Europe Union | యురోపియన్ యూనియన్ (ఈయూ) అనేది జాతీయవాదానికి అతీతమైన కూటమి. 27 యూరప్ దేశాలు అందులో సభ్యులుగా ఉన్నాయి. ఈ 27 దేశాలకు చెందిన ప్రజలు ఈయూ పార్లమెంటు సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు. ఐదేండ్లకోసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఈనెల 3-9 తేదీల్లో జరిగింది. ప్రత్యక్ష ప్రజామోద ముద్ర కారణంగా ఈయూను ప్రభుత్వాలకు అతీతమైన సూపర్ ప్రభుత్వంగా భావిస్తుంటారు. ఆ యా సభ్యదేశాల సార్వభౌమత్వం ఈ యూకు లోబడి ఉంటుంది. భద్రత, వాణిజ్య తదితర కీలక రంగాలకు సంబంధించిన విధానాలు ఈయూ పరిధిలోనే ఉంటాయి. తన సార్వభౌమత్వంపై ఈ తరహా ఆధిపత్యం ఏ మాత్రం అంగీకరించని బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ యుద్ధం, గాజా నుంచి కాందిశీకుల వెల్లువ, వాతావరణ మార్పు ల సంక్షోభం నేపథ్యంలో ఈయూ ఎన్నికల ఫలితాలపై సహజంగానే ఆసక్తి కొం చెం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యూ ఎన్నికల్లో జాతి ఆధిపత్య వాదుల ప్రాబల్యం పెరిగినట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదంతా దేనికి సంకేతమనే విశ్లేషణలు జోరుగా జరుగుతున్నాయి. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు పాటుపడే గ్రీన్స్ పార్టీ, సామాజిక న్యాయం కోసం పోరాడే వామపక్ష పార్టీల బలం ఈయూలో క్రమంగా తగ్గుతున్నది. ఉదారవాదులను ఈ పరిణామాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
యూరప్ ఓటర్లు తమ తమ జాతీయపార్టీల అభ్యర్థుల నుంచి ఈయూ ఎంపీలను ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన సభ్యులు భావజాలాన్ని బట్టి ఈయూ స్థాయిలో కూటములు కడతారు. ఇటలీ, ఫిన్లాండ్ హంగరీల్లో ఈ సరికే జాతి ఆధిపత్యవాద పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఈయూ ఎన్నికల్లో అదే ప్రతిఫలిస్తున్నది. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాల్లో పాలక పక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ లో పాలక రినైజాన్స్ పార్టీ జాతి ఆధిపత్యవాద నేషనల్ ర్యాలీ పార్టీ చేతుల్లో చిత్తు కావడం ప్రకంపనలకు దారితీసింది. దీంతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రా న్ పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు ఆదేశించడం చిన్న విషయం కాదు.
జాతి ఆధిపత్యవాదం ఫలితంగా యూ రప్ రెండు ప్రపంచయుద్ధాలను చూసిం ది. అపారమైన ధన, ప్రాణ నష్టాలకు గురైంది. యూరప్ ప్రజలకు ఈ మహమ్మారి అంటే సహజంగానే వ్యతిరేకత ఉం టుంది. అయినప్పటికీ దేశదేశాల్లో జాతి ఆధిపత్యవాదం పడగ విప్పుతూనే ఉంది. నయా ఫాసిస్టు మూకలు జర్మనీ వంటి దేశాల్లో తూర్పు నుంచి వలస వచ్చిన ప్రజలపై దాడుల చేయడం గురించిన వార్తలు తరచూ వెల్లువడుతూనే ఉన్నా యి.
ఇది జర్మనీకి మాత్రమే పరిమితమైన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదం పెచ్చరిల్లిన తర్వాత యూరప్‌లో జాతిపరమైన వివక్షలు పెరిగిపోయాయి. వలస విముక్త దేశాల నుం చి వచ్చిన ప్రజలను అనుమానంగా చూడ టం పెరిగిపోయింది. ఈ పరిస్థితులు ఆ యా దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆసియా నుంచి బతుకుదెరువు కోసం వెళ్లి యూరప్ దేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ఇతర మాజీ వలస దేశాలవారికి ఈయూలో జాతి ఆధిపత్యవాదుల పట్టు పెరుగుతుండటం సహజంగానే ఆందోళన కలిగిస్తున్నది. అయితే జాతి ఆధిపత్యవాదుల బ లం గణనీయంగా పెరిగినప్పటికీ అదింకా నిర్ణాయక స్థాయికి చేరుకోకపోవడం కొంత ఉపశమనం కలిగించే విషయం.