– నర్సరీ పేరుతో టేకు చెట్లు నరికివేత
– అవసరం లేకున్నా టేకు చెట్ల తొలగింపు
– దారి తప్పుతున్న విలువైన అటవీ సంపద ఎటువైపు
లక్ష్మిదేవిపల్లి, ఫిబ్రవరి 16 : అభివృద్ధి పేరుతో అటవీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. అవసరం లేకున్నా పచ్చని చెట్లను నేలకూలుస్తూ దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక వన్యప్రాణి సంరక్షణ విభాగం పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో నర్సరీల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నర్సరీల కోసం ఎంతో విలువైన చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నా అడిగేవారు కరువయ్యారు. నరికిన చెట్లను సైతం లెక్కపత్రం లేకుండా పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ బంగారు చెలక ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఎర్రజిలక బీట్ పరిధిలో ఎంతో విలువైన టేకుచెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ చెట్లు అక్రమార్కుల పాలు కాకుండా రక్షించుకునే బాధ్యత అటవీ శాఖపై ఉంది. కానీ అభివృద్ధి పేరుతో టేకుచెట్లను సైతం తొలగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తొలగించిన చెట్లను ఫారెస్ట్ డిపోకు తరలించే క్రమంలో అవి పక్కదారి పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరం లేకపోయినా టేకు చెట్లను తొలగించి, వాటి మొద్దులను అటవీ శాఖాధికారులు లెక్కకట్టి, వాటికి సీరియల్ నెంబర్లు కేటాయించాల్సి ఉంది. అంతేకాకుండా మొద్దులను భద్రంగా అటవీశాఖకు చెందిన డిపోకు తరలించాల్సి ఉంటుంది. కాని కొందరు అక్రమార్కులు తొలగించిన చెట్లను రాత్రికి రాత్రి మాయం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాకుండా చెట్లను తొలగించాల్సిన పరిధికంటే ఎక్కువ పరిధిలో వాటిని తొలగించి అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని తెలుస్తోంది. కొందరు అటవీ శాఖకు చెందిన సిబ్బంది చేతివాటం కూడా ఇందులో ఉందని, వారి సహకారంతోనే విలువైన టేకు దిమ్మెలు దారి మళ్లిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
రాత్రి వేళల్లో ఎవరికంటా పడకుండా టేకు దిమ్మెలతో పాటు మరెన్నో విలువైన వృక్ష సంపదను అడవి దాటించేసి తద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని భోగట్ట. డిపోలకు తరలించిన టేకు దిమ్మెలను వేలంపాట ద్వారా అటవీ శాఖ విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కొందరు అక్రమార్కులు విలువైన కలపను దారిమళ్లించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ విషయమై వైల్డ్ లైఫ్ ఎఫ్ డి ఓ..బాబును వివరణ కోరగా అక్కడ జరుగుతున్న టేకు చెట్ల తొలగింపు తన దృష్టిలోకి రాలేదని కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అటవీ సంపద అక్రమార్కుల పాలు..?