నీ ముక్కు ఎక్కడుందంటే.. సూటిగా చూపించకుండా తల చుట్టూ తిప్పి చూపించాడట వెనుకటికొకడు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిష్కరించాల్సిన ఆ సమస్య కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వనపర్తి మీదుగా సీఎం రేవంత్ రెడ్డికి చేరి, అక్కడి నుంచి యూ టర్న్ తీసుకొని వినతి పత్రంగా మారి ప్రజాభవన్‌కు వచ్చి వాలింది. ఇదీ.. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను హ్యాండిల్ చేస్తున్న తీరు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రేవంత్‌రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలకులు సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏర్పాటుచేసిన కంచెను తొలగించి ప్రజా పాలన అంటూ గప్పాలు కొట్టారు. ప్రగతిభవన్ పేరును మార్చి రాష్ట్ర ప్రగతికి అడ్డుకట్ట వేశారు. ప్రజాభవన్‌గా నామకరణం చేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ప్రజావాణి, ప్రజాదర్బార్ అంటూ ప్రజా సమస్యలను చిటికెలో తీరుస్తానని, ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం చూపుతానని పెదరాయుడు లెవల్లో పోజులు కొట్టారు. హంగూ ఆర్భాటంతో ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు. ప్రజాపాలనలో ప్రజా సమస్యలన్నీ మంత్రం వేసినట్టు మాయం చేస్తారేమోనని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు ప్రజాభవన్‌కు తరలివెళ్లారు. తాను లేకపోయినా మంత్రులు వస్తారని, అధికారులు నిత్యం ఉంటారని సమస్యలు పరిష్కరిస్తారని ప్రగల్భాలు పలికారు. కానీ, ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు కాదు కదా కనీసం అధికారులు కూడా కనిపించడం లేదు. సమస్యలు చెప్పుకునేందుకు 24 గంటలు గేట్లు తెరిచి ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పినట్టే గేట్లయితే తెరిచే ఉంటున్నాయి, కానీ మంత్రులు, అధికారులు సమస్యల నుంచి తప్పించుకొని తలుపులు మూసుకున్నారు. ఇప్పుడు ప్రజాభవన్‌లో సమస్యలు, వాటిని చెప్పుకునేందుకు వచ్చినవారి వెతలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి లక్షల మంది తమ సమస్యలను చెప్పుకొనేందుకు ప్రజాభవన్‌కు బారులు తీరుతున్నారు. లక్షల సంఖ్యలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కానీ, వాటిలో ఏ ఒక్కటీ పరిష్కారమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు చేసిన ఫిర్యాదులు, ఇచ్చిన వినతిపత్రాలు ఏమయ్యాయో తెలియదు. వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందనే విషయం చెప్పే నాథుడే లేడు. వాస్తవానికి ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అవ్వాలి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో నెలకొన్న సమస్య గురించి రాజధాని హైదరాబాద్‌కు వచ్చి చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరం. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజలు పడ్డ వెతలను కండ్లారా చూసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసి పాలనను వికేంద్రీకరణ చేశారు. తద్వారా ప్రజల వద్దకే పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎక్కడి సమస్యను అక్కడే పరిష్కరించేలా చూశారు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చాక మళ్లీ మొదటికి వచ్చింది.
సాధారణంగా కేపీహెచ్‌బీ కాలనీలో తాగునీటి సమస్య అక్కడే పరిష్కారం అవ్వాలి. దానికోసం వనపర్తికి వెళ్లి మరీ ముఖ్యమంత్రికి విన్నవించాల్సి రావడం దురదృష్టకరం. సీఎం ఒక్కఫోన్ కాల్ చేస్తే పరిష్కారం అవ్వాల్సిన సమస్యను మళ్లీ ప్రజావాణికి వెళ్లి విన్నవించుకోవాల్సి రావడం రేవంత్ పాలన వైఫల్యానికి నిదర్శనం. సమస్యలను, వాటి పరిష్కారాన్ని కేంద్రీకృతం చేసిన రేవంత్‌రెడ్డి ప్రజలను సమస్యల వలయంలో చిక్కుకునేలా చేశారు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ చుట్టూ మొలిచిన ముళ్ల కం చెలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజాపాలన పేరు చెప్పి ప్రజల సీఎం అయిన రేవంత్ ఇప్పుడు కనీసం ప్రజలను కలిసే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకే సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ విషయం పై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగ డంతో అపాయింట్మెంట్ దొరికింది. ఇక సామాన్యుల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా.
-(వ్యాసకర్త: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి )
గంగుల కమలాకర్