మరువదయ్య మరువదయ్య నీ త్యాగం ఈ లోకం
ఆ చంద్ర తారార్కం వెలుగును నీ ఆదర్శం
కరుగుతు వెలుగును పంచె సూర్యునిలా నీ రూపం
తలపుకొచ్చి ప్రతి ఎదలో పొంగుతున్నది శోకం
సిరులకు యే లోటు లేని కుదురులోన పుట్టినావు
పరుల బాధలను గాంచి కన్నీరై కరిగినావు
అనంతమగు కడలి వోలె అంతులేని నీ జ్ఞానం
అలసటన్నదే లేని అవని వోలె నీ పయనం
వేదంతో భాసిల్లే వేకువ ప్రాకారంలో
పసితనంలో నీ పఠనం నీ ప్రతిభకు తొలిబీజం
రామానుజ సమతత్వం శ్రీ వైష్ణవ తిరుతత్వం
మార్క్సిజంతో మేళవించి మంచి నీవు పెంచినావు
నేల మీద నడయాడే సందమామ దీవి నీవు
జాలి గుండె బుద్ధుని వలె మానవతకు తావి నీవు
ఆశలు నింపే బోధలు వేసవిలో వానజల్లు
ఉద్యమాల దారులలో నీ రాతలె హరివిల్లు
సుడిగుండాలెదురీదే విప్లవాల నావ నీవు
కష్టజీవి కడగండ్లను తొలిగించే తోవ నీవు
చండ్ర రాజేశ్వరుండు సుందరయ్య వేసినట్టి
ఉద్యమాల వారధివై ఉప్పెనలను ఆపినావు
నిస్వార్థం కొలువుండే చిరునామా నీ పాదు
నిజం ఎంత బరువున్నా భుజము నీవు వంచలేదు
ప్రతి మలుపులొ నీ గమనం విప్లవాల గుణపాఠం
అణువణువున కమ్యూనిజం నీవు నిలుపుకున్న ధనం
గుండె లోతులో నుండి ఉబికే నీ సూటిమాట
నిమిషములో ఎండనైన నీడవోలె మార్చుతుంది
నీ చూపుకు మునిగిపోయే పడవైన తేలుతుంది
నీ నవ్వుకు కటుసీకటి దీపంలా వెలుగుతుంది
కొన ఊపిరిలో సైతం విప్లవ కలనే కన్నావు
ఆ గగనపు ఎర్రజెండ కదిలే అల వలె ఉన్నావు
ఈ మట్టి నుదిటి మీద రాసుకున్న త్యాగ లిపివి
ఎర్రెర్రని సెట్ల పూల వీసే వేకువ గాలివి