Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సరికొత్త రాజకీయ గాలి వీస్తున్నది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు పాత పార్టీలను తిరస్కరించి నూతన రాజకీయ శక్తులకు పట్టం గట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత అనూరకుమార దిస్సనాయకే (క్లుప్తంగా ఏకేడీ) విజయం సాధించడం ఎగుడుదిగుడుగా సాగుతున్న ద్వీప దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపు అనే చెప్పాలి. ఇన్నాళ్లూ దేశంపై పెత్తనం సాగించిన జాతీయవాద పార్టీలు ప్రాబల్యం కోల్పోవడాన్ని ఇది సూచిస్తున్నది. శ్రీలంక స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రధాన పక్షాలైన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ), యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)లు, వాటి అంతే వాసీలు కాకుండా మూడో పార్టీ తొలిసారిగా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నది. జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడైన దిస్సనాయకే దేశ పగ్గాలు అందుకున్నారు.
అయితే ఇది అంత సులభంగా జరగలేదు. హోరాహోరీ ఎన్నికల పోటీలో తొలి విడత ఓట్ల లెక్కింపులో ఏ ఒక్కరికీ మెజారిటీ (51 శాతం ఓట్లు) రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి వచ్చింది. ఇది కూడా శ్రీలంక చరిత్రలో కనీవినీ ఎరుగని విషయమే. అంతిమ విజేతగా దిస్సనాయకే నిలువగా, మరో విపక్ష అభ్యర్థి సాజిత్ ప్రేమదాస రెండోస్థానంలో, అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న రనిల్ విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచారు.
అవినీతిని అంతం చేయడం, జాతి దురహంకారాన్ని రూపుమాపడం, రాజకీయ సంస్కృతిని సమూలంగా మార్చివేయడం తన ప్రథమ కర్తవ్యాలుగా ఉంటాయని ఏకేడీ తన తొలిస్పందనలో వెల్లడించారు. సింహళ, తమిళ, ముస్లిం వర్గాలుగా విడిపోయిన శ్రీలంక సమాజాన్ని ఒకేతాటి మీదకు తేవడం ఆహ్వానించదగినదే. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ఈతిబాధల నుంచి ప్రజలను విముక్తులను చేయడమూ అత్యవసరమే. ప్రజలు తక్షణ ఉపశమనం కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలు విస్పష్టంగా తెలియజేశాయి. అయితే ఏకేడీ ఎన్నికతో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని భావించలేం. ఆయన నేతృత్వంలోని జేవీపీకి పార్లమెంటులో మూడే స్థానాలున్నాయి. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జేవీపీ బలం పుంజుకోగలిగితేనే ఏకేడీ అధికారం సుస్థిరమవుతుంది.
శ్రీలంక-భారత్ సంబంధాలు ఈలం వేర్పాటువాద ఉద్యమకాలం నుంచీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో అదానీ సంస్థతో విద్యుత్తు ఒప్పందం కారణంగా రెండు దేశాల మధ్య దూరం ఏర్పడిన సంగతి తెలిసిందే. నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపడుతున్న ఏకేడీకి చైనా అనుకూలుడిగా పేరుంది. ఆయన చైనా వైపు మరింతగా మొగ్గితే ఆ దూరం మరింతగా పెరుగవచ్చు. చైనా ఉక్కు కౌగిలిలోకి ఒదిగిపోతున్న పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకోవడం భారత్‌కు పెను సవాల్‌గా మారింది. భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలు ఒక్కటొక్కటి గా చైనా ప్రభావ పరిధిలోకి వెళ్తుండటం మనం చూస్తున్నాం. నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్ ఈసరికే చైనా ఉచ్చులోకి వెళ్లా యి. తాజాగా శ్రీలంక ఆ జాబితాలోకి చేరిపోయింది. అధ్యక్షునిగా ఏకేడీ ఎన్నిక ఓ ముక్తాయింపు మాత్రమే.