్యం ఉండి ఉంటే ఈ కేంద్ర ప్రాచీనత స్పష్టమయ్యేదని విదేశీ చారిత్రక పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపం చ ప్రాచీన లోహపరిశ్రమకు ఆధారభూతమైన, ప్రాచీన చారిత్రక సాక్ష్యంగా నిలిచే రణంకోట ప్రాంత రక్షణకు పాలకులతో పాటు ప్రజలు తగిన చర్యలు చేపట్టడం అత్యవసరం.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494