ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘ప్రతి నగర పౌరునికి చక్కటి జీవన పరిస్థితులు కల్పించాలనే’ సమున్నత లక్ష్యంతో స్మార్ట్ సిటీస్ పథకాన్ని చేపడుతున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. యూరప్ నగరాలతో పోటీపడేలా అత్యున్నత స్థాయి జీవన వసతులు కల్పిస్తామని అట్టహాసంగా విధాన పత్రం కూడా జారీచేసింది. ఇంతా చేస్తే సగం నిధులు కూడా కేటాయించలేదని, పథకం పట్టాలు ఎక్కనే లేదని 2021లో వచ్చిన ఓ వార్తా కథనం వెల్లడించింది. 2019 నాటికే పథకం విజయతీరాలకు చేరి ఉండాల్సిందని కూడా అది గుర్తుచేసింది. నిజానికి మొత్తం ఆమోదించిన వ్యయం రూ.48,000 కోట్లలో సగమే కేటాయిస్తే.. అందులో ఖర్చుచేసింది ఇంకా ఇంకా తక్కువ. సాధించింది
నేను ఇంటిలో నుంచి బయటకి వచ్చి అలా వీధిలోకి వెళ్లాను. చుట్టూరా కలియజూశాను. పదేండ్లకు, ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు. ట్రాఫిక్ మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అంతే తేడా. స్మార్ట్ సిటీస్ పథకంపై కోట్లాది రూపాయలు గుమ్మరించారు. ‘భారీ బిల్లులు, పైపై మెరుగులు తప్ప ఏమీ సాధించలేకపోయారు’ అనే శీర్షిక కొద్ది రోజుల క్రితమే నేను మీడియాలో చూశాను. పదేండ్ల పాటు అమలైన పథకం సాధించిందేమీ లేదని తమ చుట్టూరా పరిసరాలను పరిశీలించినవారికి ఎవరికైనా చటుక్కున అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ పథకం తనువు చాలించింది. గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టేశారు కూడా. దానిపేరు మీద కొత్త హామీలేవీ ఇక నుంచి ఉండవు. పథకం శిథిలాల్లో అవశేషాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రతి నగరపౌరునికి యూరప్ నగరాల స్థాయిలో చక్కటి జీవన పరిస్థితులను కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ విధాన పత్రంలో పేర్కొన్నది. ఇది 2020లో సాధ్యమవుతుందని ప్రభుత్వం ఊరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక విధానాల ఫలితంగా విస్తరించే మధ్య తరగతికి సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ నగరాలు అవసరమవుతాయని అరుణ్ జైట్లీ 2014లో పార్లమెంట్‌కు తెలిపారు. మరుసటి ఏడాది కొంచెం జోరు తగ్గించారు.యూరప్ నగరాల ప్రస్తావన లేకుండా కేవలం తగిన నీటి సరఫరా, కరెంటు సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, పేదలకు అందుబాటు ధరల్లో గృహవసతి, మహిళలకు రక్షణ, అందరికీ ఆరోగ్యం, విద్య అని స్మార్ట్ సిటీకి కొత్తభాష్యం చెప్పారు.
నిజానికి నగరాల్లోని పురపాలికలు చేసేది ఇదే. లోగోలు, పేర్లు కాదు, పనులు గట్టిగా జరిపించడమే అసలు సమస్య. ఇది కష్టం గనుకనే మోదీ సర్కార్ ఈ పథకంపై ఆసక్తిని అనతికాలంలోనే కోల్పోయింది. పథకం వేగాన్ని అందుకోవడంలో విఫలమైనట్టు 2021లో వార్తలు మొదలయ్యాయి. పథకానికి ఆమోదించిన రూ.48 వేల కోట్ల నిధుల్లో 2015-19 మధ్యకాలంలో సగం మాత్రమే కేటాయించారని, ఆ సగంలో నాలుగింట మూడొంతులు మాత్రమే వాస్తవంగా విడుదలయ్యాయని, అందులో 36 శాతం మాత్రమే ఖర్చయ్యాయని తేలింది. అంతమంగా తేలిందేమిటంటే ఆమోదిత నిధులు రూ.48 వేల కోట్లలో రూ.6,160 కోట్లు మాత్రమే వాస్తవంగా వ్యయమయ్యాయి.
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద సాధించిన వాస్తవ అభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయి సంఘం విస్మయం వ్యక్తం చేసింది. ఒక సంస్థ ముందుకు లాగితే మరో సంస్థ వెనుకకు లాగడం జరిగిందని కూడా మొట్టికాయలు వేసింది. మొత్తం 35 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి విడుదలైన నిధుల్లో 20 శాతం కంటే తక్కువ మాత్రమే వినియోగించుకున్నాయి. భారతదేశంలో ఉండే మామూలు సమస్యలు సైతం ముందుకువచ్చాయి. యంత్రాంగాలు అందుబాటులో ఉన్నప్పటికీ నాసిరకం పనుల గురించి తమకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయిని స్థాయీ సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పనుల పూర్తికి సంబంధించి స్థానిక ఎంపీల నుంచి వస్తున్న అన్ని ఫిర్యాదులపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
స్మార్ట్ సిటీస్ పథకంలోని మౌలిక లోపాల గురించి ఈ పథకంపై ఆసక్తి కోల్పోని మీడియా వర్గాల నుంచి ఇంకా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఉన్నతస్థాయి మౌలిక యంత్రాంగం, టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థ గురించి పథకం నొక్కి చెప్పినప్పటికీ నీరు, పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, గృహవసతి గురించి పట్టించుకోలేదు. ఎంచుకున్న ప్రాంతాల్లో అభివృద్ధి చేపట్టి, ఈసరికే అభివృద్ధి చెందిన నగరాల కేంద్రభాగాల్లో డబ్బు గుమ్మరించారు. ఉదాహరణకు, బెంగళూరులో ఇన్ఫెంట్రీ రోడ్, కామరాజ్ రోడ్, టాటా లేన్, వుడ్ స్ట్రీట్, కాజిల్ స్ట్రీట్, డికెన్సన్ రోడ్, కస్తూర్బా రోడ్, బౌరింగ్ హాస్పిటల్ రోడ్, మిల్లర్స్ రోడ్, లావెల్ రోడ్, మెక్‌గ్రాత్ రోడ్, కాన్వెంట్ రోడ్, క్వీన్స్ రోడ్, హాయెస్ రోడ్, రాజారాంమోహన్ రాయ్ రోడ్, రేస్‌కోర్స్ రోడ్ వంటి సంపన్న ప్రాంతాల్లో పథకం కింద కేటాయించిన డబ్బులు ఖర్చుచేసి ఇతర ప్రాంతాలను గాలికి వదిలేశారు.
జాతీయ రాజధాని ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చెందిన న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పనులు చేపట్టారు. జనాభాలో అత్యల్ప భాగమైన ఉన్నత వర్గాలను పథకం కింద ఎంచుకున్నారు, నయా మధ్యతరగతి వర్గాన్ని కాదు. మోదీ ఆర్థిక విధానాలు ఆ వర్గాన్ని ఎటూ తయారు చేయలేకపోయాయనేది వేరే విషయం. ఉన్నత వర్గాల వైపు మొగ్గు అనేది పుణె, ఢిల్లీ, భోపాల్ వంటి ఇతర నగరాల్లో అమలుచేసిన సైకిళ్ల షేరింగ్ ప్రాజెక్టులోనూ కనిపించింది. సైకిల్ అద్దెకు తీసుకునేందుకు అవసరమైన నిబంధనలు కంపెనీ వెబ్సైట్లో ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. పైగా చెల్లింపు ఆన్లైన్లోనే చేయాలన్నారు. కేంద్రం తలపెట్టిన స్మార్ట్ సిటీలు పట్టణ పేదలను మరింతగా శివారుల్లోకి తరిమికొట్టాయి. పథకానికి 2018లో ఎంత కేటాయించారో 2019లోనూ అంతే కేటాయించారు. ఇక 2021 బడ్జెట్లో అయితే అసలు స్మార్ట్ సిటీస్ పేరే ఎత్తలేదు. ‘స్మార్ట్ సిటీస్ పథకం దేశంలోని నగరాలకు ఆదర్శంగా ఉండాలని ఆశించడం జరిగింది. కానీ, వాస్తవానికి మోదీ ప్రభుత్వానికి అది అత్యంత ఇబ్బందికరమైనదిగా తయారైంది. అందుకే దాని ఊసెత్తడం లేదు’ అని సిమ్లా మాజీ డిప్యూటీ మేయర్ టికేందర్ సింగ్ పన్వర్ అన్నారు. అందుకే మిరుమిట్లు గొల్పే పేరుపెట్టిన ఆ పథకం ఎందుకు తెచ్చారో, అది సాధించిన అభివృద్ధి ఏమిటో, అదెప్పుడు మూలకుపడిందో ఇప్పుడు మీకు వివరించేవారు ఎవరూ లేరు. అంతా గప్‌చుప్!
(దక్కన్ క్రానికల్ సౌజన్యంతో..)
కేంద్రం తలపెట్టిన స్మార్ట్ సిటీలు పట్టణ పేదలను మరింతగా శివారుల్లోకి తరిమి కొట్టాయి. పథకానికి 2018లో ఎంత కేటాయించారో 2019లోనూ అంతే కేటాయించారు. ఇక 2021 బడ్జెట్లో అయితే అసలు స్మార్ట్ సిటీస్ పేరే ఎత్తలేదు.
-ఆకార్ పటేల్