మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు చాలా రోజులే తీసుకున్నది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గద్దెనెక్కారు. చివరి నిమిషం దాకా సీఎం పదవి కోసం పట్టుబట్టిన ఏక్నాథ్ షిండే తన బెట్టు వీడి ఓ మెట్టు దిగి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధపడ్డారు. రెండో ఉప ముఖ్యమంత్రి పదవిలో అజిత్ పవార్ యథావిధిగా ఒదిగిపోయారు. కూటమిలో అత్యధిక స్థానాలకు పోటీ చేసి సొంతంగా మెజారిటీ సాధించాలనుకొని రంగంలోకి దిగిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. కేంద్రంలో మోదీ సర్కార్ లాగే ఇక్కడా బీజేపీకి మిత్రుల అవసరం తప్పనిసరైంది. అందుకే అత్యున్నత పదవిపై అంతగా మల్లగుల్లాలు పడాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూటమి పక్షాల మెడలు వంచి ఫడ్నవీస్‌కు పట్టం కట్టించి తన పంతం నెగ్గించుకున్నది. దీంతో మహారాష్ట్ర మరోసారి పూర్తిగా బీజేపీ వశమైపోయిందని భావించవచ్చు.
బీజేపీ అధినాయకత్వం తరఫున సీఎం ఎంపిక తతంగంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ ఏర్పడినట్టు వ్యాఖ్యానించడమే అందుకు ఓ సూచనగా భావించాలి. ఫలితాలు వెలువడిన తర్వాత పక్షం రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన బేరసారాల ఫలితంగా ఏక్నాథ్ షిండే తన సీఎం అవతారాన్ని చాలించాల్సి వచ్చింది. శివసేనను చీల్చి బీజేపీని అధికారానికి చేరువగా తెచ్చినందుకు, రెండున్నరేండ్లు అధికారంలో కొనసాగడమే కాకుండా మరోసారి కూటమిని గెలుపుబాట పట్టించినందుకు తనకే మరోసారి సీఎం పదవి ఇవ్వాలనే వాదనపై బీజేపీని ఆయన ఒప్పించలేకపోయారు. అయితే, చివరి నిమిషం దాకా ఉత్కంఠ మాత్రం కలిగించారు. బీజేపీ నాయకత్వం ఆయనకు ఏయే హామీలిచ్చి దారికి తెచ్చుకుందో తెలియదు. రెండో స్థానంలో సర్దుకునేందుకు షిండే అంగీకరించక తప్పలేదు. దీనిని కేవలం ఒకటో స్థానం నుంచి రెండో స్థానంలోకి మారడంగా మాత్రమే చూడలేం.
తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తే షిండే రాజకీయ భవితవ్యం డోలాయమానంలో పడినట్టేనని చెప్పవచ్చు. ఆయన మరోసారి సీఎం అయ్యే అవకాశాలు ఇక లేనట్టేనని భావించాలి. పైగా షిండే వర్గం సంఖ్యాబలం కూడా బీజేపీని లొంగదీసుకునే స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఒకవేళ షిండే వర్గం మద్దతు లేకపోయినా అజిత్ పవార్ వర్గం అండతో సర్కారు ఏర్పాటుచేసే అవకాశం బీజేపీకి ఉండనే ఉన్నది. నిన్న షిండే శివసేనను చీల్చినట్టుగానే రేపు బీజేపీ షిండే వర్గాన్నీ చీల్చి తన అధికారాన్ని పదిలం చేసుకున్నా ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే సొంత ఎజెండాను అమలు చేసేందుకు పూర్తి అధికారం తనకే ఉండాలని ఆ పార్టీ కోరుకుంటుందనేది జగమెరిగిన సత్యం. దేశంలో అప్రతిహత ఆధిపత్యాన్ని కోరుకునే బీజేపీ షిండే వంటి ప్రాంతీయ పార్టీల నేతలను వాడుకొని ఆపై వదిలించుకుంటుంది. ఇది జగమెరిగిన సత్యం. థాక్రే కుటుంబానికి నమ్మకద్రోహం చేసిన షిండేను బీజేపీ ఎన్నటికీ విశ్వసించదు గాక విశ్వసించదు. పైకి కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటుండవచ్చు. కానీ, అంతిమంగా ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడం ఆ పార్టీ లక్ష్యమనేది గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర పరిణామాలు బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటివారికి కనువిప్పు కావాలి.