తెలంగాణ ఉద్యమం. అస్తిత్వ ఉద్యమాల ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు! త్యాగాలకు తెగించి సాధించుకున్న రాష్ర్టాన్ని.. సబ్బండ వర్గాల సంక్షేమానికి, ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను సాఫల్యం చేసిన ఉద్యమ రథసారథి కేసీఆర్! 25 ఏండ్ల క్రితం జలదృశ్యంలో పురుడు పోసుకున్న ఉద్యమం అనేక ఆటుపోట్లను చవిచూసింది. ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ ఫీనిక్స్
పక్షిలా మళ్లీ లేచి.. అస్తిత్వ ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమాలు సాగించి.. పోరు పంటలు పండించి.. రాష్ట్రసాధన స్వప్నాన్ని సాకారం చేసింది. రాష్ట్రంగా అవతరించిన నాటినుంచి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణగా ముందుకు సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నాలుగున్నర కోట్ల ప్రజలు స్వరాష్ట్ర ఆకాంక్షతో ఉవ్వెత్తున ఎగిసిన క్షణం.. ప్రత్యేక తెలంగాణ దిశగా కీలక ముందడుగు పడిన అపూర్వ ఘట్టం నవంబర్ 29, దీక్షాదివస్ ప్రత్యేకం.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాట ఘట్టాలు, ఎన్నో సంఘర్షణలున్నాయి. భావోద్వేగాల సమ్మిళితంగా, ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ ఉద్యమం నిదర్శనం. స్వయం పాలన కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన రణంలో ప్రతి ఒక్కరూ కదం కలిపారు. ఉద్యమ గొంతుకలై.. జై తెలంగాణ అంటూ నినదించారు. 2001లో టీ(బీ)ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. స్వరాష్ట్రం కోసం ఊరూ వాడ కదిలొచ్చింది. పోరాటంలో ఉద్యమ రథసారథి కేసీఆర్ వెన్నంటే నిలిచింది. ఆత్మగౌరవం కోసం.. నిధులు, నీళ్లు, నియామకాల కోసం జరిగిన యుద్ధంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు, బలిదానాల తర్వాత 2014, జూన్ 2న తెలంగాణ ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. అయితే నాటి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు చోటు చేసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి ఉద్యమానికి కొత్త స్ఫూర్తినిచ్చి తెలంగాణ గతిని మార్చిన దీక్షాదివస్ (నవంబర్ 29) తెలంగాణ ఏర్పాటుకు నాంది.
2009, అక్టోబర్ 9 హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా.. ఉమ్మడి ఏపీలోని జిల్లాలన్నింటినీ ఆరు జోన్లుగా విభజించి హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్లో భాగంగా చూపించారు. ఈ ఉత్తర్వుల్లో ఎక్కడా హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే పదం కానీ, 7వ జోన్ అనే పదం కానీ లేదు. అయినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం పరిపాలన విధానాల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లో హైదరాబాద్ నగరాన్ని ఫ్రీ జోన్‌గా, 7వ జోన్‌గా పరిగణించి యథేచ్ఛగా నియామకాలు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. అయితే, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణవాదులు, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి.
చివరికి నాటి ప్రభుత్వం.. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని నిరూపించకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో 2009, నవంబర్ 29 చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదించిన ఉద్యమ నేత అందుకు తగ్గట్టుగానే ఆమరణ దీక్షకు పూనుకున్న రోజది. సమైక్య రాష్ట్రంలో ఫ్రీ జోన్ వివాదంపై రాజుకున్న పోరు ఏకంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. సమైక్య పాలకుల పీఠాలను పెకిలించింది. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించిన ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు!
కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారో తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో. తేల్చుకోండి అంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇది యావత్ తెలంగాణను కదిలించింది.
ఆమరణ నిరాహారదీక్షకు ముందు రోజు అంటే నవంబర్, 28 రాత్రి కరీంనగర్లో ఉత్కంఠ పెరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర తెలంగాణ భవన్‌ను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్న కార్యకర్తలు, నేతలు, కళాకారులు తెల్లవార్లు ధూంధాం నిర్వహించారు. మరునాడు ఉదయం ఉద్యమ సారథి కేసీఆర్ సిద్ధిపేటకు బయల్దేరగా అత్యంత నాటకీయ పరిణామాల నడుమ అల్గునూరు చౌరస్తా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. జైలులోనే కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించడంతో యావత్ తెలంగాణ భగ్గుమన్నది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వం మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి.. ఆ తర్వాత నిమ్స్‌కు తరలించింది. నిమ్స్‌లో చేరిన తర్వాత కూడా కేసీఆర్ దీక్షను కొనసాగించారు. ప్రాణాలను లెక్కచేయని ఆయన దీక్షాదక్షత మూలంగా తెలంగాణ రణక్షేత్రమైంది.
కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్తలతో తెలంగాణ భగ్గుమన్నది. విద్యార్థులు ఆత్మ బలిదానాలకు పూనుకున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ఆ దీక్ష నలుదిక్కులను ఒక్కటిగా చేసింది. కులమతాలకు అతీతంగా ప్రతి మనిషినీ తెలంగాణవాదంపై నిలిపింది. విద్యార్థి లోకాన్ని ఉద్యమదారుల్లో ఉరికించింది. వర్సిటీలను పోరాటకెరటాలుగా మార్చింది. పట్టణాలను ప్రవహించే ఉత్తేజాలను చేసింది. పల్లె పల్లెను స్వాభిమాన సంద్రంగా మలిచింది. తెలంగాణ మోదుగు పూలవనమై విరిసింది. తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీని తాకేలా చేసింది.
తెలంగాణ ప్రాంతంలో మునుపెన్నడూ లేని ఉత్కంఠ భరితమైన క్షణాలు డిసెంబర్ 9 నాటికి ఏర్పడ్డాయి. ఒకవేళ కేసీఆర్‌కు జరగరానిదేమైనా జరిగితే తెలంగాణ ప్రాంతంలో అరాచకం సంభవిస్తుందనే భయాందోళనలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేయాలంటూ కాంగ్రెస్ పార్టీపై అసెంబ్లీ, పార్లమెంట్ లోపల, బయట ముప్పేట ఒత్తిడి పెరిగింది. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడిని కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది. చివరికి అనేక తర్జనభర్జనల అనంతరం కేంద్ర హోంమంత్రి చిదంబరం తన నివాసం న్యూఢిల్లీ సౌత్ బ్లాక్ నుంచి 2009, డిసెంబర్ 9 రాత్రి 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ఏకవ్యాఖ్య ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ అంతటా సంబురాలు మిన్నంటాయి. అయితే, సీమాంధ్ర సమైక్య నాయకులు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ కేంద్రాన్ని బెదిరించారు. దీంతో తెలంగాణపై వెనక్కి తగ్గిన కేంద్రం.. 2009, 23న తెలంగాణ ఏర్పాటు మాట తప్పడంతో మరోసారి తెలంగాణ భగ్గుమన్నది.
నాటి కేంద్రం తీరుతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ రాజకీయ చాణక్యంతో పోరు నడిపారు. అన్ని పార్టీలను, వర్గాలను, ప్రజలను జేఏసీలుగా ఏకం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సంయుక్తంగా ఏర్పడిన తెలంగాణ జేఏసీకి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని కన్వీనర్‌ను చేశారు కేసీఆర్. టీజేఏసీ ఆధ్వర్యంలో 2011, మార్చి 10న మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మెలను నిర్వహించింది. 42 రోజుల పాటు తెలంగాణను స్థంభించింది. 2012, సెప్టెంబర్ 30న సాగరహారం నిర్వహించింది. తెలంగాణ రాదేమోనన్న అనుమానంతో రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. తెలంగాణ ప్రాంతం అల్లకల్లోలంగా మారి ఉమ్మడి రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ముందు, విస్తృత సంప్రదింపులు అవసరమనే సాకుతో 2010, ఫిబ్రవరి 3న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిం ది. అయితే సుదీర్ఘ చర్చలు, పరిణామాల అనంతరం 2013, జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2013, అక్టోబర్ 3న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఎట్టకేలకు 2014 ఫిబ్రవరి 13న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఆ తర్వాత 2014, మార్చి 1న ఏపీ పునర్వ్యవస్థీకణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. 2014, జూన్ 2న సమైక్య పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగింది. ఉద్యమసారథి కేసీఆర్ అకుంఠిత దీక్షతో, అమరుల త్యాగాల ఫలితంగా, కోట్లాది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
– (వ్యాసకర్త: మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే)
బాల్క సుమన్