1994 జూన్ 7న పిడికెడు మందితో మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ను స్థాపించారు. మనదేశ సామాజిక సంక్లిష్ట కుల వ్యవస్థలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా అవిశ్రాంతపోరాటం చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్లలో మాదిగలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మాదిగలందరినీ ఏం చేసి ఆత్మగౌరవ ప్రతీకగా అనేక ఉద్యమాలు చేశారు. మాదిగలను ఏ.బీ.సీ.డీ.లు గా వర్గీకరించినట్లయితేనే తమకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా రాజకీయ చైతన్యంతో రాజ్యాధికారాన్ని చేపట్టి తమ తలరాతను తామే మార్చుకొనే రోజు వస్తుందని మాదిగలకు భరోసా కలిపించారు. మాదిగలకు గతంలో లేని రాజకీయ/జాతి చైతన్యాన్ని,మాదిగ జాతి స్పృహను అనేక సభలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం కల్పించారు. ఆయన నాయకత్వంలో ఉద్యమ బాట పట్టిన అనేకమంది మాదిగ సోదరులు తమ అమూల్య ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో అంతిమంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్‌లో విశ్వరూప మహాసభను భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పాటు చేయించటం చరిత్రలో చెరగని ఒకమైలు రాయి. ఈసభలో మాదిగలకు సరైన న్యాయం జరిగేలా పార్లమెంటులో చట్టం చేస్తానని మోదీ ప్రకటన చేస్తాడని లక్షలాదిమంది మాదిగలు ఆశగా ఎదురు చూ శారు. రాజ్యాంగ సవరణ చేస్తే 30 ఏండ్ల పోరాటానికి స్వస్తిపలికే ఒక నవోదయం వస్తుందని అందరూ ఆశించారు. కానీ,మోదీ వారి ఆశలను మరోసారి వమ్ము చేశారు. దళిత ఉద్యమ జ్వాలలపై నీళ్లు కుమ్మరించారు.
ఈ సమస్య పరిష్కారానికి కాలయాపన చేసే మరో కమిటీని వేస్తానని మరో బూటకపు వాగ్దాన ప్రకటనతో ఒక్కసారిగా మాదిగ సోదరులు నిర్ఘాంతపోయారు. నిరాశతో శాపనార్థ్ధాలతో వెనుదిరిగారు. అయితే,మోదీ రాజకీయ ప్రస్థానం తెలిసిన వారికి,ఆయన రాజకీయ ఎత్తుగడలు,గత చరిత్ర ఎరిగిన వారికి ఆయన వాగ్దానాలలో ఎంత మోసం ఉందో ఇట్టే పసిగట్ట గలరు. ఈ విషయాలను మరింత లోతుగా చర్చిద్ధాం.
మోదీ ప్రకటనతో మందకృష్ణ మాదిగ ఏం ఆశించారు? ఏం సాధించారు? అశేష మాదిగ సోదరుల భవిష్యత్తు ఏం కానున్నది? మోదీ/బీజేపీ వాగ్దానాలలో మర్మం ఏమిటి? తెలుసుకొనే ప్రయత్నం చేద్ధాం.
మాదిగల ఆత్మగౌరవ పోరాటం, వారి డిమాండ్లేమిటో మోదీకి గత పదేండ్లుగా తెలియదనుకోవాలా? నిజానికి మోదీకి చిత్తశుద్ధ్ధి ఉంటే పదేండ్ల పార్లమెంట్లో మెజారిటీ ఉన్న బీజేపీ వర్గీకరణ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇప్పటికే తాను అనుకున్న బిల్లులను పార్లమెంటులో చర్చలు లేకుండానే పాస్ చేయించుకోగలిగిన మోదీ ఈమాదిగల వర్గీకరణ విషయం వచ్చేసరికి మరో కమిటీ విచారణ అవసరం వచ్చిందా? గత రిపోర్టుల ఆధారాలు సరిపోవా? లేదా మాదిగలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని ఆయన వ్యక్తిగతంగా విశ్వసించటం లేదా? ఇంతకాలం మాదిగ సమస్యలు పట్టని మోదీకి ఇప్పుడే జ్ఞానోదయమైందని అనుకోవాలా?
తరచిచూస్తే,తెలంగాణాలో,ఇతర రాష్ర్టాలలో జరిగే ఎన్నికల్లో మాదిగల ఓట్ల కోసమే మోదీ ఈ కొత్త డ్రామా ఆడారు. ఆ ట్రాప్‌లో మందకృష్ణ మాదిగ అమాయకంగా చిక్కుకున్నారా? లేక తెలిసే ఇరువురు కలిసి మాదిగజాతి ఓట్లను గంపగుత్తగాదండుకునేందుకు మరో నాటకానికి తెరలేపారా? ఇదివరకే,ఈ సమస్యపై అనేక కమిటీల సానుకూల రిపోర్టులు ఉండగా, మరో కమిటీ అవసరం ఏమొచ్చింది? అనవసర కాలయాపన తప్ప దానితో కొత్తగా మాదిగలకు ఒరిగేదేమున్నది?
మాదిగ సోదరులారా ఇకనైనా మేల్కొనండి, మాదిగల ఆత్మగౌరవాన్ని బీజేపీకి లోపాయికారిగా తాకట్టు పెడుతున్న మందకృష్ణ మాదిగ వైఖరిని ఖండించండి. మోదీ బూటకపు మాటలకు, ఆశగొలిపే వాగ్దానాలకు మరోసారి మోసపోకండి. ఒకటికి పది సార్లు ఆలోచించండి. మందకృష్ణ మాదిగ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడో మాదిగ సోదరులు బాగా ఆలోచించి మీ భవిష్యత్తును మీరే హేతుబద్ధంగా నిర్ణయించుకోండి. ఎంతోమంది మాదిగ సోదరులు మందకృష్ణపై నమ్మకంతో ఉద్యమం కోసం ఎంతో విలువైన కాలాన్ని,ప్రాణాలను బలిపెట్టారు. చివరకు 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి ఏ గతి పట్టనున్నదో మరొకసారి ఆలోచన చేయండి.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అనేక సవరణలు చేస్తూ దాని మౌలిక లక్ష్యాలను,ఆదర్శాలను కాలరాసే క్రమంలో ఆరెస్సెస్ కనుసన్నలలో నడిచే బీజేపీ వైపు మాదిగలను నడిపించే కుట్ర జరుగుతుంది. లక్షల ప్రభు త్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకున్న బీజేపీ ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్ల లక్ష్యాలనే దెబ్బతీసిం ది. బీజేపీ పదేండ్ల పాలనలోనే నూటికి 85 శాతం ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేట్ పరం అయ్యాయి. ఇక ఆ ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ల కోటా ఏకోశాన ఉండవుగాక ఉండవు.
ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపైన దాడులు 300 రెట్లు పెరిగాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం 45,398 సంఘటనలు జరిగితే 2023 నాటికి 50, 900 కు దాడులు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని నీరుగార్చటానికి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుం డా నీతిఆయోగ్‌ను వాడుకున్నది. దళితులు జాబ్ కార్డులు పొంది ఉపాధి పనికి వెళ్తున్న వారికి రూ.1.18 లక్ష కోట్ల నుంచి 63 వేల కోట్లకు బడ్జెట్‌ను తగ్గించి వేసింది. దీంతో దళితుల నోటికాడి బుక్క లాగేసింది. జనాభాలో సుమారు 70 శాతం ఉన్న బీసీల కులగణనను చేపట్టబోమని బీజేపీ ప్రభు త్వం సుప్రీంకోర్టుకు బాహాటంగా వెల్లడించింది? అలాంటప్పుడు మాదిగ సోదరులకు ఎలా న్యాయం చేస్తుంది? ఒకవైపు మణిపూర్‌లో ఎస్సీ,ఎస్టీలను ఊచకోత కోస్తూ,వారు రిజర్వేషన్ల మంటల్లో దగ్ధమౌతుంటే, ఆవిషయంలో మోదీ ఉద్దేశ పూర్వక మౌనంలో అంతరార్థం మీకు బోధపడటం లేదా?
2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి సుప్రీంకోర్టు దాక వెళ్ళిన ఘనత బిజేపీదే. సామాజిక ప్రజా ఉద్యమాల ద్వారా ఆ తీర్పును వెనక్కి పంపి రక్షించుకోవాల్సి వచ్చిన గతాన్ని నెమరు వేసుకోండి. గత పదేండ్ల కాలంలో వర్గీకరణ గురించి పల్లెత్తు మాట మాట్లాడని మోదీ ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడుతున్నారో ఒకసారి దళిత సోదరులు ఆలోచించండి. మాదిగల ఓట్లపై ఉన్న ప్రేమ వర్గీకరణపై లేదని గత పదేండ్ల అనుభవం రుజువు చేయ టం లేదా? ఈ బీజేపీ వైఖరిని మందకృష్ణ మాదిగ పసికట్టలేని అమాయకుడంటే నమ్మటం ఏలా?
గతంలో వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు వర్గీకరణ గురించి పలు వాగ్దానాలు చేశారు. మందకృష్ణ మాదిగ వెంకయ్య నాయుడు కాళ్లు కూడా మొక్కాడు.నేడు మోదీని పెద్దన్న అని నోరారా పిలిచాడు, కంటనీరు పెట్టాడు. అయితే దయచేసి మాదిగల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళదగ్గర తాకట్టు పెట్టవద్దని దళితులు
కోరుతున్నారు.
హక్కుల కోసం పోరాట మార్గాన్ని వదిలి భిక్షమడుక్కునేటువంటి వాళ్లు బానిసలే అవుతారని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని దళితులు గుర్తు చేసుకోవాలి. మందకృష్ణ మాదిగ కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరితే ఎవరికీ అభ్యంతరం లేదు. అది ఆయన స్వవిషయం. దానికోసం మాదిగల పోరాట పటిమను బలిపెట్టడం న్యాయం కాదు. కాలయాపన చేసే మరో కమిటీతో మాదిగల డిమాండ్లు నెరవేరవు. మాదిగ సోదరులు ఈబూటకపు వాగ్దానాలకు మరోసారి మోసపోరు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలా లేదా గెలిపించాలా అని మాదిగ సోదరులు స్వేచ్చ గా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు.
-డాక్టర్ కోలాహలం రామ్‌కిశోర్
98493 28496