ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు మంటగలిసింది. ‘మిస్ వరల్డ్ అందాల పోటీ’ నిర్వహణలో అందగత్తెలను ఆట వస్తువులుగా చూడాలనుకున్న ప్రభుత్వం తీరును యావత్ మహిళా లోకం గర్హిస్తున్నది. దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. తెలంగాణ జాతి గర్వించేలా మహిళా సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇక్కడ ఉన్నాయి. కానీ, అసలు ఆ పోటీలకు సంబంధమే లేని ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు అత్యుత్సాహంతో పోటీలను రసాభాస చేయడం సిగ్గుచేటు.
మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా, నిర్వహణా తీరును తూర్పారబట్టారు. 2025, మే 7వ తేదీన హైదరాబాద్ వచ్చిన మిల్లా, 16న పోటీల నుంచి తప్పుకొని ఇంగ్లండ్ వెళ్లిపోయారు. ఆమె తల్లి అనారోగ్య కారణాల వల్ల వెళ్లారని నిర్వాహకులు చెప్తున్నారు. కానీ, ఇంగ్లండ్‌కు వెళ్లిన తర్వాత ‘ది సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్వాహకుల ఆటవిక చర్యలను ఆమె తీవ్రంగా ఖండించడం మన దేశానికి తలవంపులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే రామప్ప ఆలయంలో అందగత్తెల కాళ్లను కడిగించి తెలంగాణ మహిళలను అవమానించారు.
పోటీల సందర్భంగా ప్రభుత్వాధినేతలు హూందాతనాన్ని పాటించకపోవడం పక్కనపెడితే కనీసం గత పోటీలనైనా అనుసరించలేదు. ఈ పోటీలను రాజకీయంగా మార్చడాన్ని ప్రజలు మొదటినుంచి వ్యతిరేకించారు. పోటీల్లో పాల్గొనే సుందరీమణులను ఉదయం నుంచి సాయంత్రం వరకు బొమ్మల్లా అలంకరించుకొని అందుబాటులో ఉండాలని, చెప్పిన చోటుకల్లా వచ్చి నవ్వుతూ ప్రదర్శన బొమ్మల్లా వ్యవహరించాలని నిర్దేశించడం ఆక్షేపణీయం.
అందాల పోటీలను సమాజంలో మార్పు తీసుకురావడానికి వాడుకొని, రాష్ర్టాన్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సింది. కానీ, వాటిని పూర్తిగా దుర్వినియోగపరచడమే కాకుండా, నిర్వాహకులు, స్పాన్సర్లు వారి దుర్బుద్ధి బట్టబయలు చేసుకున్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లో జరగడం హేయం. ఓ పోటీదారు మధ్యలోనే తప్పుకోవడం సాధారణ విషయం కాదు. పోటీల్లో ఏం జరిగిందనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు. మహిళలందరూ సిగ్గుపడేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మిల్లా మ్యాగీకి జరిగిన అవమానం ఒకసారి ఆమె మాటల్లో… ‘ఒక టేబుల్‌పై ఆరుగురు అతిథులు, పోటీదారులైన ఇద్దరు అమ్మాయిలున్నారు. వారిని అలరించాలని పరోక్షంగా చెప్పారు. ఇది నాకు చాలా తప్పు అనిపించింది. వారి వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు. అదంతా చూస్తే వారు నన్ను వేశ్యలా భావించారేమో అనిపించింది’ ఇలా అనేక విషయాలను మిల్లా మ్యాగీ ఎండగట్టారు. అవన్నీ చెప్పుకొంటే తెలంగాణ సిగ్గుపోయేలా ఉంది.
అనేక అందాల పోటీలలో పాల్గొని ప్రపంచ గుర్తింపు పొందిన మిల్లా మ్యాగీని ఎంత బాధించి ఉంటే ఆమె ఇంతలా స్పందిస్తారు? అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె, ఆయా ప్రాంత నాయకుల, నిర్వాహకుల తీరును క్షుణ్ణంగా అవగాహన చేసుకొనే ఉంటారు. అక్కడ, ఇక్కడ ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించాకే ఆమె పోటీ నుంచి తప్పుకొని వెళ్లిపోయారని చెప్పవచ్చు. ప్రపంచస్థాయి పోటీలో అవకాశం రావడమే జీవిత లక్ష్యంగా భావించి మిల్లా మ్యాగీ ఏండ్ల తరబడి కృషిచేసింది. కానీ, ఆమె కల మధ్యలోనే కల్ల అయిపోయింది. మహిళలను గౌరవించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ క్షమాణలు చెప్పాలి. 70 ఏండ్ల అందాల పోటీల చరిత్రలో ఒక పోటీదారు మధ్యలో తప్పుకోవడమనేది ఇదే మొదటిసారి. అందుకు తెలంగాణ వేదిక కావడం మనం చేసుకున్న దురదృష్టం.
– (వ్యాసకర్త: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్)
తుల ఉమ 98494 96368