మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022 పార్లమెంట్ పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లు సహకార వ్యవస్థను కూల్చివేయడానికి ఉద్దేశించబడింది. సహకార వ్యవస్థను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేయడానికి జరుగుతున్న కుట్ర. రాజరిక వ్యవస్థ, నియంతృత్వ ప్రభుత్వాలు కూడా ఈ రకమైన చట్టాన్ని తీసుకురావడానికి సాహసించలేదు. కానీ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సహకార వ్యవస్థను నాశనం చేసే కుట్రకు తెరలేపింది. ప్రతిపాదిత బిల్లులోని 26, 63 సెక్షన్లు వ్యవస్థను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.
ప్రతిపాదిత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022 లోని సెక్షన్ 26,63లను తొలగించేలా పార్లమెంటు సభ్యులు బిల్లును వ్యతిరేకించాలని రైతులు డిమాం డ్ చేస్తున్నారు. తద్వారా రైతులే యాజమానులుగా సాగుతున్న ఐఎఫ్ఎఫ్సీవో, కేఆర్ఐబీహెచ్జీవో,ఎన్ఏఎఫ్ఈడీ కోఆపరేటివ్ బ్యాంకులను రక్షించాలని సహకార ధర్మపీఠం పౌర సమాజాన్ని, ముఖ్యంగా భారతీయ వ్యవసాయ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నది.
ఐఎఫ్ఎఫ్సీవో, కేఆర్ఐబీహెచ్జీవో,ఎన్ఏఎఫ్ఈడీ సహకార బ్యాంకులు గత 75 ఏండ్లుగా భారతీయ రైతుల త్యాగాలతో నిర్మితమయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థలో సహకార రంగం ప్రధాన వాటాదారుగా ఉన్నది. నేటికీ ఈ సహకార సంఘాలు మంచి లాభాల్లో నడుస్తున్నాయి. పూర్తిగా రైతులచేత ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వ్యవస్థ చట్టబద్ధంగా సభ్యునికి మాత్రమే వాటా మూలధనాన్ని అందించే హక్కు కలిగి ఉన్నది. అలాంటి సహకార రంగంలో షేర్ క్యాపిటల్‌ను పెంచడం పేరుతో రైతుల అనుమతి లేకుండానే ప్రైవేట్ పెట్టుబడిదారులకు వాటా మూలధనాన్ని అందించడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం ప్రతిపాదించిన 26, 63 సెక్షన్లు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, సహకార సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి.
ఈ రెండు సెక్షన్లు అమలైతే ప్రైవేట్ పెట్టుబడిదారులు 1956 నాటి షేర్ విలువ రేటుతో సహకార వ్యాపారాలను స్వాధీనం చేసుకుంటారు. ప్రైవేట్ సెక్టార్ మాత్రమే వ్యాపారం నిర్వహించేందుకు అధికారం కలిగి ఉంటుంది. రైతులు, అణగారిన ప్రజలు ఉమ్మడిగా సహకార వ్యాపారం చేసే హక్కును శాశ్వతంగా వదులుకోవాల్సి వస్తుంది. దీనివల్ల సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.
ప్రతిపాదిత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు 2022 డిసెంబర్ 7న ప్రవేశపెట్టబడింది. అయితే పార్లమెంటులోని ప్రతిపక్ష సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అందువల్ల ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకున్నది. బిల్లును వివరంగా అధ్యయనం చేయడానికి ఎంపీ చంద్ర ప్రకాష్ జోషి నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది.
జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (జేపీసీ) సహకార నాయకులు, సహకార సంస్థల అధికారులను మాత్రమే సంప్రదించి తన నివేదికను 2023 మార్చి 15 న సమర్పించింది. జేపీసీ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, సహకార విద్యావేత్తలతో సంప్రదించలేదు. ఆర్థిక వ్యవస్థ మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో కూడా సంప్రదించలేదు. ఎందుకంటే ఈ సవరణలు రాజ్యాంగ ప్రాథమిక స్వభావాన్ని మారుస్తాయి.
జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో, ప్రతిపాదిత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022లో రెండు సెక్షన్లు 26,63లను కొనసాగించడానికి అంగీకరించింది.
సవరణ బిల్లు అంశంపై సహకార ధర్మ పీఠం 2022 నవంబర్ 30న ఎంపీలందరికీ ఒక సందేశాన్ని పంపింది. అలాగే జేపీసీ ఏర్పాటు తర్వాత 2023 ఫిబ్రవరి13న కమిటీ చైర్మన్‌తోపాటు సభ్యులందరికీ ఒక వివరణాత్మక నివేదికను సమర్పించింది. కానీ జేపీసీ దాన్ని పట్టించుకోకుండానే 2023 మార్చి 15న తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికకు వ్యతిరేకంగా సహకార ధర్మ పీఠం 2023 మార్చి 22 న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌లతో పాటు రెండు సభల సభ్యులందరికీ మెమోరాండం సమర్పించింది.
ప్రస్తుతం ఆ బిల్లును వ్యతిరేకించేలా పార్లమెంటును ప్రభావితం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం పౌరసమాజం, రైతులు, వ్యవసాయ సంఘాల జోక్యం చాలా అవసరం. తద్వారా సహకార ఉద్యమాన్ని పరిరక్షించుకోవాలి. భారత రాజ్యాంగ ప్రాథమిక స్వభావాన్ని మార్చేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. దీనికోసం సహకార సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా కలిసి రావాలి.
(వ్యాసకర్త: ధర్మకర్త, సహకార ధర్మ పీఠం)
-సంభారపు భూమయ్య
82478 16648