ప్రపంచ దేశాల్లో రాజకీయ నాయకులందరినీ పరిశీలించినా, మన ప్రధాని నరేంద్ర మోదీ వంటివాడు కనపడడు. ఎందుకంటే విదేశాలకు వెళ్లినప్పుడు మహా భారతంలో శ్రీకృష్ణ భగవానుడిలాగ ప్రవచనాలు ఇస్తాడు. మళ్లా దేశంలో చేసే పనులు, రూపొందించే విధానాలు 130 కోట్ల సామాన్యుల నడ్డి విరిచేలా ఉంటాయి. ‘అపరిచితుడు’ సినిమాలో ఒత్తు జుట్టు ముడివేసుకొని, నిలువుబొట్టు పెట్టుకొని అమాయకంగా చూస్తున్న రామానుజానికి, జుట్టు విరబోసుకొని క్రూరంగా మాట్లాడే అపరిచితుడికి ఉన్నంత తేడా కనిపిస్తుంది ఈ విశ్వగురుకి, జాతీయనేతకి! ఊరికే ఒక అపవాదు వేసి వదిలేయలేము కదా! ఈ మాట నిరూపిద్దాం!
ఇక ప్రకృతి సహజమైన విపత్తులు, రైలు ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాథుడే లేడు. ఎవరి ఖర్మకి వారిని వదిలి వ్యాపారస్తుల సేవలో మునిగిపోయాడు ప్రధానమంత్రి. సామాన్యుల నెత్తి మీద జీఎస్టీలు, ధరల భారం ఎక్కువవుతుంటే, బడా బాబులకు బాంకు రుణాల మాఫీ మాత్రం సాఫీగా జరుగుతోంది. మోదీ ప్రకటించిన ఒక్క హామీ కూడా ఈ తొమ్మిదేండ్లలో అమలు కాలేదంటే అతిశయోక్తి కాదు.
భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు… ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని 2019 ఎన్నికల్లో ఊదరగొట్టారు. రైతులను కర్కశ వ్యాపారస్తుల చేతుల్లో ఇరికించే నల్లచట్టాలు తెచ్చి వారిని రోడ్డు మీద కూర్చోపెట్టారు. 700 మంది రైతుల ప్రాణాలు తీశారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, దానిని గాలికి వదిలేశారు. ఈ రోజుకీ దేశంలో 70 శాతం సాగుభూమికి వర్షమే ఆధారంగా ఉంది. 2022 నాటికి 1500 భారీ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ నీటిమూట అయింది. ప్రధాని మాటలు ఉత్తి కోతలుగా మిగిలాయి. దిగుబడి పెంచటానికి ఇస్తామన్న సాయిల్ హెల్త్‌కార్డులు 80 శాతం రైతులకు అందనే లేదు. ప్రజలకు కావలసిన మొట్టమొదటి అవసరం అన్నంలోనే ఇంత నిర్లక్ష్యం ఉంటే 2019లో హామీ ఇచ్చిన ఇంటింటికీ సురక్షిత తాగునీరు పథకం ఏమౌతుంది? 75 ఏండ్ల అమృతోత్సవ స్వాతంత్య్ర దినం ఘనంగా జరుపుకొన్నాం కానీ, దేశంలో ఇంకా 70 శాతం ఇండ్లకు తాగునీటి సరఫరా లేదు. సిగ్గుతో తలదించుకోవాలా? విదేశాలలో విర్రవీగాలా?
బీజేపీ వారు అడుగవచ్చు. ఇన్ని పనులు తొమ్మిదేండ్లలో చేయటం సాధ్యమా అని! మరి అది కూడా చూద్దాం! కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిన్నటి దాకా వలస పాలకులు దోచుకున్న రాష్ట్రం, కేంద్రం వివక్షతో ఏమీ సహాయం అందించని రాష్ట్రం తెలంగాణలో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? సాగునీరు, నిరంతరం ఉచిత కరెంటు, కేవలం మూడున్నరేండ్లలో ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల భారీ ప్రాజెక్టు, రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు, 40 వేల చెరువుల పునరుద్ధరణ ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చేయగలిగారు? వీటన్నింటికి కేవలం సామాన్య జనం మీద అభిమానం, పట్టుదల, నిబద్ధత, ప్రజ్ఞ, సామర్థ్యం మాత్రమే కదా కావాలి! మోదీకి, కేసీఆర్‌కు మధ్య ఉన్న తేడా ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. అంతేకాదు, ప్రపంచానికంతా అన్నం పెట్టే మహానుభావుడు ఈ రాష్ట్రం పండించిన బియ్యాన్ని మాత్రం తీసుకోడు! ఎంత వివక్ష! ఎంత ద్వేషం! ఎంత హ్రస్వదృష్టి మన ప్రధానమంత్రిది!
అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఎంతో శ్రద్ధ తీసుకోవలసి వచ్చేరంగం ఉద్యోగ, ఉపాధిరంగం. ఇవ్వటం మాట అటుంచి, మోదీ తీసుకున్న మొట్టమొదటి పెద్ద నిర్ణయం పెద్ద నోట్ల రద్దు కొన్ని కోట్ల మంది ప్రజల పొట్ట కొట్టింది. బడా వ్యాపారులు బాగుపడ్డారు కానీ, అతి సామాన్యులు చితికిపోయారు. ఆ తర్వాత ఆ టర్మ్‌లో మోదీ చేసిన విదేశీ పర్యటనలన్నింటిలో దేశం వెలిగిపోతుందన్న మాటలే మాట్లాడారు. ఇక్కడ ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడిపోయారు.
విద్యా విధానం పూర్తిగా నాశనమైంది. శాస్త్రీయ అంశాలు సాంకేతికత కాకుండా చరిత్రతో సహా మార్చేసి రాయటమే తప్ప, స్కూలు డ్రాపౌట్లు లేకుం డా చేస్తామన్న మాట ఎటోపోయింది. మౌలిక వసతులు కూడా సమకూర్చటం లేదు కొన్ని రాష్ర్టాల్లో. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఒక సందేహం రావచ్చు. ఒక దేశాన్ని పాలించలేని నాయకుడు విశ్వగురు అన్న ప్రచారం ఎలా జరుగుతోంది అని! ఈ మాట అర్థం కావాలంటే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఏం చేశాడో అర్థం చేసుకోవాలి. మొట్టమొదటగా ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి మోదీ ఒక ప్రచార గుంపును నెలకు రూ.5 లక్షలు ఇస్తూ పోషించాడు. వాళ్లు రోజూ మోదీ అది చేశాడు, ఇది చేశాడని ప్రచారం మాత్రం చేయాలి. కొన్నాళ్లకు అది గుజరాత్ మాడల్ పరిపాలనగా రూపుదిద్దుకున్నది. నిజానికి అక్కడ జరిగిందేమీ లేదు. కానీ ప్రచారం ముమ్మరంగా జరిగి, ప్రత్యర్థులని అణచివేస్తూ పరిపాలన సాగించాడు మూడు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా, ఆ ప్రచార హోరుతో, వాజపేయి వంటి సీనియర్ నాయకులకు ఇష్టం లేకపోయినా, 2014లో ప్రధానమంత్రి పీఠం అధిరోహించాడు. ఇప్పుడు అదే పంథాలో విదేశాల్లో విశ్వగురు ప్రచారం సాగుతున్నది. నిజానికి నరేంద్ర మోదీ ఒక చక్కని అవకాశం చేజార్చుకున్నాడు. ప్రధాని అవగానే వ్యవసాయం, ఉపాధిరంగం మీద దృష్టిపెట్టి ఎంతో వైవిధ్యభరితమైన భారతదేశంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేసి ఉంటే ఉద్యోగరంగం బాగుండేది. దేశానికి ఆదాయం బాగుండేది.
ఈ కారణాలతోనే దేశం బయట ఉన్న భారతీయులు మోదీ పిచ్చిలో ఊగిపోతుంటే, దేశంలోని ప్రజలు ఆయన విధానాలతో విసిగిపోతున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఎంత భేదం ఉందో తెలుసుకుంటే వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు సరైన రాజకీయ పార్టీని ఎన్ను కుంటారు. ఏ రంగం తీసుకొని అయినా తెలంగాణ, భారతదేశంలోని భాజపా పాలిస్తున్న ఏ రాష్ట్రమైనా చూసి ఈ రెండింటిని పోలిస్తే అసలు బండారం బయటపడుతుంది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కలేనట్టు, దేశ నేత కాలేనివాడు విశ్వగురు కాలేడని స్పష్టమవుతుంది. ఆలోచించండి, పరిశీలించండి. జై తెలంగాణ!
-కనకదుర్గ దంటు
89772 43484