హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మూడు కొత్త లా కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొత్తగా మరో 600కు పైగా మూడేండ్ల ఎల్ఎల్బీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ప్రొడెన్షియల్ లా కాలేజీ, ఎండీఎం లా కాలేజీ, హైదరాబాద్ లా కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలే కావడం గమనార్హం. కొత్త లా కాలేజీల ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించింది. లాసెట్ కౌన్సెలింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాదే ఈ మూడు కొత్త కాలేజీల్లో సీట్లను భర్తీచేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32 లా కాలేజీలున్నాయి. వీటిల్లో నాలుగువేల ఎల్ఎల్బీ సీట్లున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరో 600 సీట్లు అదనంగా పెరగనున్నాయి.