మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం…
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ శోకంతో రాసిన మణిపూర్ మహాభారతం-ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం.
పుడుతూనే పాలకేడ్చి, పుట్టి జంపాలకేడ్చి, పెరిగి పెద్ద కాగానే ముద్దూ మురిపాలకేడ్చి, తనువంతా దోచుకున్న తనయులు మీరు. మగసిరితో బతుకలేక కీచకులై, కుటిల కామ నీచకులై, స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో, మీ అక్కల రక్తంతో రంగరించి రాసిన మణిపూర్ మహాభారతం- ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం.
కన్న మహా పాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినదీ గుండెలతో కాదా? ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు జేసి పెంచుకున్న తల్లీ ఓ ఆడదనే మరిచారా? కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర? ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర ప్రతి భారతసతి మానం చంద్రమతి మాంగల్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం.
శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకు, సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ర్టుల పాలనలో, భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో, నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం ఔతుంటే ఏమైపోతుందీ సభ్యసమాజం? ఏమైపోతుందీ మానవధర్మం? ఏమైపోతుందీ ఈ భారతదేశం? మన భారతదేశం?
ప్రతిఘటనలో వేటూరి కలం ప్రతిఘటించి మానవ మృగాలకు బుద్ధిచెప్పిన సందర్భంలో పుట్టిన ఆరవ వేదమిది. మాతృహృదయ నిర్వేదం ఇది. మణిపూర్ మానవ మృగాలకు ఈ వేటూరి ఆరవ వేదవాక్కును చెప్పే వారెవరిప్పుడు?
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా… ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారన్నది వేద వాక్కా? గురు వాక్యమా? నీతి సూత్రమా? మంత్రమా? కుతంత్రమా? ఆదర్శమా? ప్రమాణమా? అనుభవమా? కట్టుబాటా? నోటి మాటా? శ్లోకమా? ఇవేవీ కాక… ఏదో తేల్చుకోలేని శోకమా?
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అన్న ఆదర్శాల చిలుక పలుకలను వినలేక మణిపూర్ ఆకాశం గుండె పగిలి రోదిస్తున్నది. మానవత్వం మంట గలిసి…‘తెగ’ నగ్నంగా ఊరేగుతోంది. అవమానం పల్లకీ ఎక్కి తిరుగుతోంది. ఊళ్లు వల్లకా ని వల్లకాళ్లు అవుతున్నాయి. బతుకు బూడిద అవుతున్నది. మనిషిని చూసి మృగాలు సిగ్గుతో తలదించుకుంటున్నాయి.
నలభై రోజుల్లో నాలుగు లక్షల కిలోమీటర్ల ఆవల ఉన్న చంద్రమండలం మీద శ్రీహరికోట చంద్రయాన్ కాలు మోపే రాకెట్ వేగపు రోజుల్లో… మానం పోయిన మణిపూర్ వార్త పక్కవారికి చేరడానికి 77 రోజులు పట్టిందా? పైగా మానాపహరణ పర్వానికి సాయుధ పోలీసులే సాక్షులా? ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలయ్యారు. జ్వాలను రగిలించిన తెరవెనుక సూత్రధారులు, తెరమీద పాత్రధారులు ఎవరో తల తెగి తడికలకు వేలాడే నోళ్లు చెప్పలేవు. పోతే పోనీ ప్రాణాలు. వస్తే రాని కష్టాలు. తెగల తక్కెడలో లాభం మొగ్గు అంతిమ తూకం కావాలి. ద్వేష రాజకీయాల రాజసూయ యాగానికి వదిలిన అశ్వమేధ యాగపు గుర్రాలను ఈశాన్యంలో వెతుక్కోవాలి. హవనంలో మానవ హనన హవిస్సులకు నవీన ధర్మరక్షణ అర్థాలు చెప్పుకోవాలి.
మహిళలు ఒంటరిగా అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగిన నాడే ఆజాదీకి అర్థం, పరమార్థం. అమృత మహోత్సవం అనే మాటకు అర్థమేమిటో? మణిపూర్ వీధుల్లో, పట్టపగలు దేశ సంపద అయిన యువకులు ఒలిచిన విలువల వలువల్లో దొరుకుతుందా? పట్టపగలు, నడివీధి పైశాచిక ఊరేగింపులో మర్మావయవాలను తాకుతూ… వీడియోలను షూట్ చేస్తే ఆజాదీ- అమృత మహోత్సవం అవుతుందా? మృత మహోత్సవం అవుతుందా? చెప్తావా! ఓ మహాత్మా! ఓ మహర్షీ!
పమిడికాల్వ మధుసూదన్
99890 90018