కేసీఆర్ ఆశ, శ్వాస తెలంగాణే. నాడైనా, నేడైనా, రేపైనా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి పదేండ్ల వరకు తెలంగాణకు కంచెలా కాపలా కాశారు. కానీ, ఎన్నికల్లో అంతా తారుమారైంది. పాలిచ్చే బర్రెను తెగనమ్ముకున్న ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారు. ఏరి కోరి తెచ్చుకున్న ఆ దున్నపోతు నేడు ఎగిరెగిరి తంతుంటే అరిగోస పడుతున్నారు.
మాట ఇవ్వడం, మాట మార్చడం, మాయ చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని దగ్గరుండి చూశారు. అందుకే, కాంగ్రెస్కు పాలన చేతకాదని, ప్రజలను పీడించడం మాత్రమే తెలుసని హెచ్చరించారు. ఆయన అంచనాలను ఏమాత్రం తీసిపోకుండా రేవంత్ పాలన సాగుతున్నది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వర్గాన్నీ సంతృప్తి పరచలేకపోయింది. గడిచిన ఏడాది కాలంలో రోడ్డెక్కని వర్గం అంటూ లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. పాలన చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి ప్రచారార్భాటాలతోనే కాలం గడుపుతున్నారు. అబద్ధాలు ప్రచారం చేయడం, గత ప్రభుత్వంపై అభాండాలు వేయడం, హామీలు అమలు చేయలేక తప్పించుకుని తిరగడం రేవంత్ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను మెట్లుగా మలచుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సును అమలు చేసి, బస్సుల సంఖ్యను తగ్గించింది. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే వినోదం చూస్తున్నది. కోతలు, కొర్రీలు పెట్టి రుణమాఫీ అరకొరగా చేసి రైతులు రోడ్డెక్కేలా చేసింది. నాడు రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన బృహత్తర పథకం రైతుబంధును రేవంత్రెడ్డి ఎగతాళి చేశారు.
ఏడాదికి రూ.10,000 రైతులకు భిక్షగా వేస్తున్నారా? మూడు పంటలకు ఎందుకు సాయం చేయరని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే రూ.15,000 ఇచ్చి రైతుకు భరోసాగా నిలుస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆయన నేడు నిజంగానే రైతులకు భిక్షం వేసినట్టు విడతల వారీగా పెట్టుబడి సాయం ఇస్తుండటం విడ్డూరం. మూడో పంటకు సాయం ఇవ్వాలని నాడు నిలదీసిన రేవంత్.. నేడు ఇప్పటికే ఏడాదిగా రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇస్తున్న అరకొర సాయం నెల రోజులుగా సాగుతూనే ఉన్నది. మరో నెల అయినా ఈ ముచ్చట ఒడుస్తుందో, లేదో చెప్పలేం.
ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సరైన అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు నేడు వాటిని అమలు చేయలేక మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికలకు ముందు తమకు సంపద సృష్టించడం తెలుసని, దానిని పేదలకు పంచడమూ తెలుసని బీరాలు పలికిన భట్టివిక్రమార్కనేడు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. సంపద సృష్టించడం తెలుసని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, పథకాలు అమలు చేయలేమని చెప్తూ సాకులు వెతుకుతున్నారు. అప్పులు భారీగా ఉన్నా తమకు ఇబ్బంది లేదని నాడు గప్పాలు కొట్టిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటిమాటికీ అప్పుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై ఎనలేని భారం మోపుతున్నారు. దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రూ. లక్షన్నర కోట్లకుపైగా అప్పులు తెచ్చిన ప్రభుత్వం వాటితో ఒక్క కొత్త పథకమూ ప్రారంభించలేదు, ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. మరి ఆ రూ. లక్షన్నర కోట్లు ఏమైనట్టు?
తాము ఎన్నుకున్నది తమకు మంచి చేసే ప్రభుత్వమా? లేదా తమను ముంచే ప్రభుత్వమా? అన్నది తెలుసుకోవడానికి ప్రజలకు ఎక్కువ సమయం పట్టలేదు. అతి తక్కువ కాలంలోనే రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. తాము ఏం కోల్పోయామన్నది ప్రజలు చాలా తక్కువ సమయంలోనే తెలుసుకున్నారు. ఏమార్చిన మార్పు తమ బతుకులనే కూల్చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో చేసిన తప్పును తలుచుకుంటూ చింతిస్తున్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు తమను ఇప్పుడు కాలితో తంతున్న దున్నపోతును ఎగేసి తంతారు.