మన దేశ ఇంధన అవసరాల్లో 55 శాతం బొగ్గు రంగం ద్వారా తీర్చబడుతున్నాయి. భారతదేశ పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై ఆధారపడి ఉన్నది. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 75 శాతం థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే వస్తున్నది. అంటే బొగ్గుద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటంలో బొగ్గు రంగానికి ఉన్న ప్రాధాన్యం అట్లాంటిది. కానీ బొగ్గు వెలికితీతలో పనిచేసిన ఉద్యోగుల జీవితాలు మాత్రం అంధకారంలోనే ఉన్నాయి.
దేశానికి వెలుగులు నింపడానికి అవసరమైన థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన బొగ్గు వెలికితీతకు కృషి చేసిన విశ్రాంత బొగ్గు ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారు సామాజిక భద్రతకు దూరంగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. సీఎంపీఎస్ 1998 ప్రకారం రిటైర్ అయిన బొగ్గు ఉద్యోగులు పింఛన్‌కు అర్హులు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పింఛన్ విధానాన్ని సవరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పింఛన్‌ను సవరించాలి. కానీ సీఎంపీఎస్ 1998 ప్రారంభం నుంచి నేటికీ ఒక్కసారి కూడా సవరించబడలేదు. పింఛన్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులకు నెలకు రూ. 500 లోపు మాత్రమే అందుతోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అం దించే వైద్య, బీమా సౌకర్యాలు ఉద్యోగుల ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. అట్లనే అధికారులకు, ఉద్యోగులకు అందించే ప్రయోజనాలపై బొగ్గు కంపెనీల యాజమాన్యాలు వివక్షాపూరిత విధానాలను అమలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌భారత్ అంటూ ప్రచారం చేస్తున్న ది. అంటే పాలనలోని అన్ని అంశాల్లో స్వావలంబన. ఇప్పుడు విశ్రాంత బొగ్గు ఉద్యోగులు ఆ ఆత్మనిర్భర్‌ను సాధించేందుకు పింఛన్‌ను కాలానుగుణంగా సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పలుమార్లు ధర్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పదవీ విరమణ పొందిన బొగ్గుగని ఉద్యోగుల బాధలను అధికారులు పరిశీలించి, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన విధానాలను రూపొందించడం అత్యంత అవసరం. భారత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగులకు అండగా ఉంటుందని, ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తుందని తద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం నిం పుతుందని ఆశిద్దాం.
– దండంరాజు రాంచందర్ రావు
98495 92958
(వ్యాసకర్త : సింగరేణి భవన్, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్)