జనవరి 6న వెదిరె శ్రీరాం చేసిన మరో దారుణమైన ఆరోపణ ఏమిటంటే.. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) పనులు 95 శాతం పూర్తి అయ్యేదాకా ప్రాజెక్టును ఆపమని ఎవరూ అడగలేదు. RLISను ఎవరూ ఆపలేదు. ఆపింది NGT మాత్రమే. RLIS టెండర్లు పూర్తి అయ్యేదాకా కేసీఆర్ నోరు మెదపలేదు, 2020 ఆగస్ట్‌లో జరగవలసిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ దాకా వాయిదా వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నీటిని తరలించే సామర్థ్యం 4.3 టీఎంసీల నుంచి 13.7 టీఎంసీలకు పెరిగింది.’
ఈ ఆరోపణలన్నీ ఎక్కడో విన్నట్టు ఉంది కదా! నిజమే. జనవరి 2న రాష్ట్ర అసెంబ్లీలో నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గారి ప్రసంగంలో విన్నవే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రతిఘటన ఎప్పుడు మొదలయ్యింది, ఎట్లా కొనసాగింది చూస్తే వీరి అబద్ధాలు, వక్రీకరణల బండారం తేటతెల్లం అవుతుంది. నిజానికి జనవరి 3న తన్నీరు హరీశ్‌రావు గారు ఈ పని చేసి ఉన్నారు. వెదిరె మళ్ళీ అవే అంశాలను లేవనెత్తారు కాబట్టి మళ్ళీ చెప్పవలసి వస్తున్నది.
2019 నవంబర్‌లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి 797 అడుగుల లోతు నుంచి రోజుకు 3 టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కాంప్లెక్స్‌కు తరలించే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపడుతున్నట్టు, దానికి అనుబంధంగా శ్రీశైలం కుడి కాలువ లైనింగ్, బనకచర్ల నుంచి నీటిని రాయలసీమ ప్రాంతాలకు మోసుకుపోయే కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపడుతున్నట్టు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. దీనిపై పత్రికల్లో డిసెంబర్లో కూడా కథనాలు వెలువడినాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై పత్రిక కథనాల క్లిప్పింగ్స్‌ని జత చేస్తూ కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి 29.01.2020న లేఖ రాసింది.
ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి వీలు లేదని, కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా ఉండే రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఏపీ కొత్త ప్రాజెక్టు పనులను చేపట్టకుండా నిరోధించాలని కోరింది. ఈ లేఖ రాసిన నెలకు ప్రాజెక్టుకు, అనుబంధ పనులకు సంబంధించి రూ.6,829.15 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ జీవో 203ను 5.5.2020న విడుదల చేసింది. వెంటనే 12.05.2020న కేఆర్ఎంబీ చైర్మన్‌కు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసినారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, దాని అనుబంధ పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేయడం అక్రమం, ఏపీ విభజన చట్టం సెక్షన్ 84 ప్రకారం చట్ట వ్యతిరేకం, కాబట్టి ఏపీ ప్రభుత్వాన్ని జీవో 203 అమలు విషయంలో ముందుకు సాగకుండా నిరోధించాలని గట్టిగా కోరినారు.
ఈ లేఖ ప్రతిని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కూడా పంపించారు. ఆ తర్వాత 02.10.2020న నాటి సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్కి స్వయంగా ఒక లేఖ రాసినారు. ఏపీ అక్రమంగా, చట్టవిరుద్ధంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు పెట్టాలని కోరినారు. 6.10.2020న జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం సమక్షంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపకపోతే తాము కూడా ఆలంపూర్ వద్ద బ్యారేజి నిర్మించి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టు చేపడతామని హెచ్చరించారు. కేసీఆర్ మాటలు మినిట్స్‌లో ఈ విధంగా నమోదు అయినాయి.
He stated that Pothyreddypadu project of AP does not have any water allocations by KWDT-I. The project was operationalized to supply drinking water to Chennai. It was originally designed for 1,500 cusecs in the then combined AP against the interests of Telangana. Later on, it was expanded to 11,500 cusecs, then to 40,000 cusecs and now they are expanding it to 84,000 cusecs and are planning to take 8 TMC per day. He further asserted that the water is being transferred by AP from Krishna basin to out of Krishna basin through this project with no water allocations to these projects by the Tribunal and without appraisal of DPRs and also without obtaining the required statutory clearances for these projects. He also stated that, if AP continues with this project, then Telangana would construct a 3 TMC project at Alampur and draw waters. He stated that only Tribunal under section 3 of ISRWD Act of 1956 can be a solution.
వారికి తగినంత సమయాన్ని ఇచ్చి, అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ప్రతి చర్యగా కృష్ణా జలాల వినియోగం కోసం జోగులాంబ బ్యారేజి, భీమా వరద కాలువ, సుంకేశుల జలాశయం నుంచి మరో ఎత్తిపోతల పథకం, పులిచింతల జలాశయం నుంచి ఎడమ కాలువ, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ నుంచి ఎత్తిపోతల పథకం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను తయారు చేయమని సాగునీటి శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఇది రాయలసీమ ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనివార్య ప్రతిఘటన చర్య. ఇప్పుడు చెప్పండి శ్రీరాం గారు.. రాయలసీమ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తి అయ్యేదాకా ప్రాజెక్టును ఆపమని ఎవ్వరూ అడగలేదని చేసిన మీ ఆరోపణలో నిజం ఉందా? కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నదంటే.. జీవో 203 జారీ అయిన తర్వాత నిరంతరాయంగా పోరాడుతూనే ఉన్నది. డిసెంబర్ 2023 వరకు 19 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబీకి రాసింది. ఆ తర్వాత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పోరాటం కొనసాగించింది. గవినోల్ల శ్రీనివాస్ వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసి గట్టిగా వాదనలు వినిపించింది. అందరి వాదనలు విన్న గ్రీన్ ట్రిబ్యునల్ 29.10.2020న పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఏపీని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుండడంతో కోర్టు ధిక్కరణ కేసు కూడా దాఖలు అయ్యింది.
ఏపీ తాము డీపీఆర్ తయారీ కోసం ప్రాథమిక తవ్వకాలు మాత్రమే చేస్తున్నామని, తాము ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. పర్యావరణ అనుమతి లేకుండాఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్న ఏపీ దుశ్చర్యను వ్యతిరేకించవలసిన కేంద్ర పర్యావరణ శాఖ పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నప్పటికీ.. వాటిని మరుగునపరచి, ప్రాజెక్టుకు అనుకూలంగా అఫిడవిట్ సమర్పిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద పర్యావరణ ఉల్లంఘనలు ఏ విధంగా జరుగుతున్నాయో, ప్రాజెక్టు పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అన్ని సాక్ష్యాధారాలు సమర్పించి మళ్లీ విచారణ జరపాలని డిమాండ్ చేసింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ మళ్లీ విచారణ చేపట్టక తప్పలేదు.
తెలంగాణ వాదనలు విన్న గ్రీన్ ట్రిబ్యునల్ 17.12.2021న వెలువరించిన తుది తీర్పులో ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నట్టు నమ్మి, పర్యావరణ అనుమతి వచ్చేదాకా ప్రాజెక్టు పనులు చేపట్టరాదని ఆదేశించింది. అప్పటినుంచి పనులు ఆగిపోయే ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ తనకు తానూ సుమోటోగా రాయలసీమ పనులు ఆపలేదు శ్రీరాం గారు. తుది తీర్పుకు వాయిదా పడిన కేసును తెలంగాణ ప్రభుత్వం మళ్లీ విచారణకు డిమాండ్ చేసి, పర్యావరణ ఉల్లంఘనల సాక్ష్యాలు ముందుపెట్టి బలమైన వాదనలు వినిపిస్తే ఎన్జీటీ ఆ తీర్పు ఇచ్చింది. ఎన్జీటీ తొలుత పనులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి మేరకు సమగ్ర విచారణ అనంతరం 2021 ఫిబ్రవరిలో పర్యావరణ అనుమతి పొందే వరకు ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని ఆదేశించింది. ఇదే సత్యం. అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయి ఉన్నా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు మళ్ళీ మొదలైనట్టు సమాచారం. ఈ లైనింగ్ పనులు పూర్తి అయితే కాలువ ప్రవాహ సామర్థ్యం 92 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని తెలంగాణ ఇంజనీర్లు అంచనా వేశారు. అయితే కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం కాలువ ప్రవాహ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులే ఉన్నది తప్ప ఎలాంటి పెంపు జరగలేదు.
ఇక చివరి అంశం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నీటిని తరలించే సామర్థ్యం 4.3 టీఎంసీల నుంచి 13.7 టీఎంసీలకు పెరిగింది అన్న ఆరోపణలో నిజమెంతో పరిశీలిద్దాము. 1976లో వెలువరించిన తీర్పులో బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే పరిగణించింది. శ్రీశైలం జలాశయం నుంచి 33 టీఎంసీల ఆవిరి నష్టాలను మాత్రమే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది తప్ప, ఆంధ్రప్రదేశ్ ఎంత వేడుకున్నా, సాగునీటికి కేటాయింపులు చేయలేదు. మానవతా దృక్పథంతో మద్రాస్ నగరానికి 15 టీఎంసీల తాగునీరు అందించడానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య 1977లో ఒక ఒప్పందం కుదిరింది.
ఆ ఒప్పందం ప్రకారం పోతిరెడ్డిపాడు వద్ద నిర్మించే రెగ్యులేటర్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని తాగునీటి కోసం మాత్రమే తరలించాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీల కృష్ణా నికర జలాలను కేటాయిస్తూ కేంద్ర ప్లానింగ్ కమిషన్ నుంచి అనుమతి పొందింది. అట్లా పోతిరెడ్డిపాడు నుంచి తరలించే కృష్ణా నికర జలాల పరిమాణం 34 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం కుడి గట్టు కాలువను (19 టీఎంసీలు) తెరపైకి తెచ్చి, చెన్నై తాగునీటి పథకంతో (15 టీఎంసీలు) కలిపి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం 11,500 క్యూసెక్కులకు పెంచినారు. 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం కావలసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో, 4 గేట్లతో నిర్మాణం అయ్యింది. ఆ తర్వాత అదనపు జలాల వినియోగం కోసం తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, గురు రాఘవేంద్ర తదితర ప్రాజెక్టులు నిర్మించుకున్నారు.
ఈ ప్రాజెక్టుల కింద 350 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలు నిర్మించుకున్నారు. ఈ ప్రాజెక్టులకు వేటికీ నికర జలాల కేటాయింపులు లేవు. ఏ ట్రిబ్యునల్ అనుమతులు లేవు. ఇవన్నీ పెన్నా బేసిన్లో ఉండే ప్రాంతాలకు కృష్ణా నీటిని సరఫరా చేసే ప్రాజెక్టులు. ట్రిబ్యునల్ అనుమతులు లేని, బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడానికి వైఎస్ఆర్ హయాం లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచుకున్నారు. కొత్తగా 10 గేట్లు నిర్మాణం అయినాయి. అప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 88,000 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.
కొత్తగా రోజుకు 3 టీఎంసీలను తరలించే సామర్థ్యం కలిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించింది. పోతిరెడ్డిపాడు నుంచి అనుమతి కేవలం 34 టీఎంసీలకు ఉంటే ఆంధ్రా ప్రభుత్వం 250-300 టీఎంసీల నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయిన, వంద శాతం కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కొత్త ప్రాజెక్టులుగా ముద్ర వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో ఏనాడూ జాడ, పత్తా లేని, పెద్ద ఎత్తున బేసిన్ ఆవలకు నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రం కొత్తది కాదట. ఆనాడు ఈ అంశంపై విభేదించి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్జీటీ విధించిన స్టే కారణంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు ఆగిపోయి ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయి ఉన్నా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు మళ్ళీ మొదలైనట్టు సమాచారం. ఈ లైనింగ్ పనులు పూర్తి అయితే కాలువ ప్రవాహ సామర్థ్యం 92 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని తెలంగాణ ఇంజనీర్లు అంచనా వేశారు. అయితే కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం కాలువ ప్రవాహ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులే ఉన్నది తప్ప ఎలాంటి పెంపు జరగలేదు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం 13 టీఎంసీలకు పెరిగిందన్న ప్రచారం పచ్చి అబద్ధం. వాస్తవానికి 2009 నాటికే పోతిరెడ్డిపాడు వద్ద 14 గేట్లు, 5,500 వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యం కలిగిన ఒక పవర్ హౌజ్ నిర్మాణమై ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో నీరు 800 అడుగుల నుంచి గరిష్ట నీటిమట్టం 885 అడుగుల వరకు పోతిరెడ్డి పాడు తూముల డిశ్చార్జ్ సామర్థ్యం ఎంతనో డిజైన్ ఇంజినీర్లు లెక్కగట్టి ఉన్నారు. వాటిని పైన పట్టికలో చూడగలరు.
ఈ పట్టికను విశ్లేషిస్తే 800 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు డిశ్చార్జ్ సామర్థ్యం 77,460 క్యూసెక్కులైతే 885 అడుగుల వద్ద అది 1,83,216 క్యూసెక్కులకు పెరుగుతుంది. అంటే హెడ్ పెరిగితే తూముల డిశ్చార్జ్ సామర్థ్యం పెరుగుతుందన్న మాట. దీన్ని బట్టి తెలుస్తున్నదేమిటంటే.. వైఎస్సార్ హయాంలోనే 2009 నాటికే 885 అడుగుల వద్ద పోతిరెడ్డి పాడు డిశ్చార్జ్ సామర్థ్యం 1,83,216 క్యూసెక్కులు ఉందన్న మాట. 2009లో కృష్ణా నదిలో సంభవించిన భారీ వరదల్లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో పోతిరెడ్డి పాడు తూము ద్వారా ఒక లక్షకు పైగా క్యూసెక్కులు పోయినట్టు నమోదు అయ్యింది. ఇప్పుడు చెప్పండి శ్రీరాం గారు.. పోతిరెడ్డిపాడు విస్తరణ పాపం ఎవరిది? దాన్ని వ్యతిరేకించి వైఎస్సార్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన, రావాలని ఆదేశించిన కేసీఆర్‌దా లేక ఆ విస్తరణను వ్యతిరేకించకుండా మిన్నకుండిపోయిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, హారతులు పట్టిన మంత్రులదా? ఇకనైనా ఇటువంటి అబద్ధపు ప్రచారాలు మానేస్తే మేధావిగా మీ గౌరవం నిలబడుతుంది.

– (వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ) శ్రీధర్‌రావు దేశ్‌పాండే 94910 60585