హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌కు ఈ లేఖలు వచ్చాయి. ఇక ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ లాబీల్లో మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. తనతోపాటు ముగ్గురు మంత్రులకు పోస్టు ద్వారా లేఖలు వచ్చినట్టు చెప్పారు.
మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖలు చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందినట్టు వెల్లడించారు. వ్యక్తిగతంగా, శాఖపరంగా తాము ఎలాంటి తప్పులు చేయలేదని పేర్కొన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ఈ బెదిరింపు లేఖపై తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు మంత్రి దుర్గేశ్ కార్యాలయం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది.