పట్టుగొమ్మలు‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అని మహాత్మాగాంధీ అన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మద్యానికి దూరంగా ఉండటం, మౌలిక వసతులు కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయి. ఈ గ్రామానికి మూడు వైపుల నుంచి రెండు లైన్ల రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లతో గ్రామంలోకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది.
గత ఎనిమిదేండ్లుగా నా పరిశోధనలో ఈ గ్రామం అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ గ్రామం మత సామరస్యానికి పుట్టినిల్లు. ఈ గ్రామ జనాభా సుమారు 5,000, ఓటర్ల సంఖ్య సరిగ్గా 2400. సామాజిక వర్గాల వారీగా కుటుంబాలు ఎస్టీ: 5, ఎస్సీ: 230, బీసీ: 630, ఓసీ: 65, ముస్లిం మైనారిటీ: 40. ఈ గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి విస్తీర్ణం 4,192 ఎకరాలు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3,300 ఎకరాల భూమి ఉన్నది. ఒక కుమ్మరి సామాజిక వర్గం తప్ప అన్ని కులాల వారు, అన్ని మతాల వారున్నారు. ఇదీ స్థూలంగా ఆ గ్రామ స్వరూపం.
ఆ ఊరి పేరు తునికి ఖల్సా, మండలం వర్గల్, జిల్లా సిద్దిపేట. 1950, మే 21 వరకు ఈ గ్రామాన్ని తునికి అనే పేరుతో పిలిచేవారు. ఈ ప్రాంతంలో తునికి ఆకు (బీడీలు చేసే ఆకు) ఎక్కువగా లభించడంతో తునికి అనే పేరు వచ్చినట్టు చెప్తారు. ఖల్సా అనగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కలిగి ఉన్న భూములని అర్థం. ఈ గ్రామంలో ఇప్పటికి దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. (ఖల్సా అంటే స్వచ్ఛమైనది.) 1950, మే 22 నుంచి ఈ గ్రామాన్ని తునికి ఖల్సాగా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ గ్రామం చుట్టుపక్కల తునికి పేరుతో తునికి మక్త, తునికి బొల్లారం గ్రామాలున్నాయి. ఈ గ్రామం నెహ్రూ ఓఆర్ఆర్కు 20 కిలోమీటర్ల దూరంలో, రాజీవ్ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అన్నిరకాల రాజకీయ పార్టీలున్నాయి. ఇక్కడి వ్యవసాయ భూములు స్థానికులకు 1,113 ఎకరాలు, స్థానికేతరులకు 1,203 ఎకరాలున్నాయి. భూమి ఉన్న కుటుంబాల సంఖ్య 534, భూమి లేని కుటుంబాల సంఖ్య 396. సామాజిక వర్గాల వారీగా భూమి ఉన్న కుటుంబాల వివరాలు: ఎస్టీ: 0, ఎస్సీ: 135, బీసీ: 363, ఓసీ: 36, మైనారిటీ: 25.
ఇక్కడి ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడికి వంటిమామిడి కూరగాయల మార్కెట్ దగ్గరగా ఉండటంతో ఆధునిక పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, వరి, ఆలుగడ్డ ఇక్కడి ప్రధాన పంటలు. ప్రధాన సాగునీటి వసతి బోర్లు, చెరువు కుంటలు. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో ఇక్కడ భూగర్భ జలాలు పెరిగాయి. కూరగాయలు పండించడంతో ఇక్కడ రైతు, రైతు కూలీలకు నిత్యం పని దొరుకుతున్నది. రైతులకు, రైతు కూలీలకు చేతిలో ఎప్పుడూ డబ్బులుంటాయి. సుమారు 32 జతల ఎడ్లు, 46 ట్రాక్టర్లు, 19 ట్రాలీ ఆటోలు, 5 ప్యాసింజర్ ఆటోలు, 21 కార్లు, దాదాపు ప్రతి ఇంటికి ఒక సైకిల్ మోటార్ ఉన్నాయి. చాలామందికి పాలిచ్చే బర్రెలున్నాయి. 80 శాతం మంది అక్షరాస్యులే.
ఇంత పెద్ద గ్రామంలో ఒక హోటల్, ఒక స్వీట్‌షాప్, ఐదు బెల్ట్ షాపులు మాత్రమే ఉన్నాయి. యువత కూడా వ్యవసాయం పనులు, రకరకాల కంపెనీలలో ఎవరి పనులకు వారు వెళ్లిపోవడం మూలంగా ఇక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నది. ఇక్కడి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్నది. తక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. రెండు కుటుంబాలు మినహా దాదాపు అన్ని కుటుంబాలు వారి స్తోమతకు తగ్గట్టుగా అవసరాలు తీర్చుకునే స్థితిలో ఉన్నారు. ఇక్కడ పంచాయితీలు చాలా తక్కువ. చిన్న, చిన్న పంచాయితీలను కూడా గ్రామ పరిధిలో పరిష్కరించుకుంటారు. పోలీస్ స్టేషన్ వరకు ఈ గ్రామస్థులు పోరు అంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలు, రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే, ఎన్నికల తెల్లారి చాలా ఆత్మీయంగా కలిసి ఉంటారు.
ఈ గ్రామం వర్గల్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామ పంచాయతీలో 12 వార్డులున్నాయి. గ్రామ పంచాయతీలో 9 మంది సిబ్బంది పనిచేస్తారు. ఒక ట్రాక్టర్ ఉన్నది. గ్రామం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. ఐదు వాటర్ ట్యాంకులు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ, వంటగ్యాస్ కనెక్షన్ ఉన్నది. వ్యక్తిగత మరుగుదొడ్లున్నాయి. ఇక్కడ ఎక్కువగా ఆర్సీసీ ఇండ్లున్నాయి. ఈ ఊరు మాంసం విక్రయాలకు పేరుగాంచింది. గ్రామంలోని ప్రతి వీధికి సూచిక బోర్డులను ఏర్పాటుచేశారు. పార్కు, పార్కులో తెలంగాణ తల్లి, బతుకమ్మ విగ్రహాలు, జాతీయ జెండా ఉన్నది. గ్రామంలో చాలామంది జాతీయ నాయకుల విగ్రహాలున్నాయి. ఈ గ్రామంలో నూతన పంచాయతీ భవనం, జాతీయ బ్యాంకు, కరెంటు సబ్‌స్టేషన్, శ్మశానవాటిక, హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, ప్రైవేట్ పాఠశాల, రైతువేదిక, గ్రామ దేవతలు, అన్ని కులాలకు చెందిన పెద్ద పెద్ద దేవుని గుళ్లు, మసీదులున్నాయి. ఏటా ఏదో ఒక కులంవారు వారి వారి కులదేవతలకు పెద్ద ఎత్తున పండుగలు చేస్తారు. ఊరు నిండా సిమెంట్ రోడ్లు. గత ప్రభుత్వంలో 98 డబుల్ బెడ్రూంలు కట్టి అర్హులకు అందజేశారు.
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా/ చేయూత పింఛన్ల వంటి పథకాలతో పాటు వృద్ధాప్య పింఛన్లు 179, వితంతు పింఛన్లు 184, వికలాంగుల పింఛన్లు 36, బీడీ వర్కర్స్ పింఛన్ 18, ఒంటరి మహిళల పింఛన్లు 9 మందికి వస్తున్నది. అటు వ్యవసాయం, ఇటు కంపెనీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల మూలంగా ప్రజల చేతిలో డబ్బులాడుతున్నాయి. గత ఎనిమిదేండ్ల నా పరిశోధనలో ఈ గ్రామం స్వయం సమృద్ధి సాధించి ఆర్థికపరమైన ఇబ్బందులకు గురికాకుండా ఉన్నది. గత పదేండ్లుగా ఒక రైతు, ఇద్దరు రైతుకూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గ్రామంలో ప్రస్తుతం ఒక ఎకరా భూమి ధర రూ. ఒక కోటి పైన పలుకుతున్నది. పనిలో, సమష్ఠి నిర్ణయాలలో, గ్రామాభివృద్ధిలో ఈ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
-పులి రాజు
99083 83567