గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయంతో రేవంత్ ప్రభుత్వం ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయింది, గ్రామీణ ప్రాంత ఓటరు చూపిన సాహసోపేత నిర్ణయం వల్ల కాంగ్రెస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్పై, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ముప్పేట దాడికి దిగుతున్నారు. బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని, టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అగౌరవ పరిచేలా వ్యవహరించిన టీడీపీని కేసీఆర్ నాయకత్వంలో ప్రజలే తరిమి కొట్టారనే విషయం రేవంత్‌కు తెలియదా? బీఆర్ఎస్ గద్దెలను కూల్చితే తెలంగాణ గుండెలు అగ్నిగుండంగా మారి కాంగ్రెస్‌ను దహించివేయడం ఖాయం. సహజంగానే ప్రతిపక్షానికి స్థానిక సంస్థలలో నామమాత్రంగానే గెలుపు అవకాశాలు ఉంటాయి.
గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ వీరోచిత పోరాటాలు చేసింది. అసెంబ్లీ వేదికగా ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాడింది. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల మద్దతు పొందడం వల్లనే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో 4,000 కు పైగా గ్రామాలలో విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల్లో నామమాత్ర విజయం సాధించిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు త్వరగా ముగించుకోవాలని నిర్ణయించింది. పట్టణ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నదనే విషయాన్ని గ్రహించి ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొని విజయం సాధించాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది.
గ్రామాలలో తమను ఆదరించలేదని రైతులకు రైతు బీమా ఎగ్గొట్టాలని నిర్ణయించడం దేనికి సంకేతం? పట్టణాలలో అత్యధికంగా నివసిస్తున్న ఓటర్లలో ఎక్కువ శాతం ఉన్న ఉద్యోగులు, పెన్షనర్స్, నిరుద్యోగులు, మధ్యతరగతి వర్గం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు, 5 విడతల కరువుభత్యంతో పాటు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఆరోగ్య కార్డులు లాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. గత రెండేండ్లుగా రిటైరైన 20,503 మంది ఉద్యోగులకు రావలసిన పెన్షన్ బకాయిలు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ వేధిస్తున్నది. మానసిక వేదనతో ఇప్పటికే 43 మంది మరణించడం బాధాకరం.
నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, రెండేండ్లలో నింపింది కేవలం 10 వేలు మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ద్వారా ఇచ్చిన 50 వేల ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకొని, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. ప్రభుత్వ మోసాన్ని గ్రహించి నిరుద్యోగులు ప్రతి రోజూ పోరాటాలకు దిగుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో పట్టణాలకు ప్రత్యేక ప్రణాళికతో పురపాలికలకు సౌకర్యాలు అందించడానికి కేటీఆర్ ప్రత్యేక చొరవ వలన అనేక రంగాలలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అనేక పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు రద్దు చేసి పట్టణ ప్రజలకు తీరని వేదనను మిగిల్చి కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు, బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని ద్రోహం చేసింది.
వికేంద్రీకరణ వల్ల ప్రజల చెంతకు పరిపాలన రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అందులో భాగంగానే పది జిల్లాలను 33గా విభజించి సంక్షేమం, అభివృద్ధి వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ అంటే దేవుడులాగా కలిసే అవకాశం లేని వ్యవస్థ నుండి నిరంతరం జిల్లా పాలనాధికారి ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల ప్రజలకు మేలు జరిగింది. వికేంద్రీకరణను విధ్వంసం చేయడానికి, జిల్లాల పునర్విభజన పేరిట ప్రజలకు పరిపాలన దూరం చేయడానికి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. ఏ జిల్లా ఉంటుందో ఏ జిల్లా పోతుందో అనే ఆందోళనతో జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 95 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించి రెండేండ్లు కేంద్రంపై ఒత్తిడి పెంచి కేసీఆర్ సర్కార్ జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ విభజన పేర జిల్లాలు తగ్గిస్తే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో రెండేండ్ల వరకు ఉద్యోగ నియామకాలు ఉండే అవకాశాలు లేవు.
తేనె తుట్ట్టెను కదుపుతున్న ప్రభుత్వం తేనెటీగల దాడిని ఎదుర్కొనక తప్పదు. కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేస్తామని కాంగ్రెస్ మార్క్‌ను అమలు చేస్తామని చెప్పిన రేవంత్ గత పాలకుల హయాంలో జరిగిన వికాసాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేయడం అమానుషం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడంటే చరిత్రను చెరిపివేయడమే.
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను, సబ్బండ వర్ణాల ప్రజలను ఏకం చేసి వీరోచిత పోరాటాలు, త్యాగాలతో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ చరిత్రను చెరిపివేయడం అసాధ్యం. దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆవిష్కరించిన ప్రజల పోరాటాన్ని చెరిపివేయడం అసాధ్యం. ఉద్యమంలో లేని ముఖ్యమంత్రి ఉద్యమకారుల పోరాటాలను అవమానించడమే. హైడ్రా లాంటి వ్యవస్థలను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఆలోచనలకు మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉన్నది. అప్పులతో ఏమీ చేయలేక పోతున్నానని ప్రజలలో అబద్ధాలు ప్రచారం చేస్తూ అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్, మెస్సీ ఫుట్‌బాల్, మూసీ పునర్జీవనం, ఫ్యూచర్ లేని సిటీ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దారిమళ్లించే విధంగా తన చేతగానితనాన్ని గత ప్రభుత్వానికి అంటగట్టే విధంగా విమర్శలతో విరుచుకుపడుతూ పక్షవాత పరిపాలన ( Adminstration paralysis) కొనసాగిస్తూ కాలం గడుపుతున్నది.
ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తూ, కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన నిర్బంధాలను, గురుకుల విద్యార్థుల మరణాలకు, రైతుల ఆత్మహత్యలకు, పెన్షనర్స్ అసహజ మరణాలకు కారణమైన వారిని మర్చిపోకుండా.. ‘కసి ఆరిపోకుండా బుసగొట్టు చుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలి’ అన్న కాళోజీ మాటలు నిరంతరం గుర్తు చేసుకోవలసిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో వస్తున్న మున్సిపల్ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తులకు బలం చేకూరుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే చెంపలు వాయించి తొడపాశం పెడతారనే భయం కలిగించాలి.
వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్
దేవీప్రసాద్