చరిత్రలో కొందరు వ్యక్తులు కాలాన్ని మార్చరు. కాలమే వారిని గుర్తుగా మార్చుతుంది. అలాంటి నాయకులే తెలంగాణలో కేసీఆర్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా. ఇద్దరూ తమ తమ ప్రాంతాల్లోని ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధులు. ఇద్దరూ అధికారం కోసం కాదు.. గుర్తింపు కోసం, స్వేచ్ఛ కోసం ఉద్యమించిన నాయకులు.
కేసీఆర్ రాజకీయ ప్రయాణం ఒక సాధారణ రాజకీయం లెక్క కాదు. తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా ఉన్న కాలంలో.. తెలంగాణ రాష్ట్రం రావాలి అని స్పష్టంగా, ధైర్యంగా చెప్పిన అరుదైన నాయకుడు. ఉద్యమం అంటే నినాదాలు కాదు, అది దీర్ఘకాల యుద్ధం అని అర్థం చేసుకున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ఆయన భావోద్వేగంతో మాత్రమే కాదు.. వ్యూహంతో నడిపారు. ప్రజలను చైతన్యపరిచారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లారు. సకల జనులను ముందుండి నడిపించారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతానికి రాజకీయ అస్తిత్వాన్ని కల్పించారు. రాష్ర్టాన్ని సాధించి, ఉద్యమ నాయకుడే పాలకుడిగా మారిన అరుదైన ఉదాహరణగా నిలిచారు. రాష్ర్టావతరణ తర్వాత కూడా కేసీఆర్ తెలంగాణ ఆత్మను పాలనలో ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. నీటి ప్రాజెక్టులు, సాగునీటి విస్తరణ, రైతు సంక్షేమం, సంక్షేమ, అభివృద్ధి పథకాలెన్నో. ప్రజల అవసరాల నుంచి పుట్టిన విధానాలే.
నెల్సన్ మండేలా ఒక వ్యక్తి పేరు కాదు.. అది ఒక యుగం. అపార్త్హెయిడ్ అనే వర్ణ వివక్ష వ్యవస్థను ఎదుర్కోవడం అంటే, ఒక ప్రభుత్వాన్ని కాదు..ఒక అమానుష సిద్ధాంతాన్ని ఎదుర్కోవడమే. ఆ పోరాటంలో మండేలా 27 ఏండ్ల్లు జైలు జీవితం గడిపారు. కానీ ఆయన ఆత్మను ఎవరూ జైలులో పెట్టలేకపోయారు. మండేలా పోరాటం అధికార మార్పు కోసం కాదు. ఆయన లక్ష్యం గౌరవం, సమానత్వం, మానవత్వం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, దేశాన్ని విభజించే గాయాలను మాన్పే ప్రయత్నం చేశారు. అపార్త్హెయిడ్ తర్వాత దక్షిణాఫ్రికాను ప్రజాస్వామ్య మార్గంలో నిలబెట్టిన నాయకుడు మండేలా.
కేసీఆర్, మండేలా.. ఇద్దరూ ప్రజల భావోద్వేగంతోపాటు స్పష్టమైన దిశను ఇచ్చారు. ప్రజలే వారి శక్తి. ఉద్యమాన్ని వ్యక్తి కేంద్రంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చారు. అణచివేతకు ఎదురు నిలబడ్డ ధైర్యం. ఒకరు ప్రాంతీయ వివక్షకు, మరొకరు వర్ణ వివక్షకు గురయ్యారు. ఉద్యమం నుంచి పాలన వరకు ప్రయాణం. పోరాట నాయకులుగా మాత్రమే కాదు.. పాలకులుగా కూడా బాధ్యత తీసుకున్నారు. కేసీఆర్ తెలంగాణను సాధించిన తర్వాత సామరస్య జీవనం, సమగ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. మండేలా స్వేచ్ఛ వచ్చిన తర్వాత శ్వేతజాతిని శత్రువులుగా చూడలేదు. రెయిన్బో నేషన్ అనే భావనను ముందుకు తెచ్చారు. చరిత్ర కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర నిర్మాతగా గుర్తుపెట్టుకుంటుంది. మండేలాను దక్షిణాఫ్రికా విమోచకుడిగా గుర్తుపెట్టుకుంటుంది. ఇద్దరూ ఒకే మాట చెప్పారు.. గౌరవం లేకుండా అభివృద్ధి లేదు, స్వాభిమానం లేకుండా స్వేచ్ఛ లేదు. తెలంగాణకు కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఒక యోధుడు. దక్షిణాఫ్రికాకు మండేలా ఒక అధ్యక్షుడు మాత్రమే కాదు.. ఒక యుగపురుషుడు. ఈ పోలిక యాదృచ్ఛికం కాదు. ఇది రెండు ఖండాల మధ్య ఉన్న మానవ అనుభవాల పోలిక.
-నాగరాజు గుర్రాల
0027765537388