ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 11 : అంగన్వాడీ టీచర్ తమ బాలుడిని విచక్షణా రహితంగా కొట్టిందంటూ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశాడు. ఈ ఘటన బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో చోటుచేసుకున్నది. బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొంపెల్లి విజయ్‌కుమార్ తన కొడుకు విద్వాంస్ను మంగళవారం ఉదయం అంగన్వాడీ పాఠశాలకు పంపారు.
మధ్యా హ్నం బాలుడికి జ్వరం వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లాలని అంగన్వాడీ టీచర్ బాలుడి తల్లి లక్ష్మికి ఫోన్‌చేసి చెప్పగా ఆమె వచ్చి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే కంటి పక్కన కమిలిపోయి ఉండటం, కాళ్లపై కర్రతో కొట్టిన గాయాలు ఉండటంతో వెంటనే భర్త విజయ్‌కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పింది. బాలుడిని సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చూపించారు. తన కొడుకును అంగన్వాడీ టీచర్ విచక్షణారహితంగా కొట్టిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.