ఐదున్నర నెలల చెర నుంచి కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. ఆమె విడుదలయ్యే సందర్భంలో జైలు బయట దృశ్యాలు హృదయమున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. 165 రోజుల పాటు కుటుంబానికి, బిడ్డలకు దూరంగా గడపడం, అదీ నిరూపణ కాని నేరానికి కారాగార వాసం అనుభవించాల్సి రావడం ఏ తల్లికైనా తీరని గుండెకోతనే. ఈ జైలు కాలంలో ఎన్ని కన్నీటి బొట్లు రాలాయో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాయో ఎవరూ ఊహించలేరు. న్యాయం కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడం, నిరూపితం కాని నిందను భరించాల్సి రావడం శిక్ష కన్నా భయంకరమైనది. సత్వర విచారణ పూర్తిచేసి కోర్టు ముందు నిరూపించాల్సిన దర్యాప్తు సంస్థలు రాజకీయ క్రీడలో భాగం కావడమే ప్రజాస్వామ్యపు అతిపెద్ద విషాదం.
ఒకవైపు అక్రమ కేసులు, మరోవైపు వాటి సాగదీత అంతా పథకం ప్రకారమే జరుగుతాయిక్కడ. ఇది మొదలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉండే వీరి పెంపుడు మీడియా ఉన్నవీ, లేనివీ కలిపి వండి వారుస్తుంది. కవిత బెయిల్ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామికవాదులకు బలం చేకూర్చాయి. ఎట్టకేలకు కవిత విడుదలైనా న్యాయం కోసం సుదీర్ఘ నిరీక్షణ వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతున్నది. ఐదున్నర నెలల నిర్బంధ కాలాన్ని ఏం చేసి వారికి తెచ్చివ్వగలరు? రెండేండ్లుగా ఆ కుటుంబం అనుభవించిన మనోవేదనకు ఏ వ్యవస్థ సమాధానం చెప్పగలదు? ఆ బిడ్డల పసి హృదయాలపై ఏర్పడిన గాయాలకు ఏ రాజకీయం జవాబు చెప్పగలదు?
MLC Kavitha | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ పేరుతో నడిపిన ఈ కేసులో ఈడీ, సీబీఐల తీరు మొదటినుంచీ అనుమానాస్పదమే. అసలు కవిత పేరు ఈ కేసులో కనిపించడానికి నాలుగు నెలల ముందే 2022, ఆగస్టులో ఢిల్లీ బీజేపీ ఎంపీలు ఆమెపై ఆరోపణలు చేశారు. అదేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని కవిత నివాసంపై దాడిచేశారు. ఎవరి కనుసన్నల్లో కేసు రూపుదాల్చిందో ఇక్కడే తెలుస్తున్నది. ఆ తర్వాత 3 నెలలకు ఆమె పేరు మొదట సాక్షిగా, తర్వాత మరో నెలకు నిందితురాలిగా చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో 493 మంది సాక్షులను, 57 మంది నిందితులను విచారించామని చెప్తున్నాయి ఈడీ, సీబీఐలు. 24 నెలల పాటు విచారణ జరిపి 50 వేల పేజీల డాటా సేకరించినట్టు పేర్కొన్నాయి. కానీ, ఒక్క రూపాయి ఎక్కడా దొరకకపోవడమే ఇందులో ఆశ్చర్యం.
ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు అప్రూవర్లుగా మారిన వారంలోనే వాళ్లకు బెయిల్ వచ్చేసింది. బెయిల్ పొందిన మరికొందరు నిందితులు కేసు నమోదైన తర్వాత బీజేపీకి పార్టీ ఫండ్ ఇచ్చినట్టు తదనంతరం బయటపడటం విస్మయం కలిగించింది. ఇంకొందరు నిందితులు ఎన్డీయే అభ్యర్థులుగా బీఫాంలు పొందారు. అప్రూవర్లుగా మారిన వీరినే సాక్షులుగా చూపి కవితను నిందితురాలిగా చేర్చారట. ఇక్కడ అధికార పార్టీ టికెట్లిచ్చి, దర్యాప్తు సంస్థలు బెయిల్‌కు సహకరించి వారితో ఏం చెప్పించాలనుకుంటున్నారు అన్నదే అందరి ప్రశ్న.
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఆసక్తికర వాదనలు జరిగాయి. తాము అడగకముందే కవిత తన ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఈడీ, సీబీఐలు ఆరోపించాయని కవిత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అడిగిన వెంటనే ఆ ఫోన్లను దర్యాప్తు సంస్థలకు అందజేశామని తెలిపారు. వాటిలో డాటా తారుమారు చేశారని వాదించారు ఈడీ న్యాయవాది. తారుమారు చేయడానికి, డిలీట్ చేయడానికి చాలా తేడా ఉన్నదని ఈ సందర్భంగా పేర్కొన్నది ధర్మాసనం. కవిత ఫోన్లలో డాటా డిలీట్ చేశారని పదే పదే అనడం మినహా అసలు విచారణలో దొరికిన ఆధారాలేమిటి అన్నది ద్విసభ్య ధర్మాసనం ప్రశ్న. ఇందుకు సీబీఐ న్యాయవాది తెల్లమొహం వేశారు.
తాము కూడాఅనవసర చాట్లను డిలీట్ చేస్తామని, తామూ నేరస్థులమేనా.. అని ప్రశ్నించారు న్యాయమూర్తులు. ఇతరులకు ఫోన్లు ఇచ్చినప్పుడు ఫార్మాట్ చేయడం అందరూ చేసేదే కదా అన్నారు గౌరవ న్యాయమూర్తి. తనకూ రెండు ఫోన్లున్నాయని తాను కూడా అవసరం లేని మెసేజ్‌లను డిలీట్ చేసుకుంటానని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాది అనడం కొసమెరుపు. మరోవైపు ఉన్నత విద్యావంతురాలైన, ప్రజాప్రతినిధిగా ఉన్న మహిళ కనుక బెయిలుకు అనుమతించే సెక్షన్ 45 (1) వర్తించదని చెప్పిన ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఒకవేళ హైకోర్టు ఉత్తర్వులు గనుక చట్టరూపం దాల్చితే విద్యావంతురాలైన ఏ మహిళకూ ఎప్పటికీ బెయిల్ లభించదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సిసోడియా బెయిల్ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ విచారణను గడువులోగా పూర్తిచేసే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని, విచారణ పేరుతో నిందితుడిని కటకటాల వెనుక ఉంచడం ఆర్టికల్-21 ఉల్లంఘన తప్ప మరొకటి కాదన్నారు. ఇక సాక్ష్యాన్ని తారుమారు చేయడం గురించి మాట్లాడితే కేసు ఎక్కువగా డాక్యుమెంటేషన్‌పై ఆధారపడి ఉన్నది. అదంతా ఇప్పటికే స్వాధీనం చేసుకోవటం వల్ల సాక్ష్యాల తారుమారుకు అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
కల్వకుంట్ల కవిత ప్రజా పోరాటాల నుంచి ఎదిగొచ్చిన నాయకురాలు. అరెస్టులు ఆమెకు కొత్త కాదు. కేసులతో నేతలను లొంగదీసుకుందాం అనుకుంటే అదిక్కడ నెరవేరదు. వారు ఇంకో రాష్ట్రం చూసుకోవాల్సిందే. చాకలి ఐలమ్మ వంటి వీరనారుల సాలు ఈ నేలది. ఢిల్లీకి ఎదురు నిలిచిన ప్రతాపరుద్రుడి వారసత్వం ఈ గడ్డది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుగా పిలుస్తున్న ఈ ప్రహసనం మొత్తంలో ఈడీ, సీబీఐలు అధికార పెద్దల రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నాయని అర్థమవుతున్నది. ఒకవైపు కేసులు పెట్టడం, నిందితులనే అప్రూవర్లుగా పేర్కొంటూ వారు చెప్పారని మరికొందరిపై కేసులు నమోదు చేయడం జరుగుతూ వస్తున్నది. కేసులు పెట్టడం ఒకెత్తు అయితే, దాని సాగదీత మరొక ఎత్తు. ఎంతసేపూ బెయిల్ నిరాకరించాలన్న వాదనే కాని రెండేండ్లలో కేసు ట్రయల్స్ ఎందుకు ముందుకు కదలలేదో చెప్పరు.
విచారణ ఇప్పట్లో పూర్తయ్యేలా కనబడటం లేదని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే పేర్కొనడం గమనార్హం. లొంగితే బెయిల్.. తిరగబడితే జైలు అన్నదే దర్యాప్తు సంస్థల శైలి ఇక్కడ. గతంలోనూ కవితను ఫోన్లు అడగకముందే వాటిని ధ్వంసం చేశారని ఈడీ, సీబీఐలు కోర్టుకు, మీడియాకు చెప్పాయి. కానీ, తర్వాత వారు అడిగినప్పుడు ఆమె వాటిని అందించారు. దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు సేకరించాలి కానీ, ఇలా అసత్యాలను ప్రచారం చేయడం ఎవరి మెప్పు కోసం? ఈ రెండేండ్ల కాలంలో జరిగిన నష్టానికి, పడిన మనోవేదనకు ఎవరు జవాబుదారి? చిలువలు పలువలుగా అసత్యాలు కల్పించి రాసిన మీడియాకేదీ శిక్ష?
‘ఈ దేశంలో సీబీఐ రాజకీయం నడుస్తున్నది. నిర్దోషులను జైళ్లలో పెట్టి వేధించే ఈ పద్ధతికి ఇవ్వాళ కాకుంటే రేపైనా దేశ ప్రజలకు మీరు జవాబు చెప్పుకోవాల్సిందే. మా నాయకులను ఇబ్బంది పెడుతున్న తీరు ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధం. అబద్ధాల బురదజల్లి మా రాష్ర్టాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలు ఆపాలని నేను హెచ్చరిస్తున్నాను. రాష్ర్టాల మీద కుట్రలు చేయడానికి సీబీఐని వాడుతున్న పాలకులు ఆ సమయాన్ని దేశం కోసం వాడితే ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుంది. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడదాం’. ఇవీ పదకొండేండ్ల కిందట కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఉద్దేశించి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలు. ఇదే సందర్భంలో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఆయన అభివర్ణించారు. మరిప్పుడు ఆయన చేస్తున్నదేమిటి?
ఈ సంవత్సరం ఇదే నెలలో ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో తెలిపిన వివరాలతో దేశం నివ్వెరపోయింది. 2014 నుంచి ఇప్పటివరకు పీఎంఎల్ఏ చట్టం కింద 5,297 కేసులు నమోదు చేయగా.. 40 కేసుల్లో మాత్రమే నిందితులపై ఆరోపణలు రుజువై శిక్షపడిందట. మరెందుకు ఇలా ఇబ్బడిముబ్బడిగా కేసులు పెడుతున్నట్టు? వ్యాపారాలు కబలించడానికి, నాయకులను బెదిరించడానికేనా? ఈడీ కేసు నమోదు కాగానే ముంబై ఎయిర్‌పోర్టు జీవీకే నుంచి ఎలా అదానీ వశమైందో దేశం చూసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై పెట్టబడిన ఈడీ కేసులు 132. ఇందులో అనేక కేసుల విచారణ నత్తనడకన సాగుతున్నది. మరికొన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరెందుకీ కేసులు అంటే లొంగదీసుకోవడం కోసం, అది కుదరకపోతే అవినీతి మరక అంటించడం కోసం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వారి మీడియా సంస్థలు పోటీ పడి విషం చిమ్మడమూ ఈ కుట్రలో భాగమే. సీబీఐ, ఈడీలను పార్టీ అనుబంధ విభాగాల కన్నా ఎక్కువగా వాడుకొని ప్రయోజనాలు పొందుదామనుకోవడం జాతీయపార్టీలకు పరిపాటిగా మారింది.
మరోవైపు ఏర్పడిన అనతికాలంలోనే అన్నిరంగాల్లో అగ్రగామిగా దూసుకుపోయిన నవజాత శిశువు తెలంగాణ. అభివృద్ధి, సంక్షేమంలో దీనితో పోటీ పడలేక ఎంచుకున్న ఈ చిల్లర చేష్టలతో రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని ఎలా అనుకుంటారు? కల్వకుంట్ల కవిత ప్రజా పోరాటాల నుంచి ఎదిగొచ్చిన నాయకురాలు. అరెస్టులు ఆమెకు కొత్త కాదు. కేసులతో నేతలను లొంగదీసుకుందాం అనుకుంటే అదిక్కడ నెరవేరదు. వారు ఇంకో రాష్ట్రం చూసుకోవాల్సిందే. చాకలి ఐలమ్మ వంటి వీరనారుల సాలు ఈ నేలది. ఢిల్లీకి ఎదురు నిలిచిన ప్రతాపరుద్రుడి వారసత్వం ఈ గడ్డది.
ప్రజాస్వామ్య భారతంలో పౌరుల ప్రాథమిక హక్కు స్వేచ్ఛ. సుపరిపాలన దిశగా మనం ఏర్పరచుకున్న వ్యవస్థలు వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించడం అంటే కంచె చేను మేసినట్టే. విచారణ జరిపి శిక్షపడేలా చేయడం ప్రభుత్వ విభాగాల బాధ్యత. భారత సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు బెయిల్ అన్నదే రూల్. జైలు మినహాయింపు మాత్రమే. ఇక్కడ నేరస్థులకు శిక్ష పడొద్దని ఎవరూ చెప్పరు.
కానీ, కోర్టులో వాదప్రతివాదాలే మొదలు పెట్టకుండా విచారణ పేరుతో ఏండ్లపాటు జైళ్లలో నిర్బంధించడం ప్రాథమిక హక్కుల స్ఫూర్తికే విరుద్ధం. అదిక్కడ రాజకీయ పెద్దల ఒత్తిడితో జరగడం క్షమించరానిది. ఇదే కేసులోని మరో నిందితుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే సందర్భంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యస్ఫూర్తిని ఇనుమడింపజేసేవిగా ఉన్నాయి. స్వేచ్ఛకు సంబంధించిన విషయాల్లో ప్రతి రోజూ లెక్కలోకి వస్తుందని గౌరవ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎంత ఆలస్యమైనా సత్యం గెలువక మానదు. కాలం కోర్టులో కుట్రదారులు దోషిగా నిలబడక తప్పదు. మీ రాజకీయ కుట్రలతో వేదన అనుభవించిన ఎన్నో కుటుంబాలకు న్యాయం జరగడమే దేశ వ్యవస్థలు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తం. ఇది ఈ దేశ రాజ్యాంగమే చేయగలదని మరోసారి నిరూపితమైంది. సత్యమేవ జయతే!
రంగు నవీన్ ఆచారి
80991 66666