నేడు ఠాకూర్ శత జయంతి
బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితమంతా పోరాటం చేసిన ఓబీసీ నాయకుడు కర్పూరీ ఠాకూర్. ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా ఉంది. బీహార్ రాష్ర్టానికి రెండుమార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. తన హయాంలోనే బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఆయన పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత ఆయనది.
లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ నేతలు ఆయనకు శిష్యులంటేనే కర్పూరీ ఠాకూర్ రాజకీయ జీవితం ఎంతటి ఆదర్శవంతమో అర్థం అవుతున్నది. అనేకమంది నేతలకు ఆదర్శప్రాయుడైన కర్పూరీ ఠాకూర్ శత జయంతిని నేడు మనం జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించి గౌరవించింది.
ఓబీసీల సంక్షేమం, సాధికారత కోసం అహర్నిశలు శ్రమించిన నేత జన నాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్. ఓబీసీల గొంతుకగా జీవితాంతం పోరాడిన ఆయన మండల్ కమిషన్ సిఫారసులకు ఆద్యుడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. బీహార్‌లో 1.6 శాతం మాత్రమే జనాభా ఉన్న సామాజికవర్గంలో పుట్టినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను శాసించిన జననాయక్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తన రాజకీయ జీవితంపై ఠాకూర్ ప్రభావం ఉందని నితీశ్ కుమార్ ఎప్పుడూ చెప్తుంటారు.
1977లో రెండోసారి ముఖ్యమంత్రిగా బీహార్‌లో జనతా పార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఠాకూర్ 1978లో కొత్త రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 24 శాతం కోటా ఉండగా, రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు 26 శాతం రిజర్వేషన్లను కల్పించారు. ఈ రిజర్వేషన్లలో అనుబంధంగా అత్యంత వెనుకబడిన తరగతులకు 12 శాతం, తక్కువ వెనుకబడిన తరగతులకు 8శాతం, మహిళలకు 3 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి 3 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్ విధానమే ‘కర్పూరీ ఠాకూర్ ఫార్ములా’గా ప్రసిద్ధి చెందింది.
1924 జనవరి 24న బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పితౌజియా గ్రామంలో మంగలి (నాయి) కుటుంబంలో కర్పూరీ ఠాకూర్ జన్మించారు. 1938లో తన ఊరికి దగ్గరలో ప్రాంతీయ కిసాన్ సమ్మేళన్‌లో ప్రసంగించేందుకు వచ్చిన సోషలిస్ట్ ఆచార్య నరేంద్రదేవ్ దృష్టిలో పడ్డారు. తన ప్రసంగాలతో కాలక్రమేణా యువత, విద్యార్థులలో ఠాకూర్ ఆదరణ పొందారు. డిగ్రీ చదువుతుండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించారు. 1942 నుంచి 1945 వరకు జైలులో ఉన్నారు. బీఏ డిగ్రీ పూర్తి చేయకుండానే చదువు మానేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చురుకైన సభ్యుడిగా ఉంటూ స్వగ్రామంలో యువజన కార్యకలాపాలను నిర్వహించారు.
జైలులో ఉన్నప్పుడే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీకి పూర్తిగా అంకితం అయ్యారు. స్వాతంత్య్రం వచ్చాక సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్‌ల ప్రేరణతో 1948లో కాంగ్రెస్ పార్టీని వదిలి సోషలిస్ట్ పార్టీలో చేరారు. లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడిగా చాలాకాలం పని చేసి జీవిత చరమాంకం వరకు నిబద్ధత కలిగిన సోషలిస్టుగా కొనసాగారు. 1957లో ఆర్ఎల్ చందాపురి తన బీహార్ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్‌ను లోహియా సోషలిస్ట్ పార్టీలో విలీనం చేసిన తర్వాత, 1959లో లోహియా మద్దతుదారులు ప్రభుత్వ ఉద్యోగాలలో 60% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో సోషలిస్ట్ రాజకీయాల ప్రధాన ఎజెండాగా రిజర్వేషన్ మారింది.
1960లో టాటా కంపెనీ కార్మికుల సమ్మెకి మద్దతు తెలిపారు. 1970 లో టెల్కో కార్మికుల ఉద్యమాన్ని నడిపి 28 రోజులు జైలు జీవితం గడిపారు. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పుడే అతను జననాయక్‌గా పేరొందారు. 1952లో బీహార్ శాసనసభకు ఠాకూర్ ఎన్నికయ్యారు. అక్కడి నుంచి 1988 ఫిబ్రవరి 27లో మరణించే వరకు ఆయన రాజకీయాల్లో వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో 1970-1971లో మొదటిసారి, 1977-1979 మధ్య మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఆంగ్లం పాస్ కావడం తప్పనిసరిని కాదనే సాహసోపెతమైన నిర్ణయం తీసుకొని వేలాది మంది విద్యార్థుల చదువులు అక్కడితోనే ఆగిపోకుండా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి పర్యాయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో, కాంట్రాక్టుల్లో నిరుద్యోగ ఇంజనీర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్ ముఖ్యమంత్రిగా రెండోసారి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు.
ఠాకూర్ పాలన రాష్ట్రంలోని ఆధిపత్య కులాలకు మింగుడుపడలేదు. ఠాకూర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడం ద్వారా జనతా పార్టీకి చెందిన అగ్రవర్ణ సభ్యులు రిజర్వేషన్ విధానాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారు. దళిత ఎమ్మెల్యేలను దూరం చేసేందుకు, దళితుడైన రామ్ సుందర్ దాస్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. దాస్, ఠాకూర్ ఇద్దరూ సోషలిస్టులు అయినప్పటికీ, ఠాకూర్‌తో పోలిస్తే దాస్ మితవాద, అనుకూలమైన వ్యక్తి. ఠాకూర్ రాజీనామా చేయగా దాస్ 1979లో ముఖ్యమంత్రి అయ్యారు.
1980లో నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంస్థని స్థాపించారు. 110 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు కూడగట్టి మండల్ కమిషన్ నివేదికను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. 1982లో 5 లక్షల మంది సంతకాలు సేకరించి, నివేదిక అమలు అయ్యేలా చూడాలని అప్పటి రాష్ట్రపతి జైల్సింగ్కి ఆయన విన్నవించారు. ఓబీసీల కోసం ఎన్నో చేసిన కర్పూరీ ఠాకూర్ మరణంతో ఓబీసీల రిజర్వేషన్‌తో పాటు సోషలిస్ట్ రాజకీయాల ప్రధాన ఎజెండా కనుమరుగైంది. కర్పూరీ ఠాకూర్ శత జయంతి సందర్భంగా అతని స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
వెంకటకిషన్ ఇట్యాల
99081 98484