తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా, ఆర్థిక చోదకశక్తిగా వెలుగొందింది. కాంగ్రెస్ పాలనలో ప్రస్తుతం వేసవి ఎండల కంటే తీవ్రంగా ఇప్పుడు రాష్ట్ర ఖజానాను ఆర్థిక సెగలు చుట్టుముడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటిన వేళ..అటు ప్రజాకర్షక పథకాల అమలుకు, ప్రభుత్వం చేసిన అప్పుల భారానికి మధ్య సగటు పౌరుడు నలిగిపోతున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అభయహస్తం హామీల అమలు కోసం ఒకవైపు ఆరాటం, మరోవైపు అడుగంటుతున్న ఆదా యం.. వెరసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక అస్థిరమైన మలుపు వద్ద నిలబడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ లోతుల్లోకి తొంగిచూస్తే కనిపిస్తున్న అంకెలు సామాన్యుడిని భయపెట్టక మానవు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పు దాదాపు రూ.7.5 లక్షల కోట్లకు చేరుకున్నదని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ అప్పుల స్వభావంపైనే ఇప్పుడు మేధావుల మధ్య పెద్ద చర్చ నడుస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల హయాంలో జరుగుతున్న వ్యయంలో సింహభాగం సంక్షేమ పథకాల వైపు మళ్లుతున్నది. ఉత్పాదక రంగం కంటే అనుత్పాదక రంగంపై పెరుగుతున్న ఈ వ్యయం రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది కాదనలేని వాస్తవం.
ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే..నెలాఖరు రాకముందే ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు నిధులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే, గణాంకాలు అత్యంత ఆందోళనకరమైన వాస్తవాలను ఆవిష్కరిస్తున్నాయి. 2025-26 అంచనాల ప్రకారం, రాష్ట్రం మొత్తం అప్పు గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రూ.7,50,000 కోట్లకు చేరుకున్నది. ఈ అప్పుల ఊబి ఎంత లోతుగా ఉందంటే, కేవలం వార్షిక వడ్డీల చెల్లింపులకే ఖజానా నుంచి ఏటా రూ.40,000 కోట్లకు పైగా నిధులు కరిగిపోతున్నాయి. మరోవైపు, ప్రభుత్వం ఆర్భాటాల కోసం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కోసం నెలకు రూ.6,000 కోట్లకు పైగా అదనపు భారం పడుతున్నది. ఈ స్థాయిలో వ్యయం పెరుగుతున్నా, ఆదాయ మార్గాలు మాత్రం ఆశించిన రీతిలో మెరుగుపడటం లేదు. రాష్ట్ర సొంత ఆదాయం రూ.90,000 కోట్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవ రాబడి ఆ లక్ష్యం కంటే 18 శాతం వెనుకబడి ఉండటం గమనార్హం. ఇలా అడుగంటుతున్న ఆదాయం, పెరుగుతున్న అప్పుల మధ్య ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసమే ఏటా రూ.65,000 కోట్లకు పైగా కేటాయించాల్సి రావటంతో, రాష్ట్ర ఆర్థిక నౌక తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది.
2014 నుంచి 2023 వరకు తెలంగాణను పాలించిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టానికి ఒక దృఢమైన మౌలిక పునాదిని నిర్మించిందనటంలో ఎలాంటి సందేహం లేదు. నాడు కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఎడారి కాకుండా పచ్చని మాగాణంగా మారింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునర్జీవం పోయటం, రైతుబంధుతో పెట్టుబడి సాయం అందించటం వంటి చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. నాడు నిర్మించిన రోడ్లు, 24 గంటల కరెంటు సరఫరా వ్యవస్థ, ఐటీ రంగ విస్తరణ నేటికీ రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరులుగా ఉన్నాయి. అయితే, ఈ వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, అప్పుల ఊబి నుంచి గట్టెక్కటం ప్రస్తుత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మారుతున్నది.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహజ్యోతి వంటి పథకాల పేరిట ఎన్నికల ముందు ఊదరగొట్టి, ప్రజలను ఆ దిశగా నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ హామీపై అన్నదాతలు గొంతెత్తుతున్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న మాట అమల్లో సర్కార్ వైఫల్యం చెందటంతో కర్షకుల్లో అసహనం పెరుగుతున్నది.
నిధుల కొరత వల్ల రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు వేగం పుంజుకోవటం లేదు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అనేక రహదారుల నిర్మాణాలు నిలిచిపోయాయి. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పడుతున్నది. కేసీఆర్ పాలనలో నిర్మించిన ఎన్నో ప్రభుత్వ భవనాలు, సదుపాయాలు, మౌలిక వసతులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పాలనలో ఇంతవరకు కొత్తగా ఒక్క ఇటుక కూడా పడలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన గ్యారంటీల అమలు కోసం ఆదాయం పెరగటం లేదు. సంక్షేమ పథకాల కోసం అధికంగా ఖర్చు చేయటం, సర్కార్ వివిధ రూపాల్లో చేస్తున్న అప్పులకు వడ్డీలే కొత్త అప్పులు పుట్టకుండా అడ్డుపడుతున్నాయి. కేంద్రం సహాయ నిరాకరణ, అక్కడి నుంచి వచ్చే నిధుల కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఆశనిపాతంలా పరిణమిస్తున్నాయి. ఆదాయ లక్ష్యాలకు చేరుకోకపోవటం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మద్యం, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగటం లేదు. నిర్వహణ లోపాలు ఆర్థిక వనరుల సమీకరణలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, కఠినమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సి ఉన్నది. ఐటీ రంగంతో పాటు ఫార్మా, తయారీ రంగాల్లోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. తద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలి. అనవసరపు ఆడంబరాలకు స్వస్తి పలికి, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా ఉండేలా చూడాలి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, రాష్ర్టానికి రావాల్సిన వాటా సాధించటంలో కేంద్రంతో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నేడు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సామాన్య ప్రజల కడుపు నిండాలి, రాష్ట్ర ప్రగతి ఆగకూడదు. కేవలం గ్యారంటీలు ఇవ్వటమే కాదు, ఆ గ్యారంటీలను నిలబెట్టుకునే ఆర్థిక శక్తిని కూడా ప్రభుత్వం కూడగట్టుకోవాలి. గత ప్రభుత్వం వేసిన పునాదులపై బలమైన సౌధాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మౌలిక వసతులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుల ఊబి నుంచి తెలంగాణను రక్షించి, అభివృద్ధి పథంలో నడిపించటమే ఈ ప్రభుత్వానికి అసలైన పరీక్ష. ప్రజలు మాటల కంటే చేతలను, అంకెల కంటే అభివృద్ధిని కోరుకుంటున్నారని పాలకులు మరువకూడదు.
-సూర్యదేవర రామకృష్ణ
94907 54169