దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీజీ మాటలకు అర్థం. జాతిపిత చూపిన బాటలో ఆయుధం పట్టకుండా ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. పోరాడి సాధించుకున్న తెలంగాణను గాంధీజీ ఆశయాల సాధన దిశగా పరుగులెత్తించారు. అతి తక్కువ కాలంలోనే పల్లెలు స్వయం సమృద్ధి దిశగా పయనించేలా చేశారు. కానీ, ఒక్క ఏడాదిలోనే తెలంగాణ పల్లెల పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పల్లెల్లో పాలన గాడి తప్పింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు పొందింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ పల్లెల నడ్డి విరిచింది. రేవంత్‌రెడ్డి అధికారం పీఠం ఎక్కిన రెండు నెలలకే గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఇప్పటికే 14 నెలలు దాటినా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం లేదు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు కాంగ్రెస్ సర్కార్‌కు తలకు మించిన భారంగా మారింది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకపోవడం, అధికారంలోకి వచ్చాక ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడంతో పథకాల అమలుకు నిధుల కటకట ఏర్పడింది. ఆ దెబ్బ మొదటగా గ్రామీణ ప్రాంతాలపైనే పడింది. దీంతో అతి తక్కువ కాలంలోనే పల్లెలు కాంగ్రెస్ సర్కారుపై శివాలెత్తుతున్నాయి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓట్లు వేసినామని, మరోసారి ఓట్లు అడిగితే కర్రు కాల్చి వాత పెడతామని గ్రామీణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎన్నికలంటేనే వణుకుతున్నది. లేనిపోని కారణాలు చెప్తూ ఏడాదిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నది.
పల్లెలు పచ్చగా ఉంటేనే తెలంగాణ బాగుంటుందని భావించిన కేసీఆర్ గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేశారు. గ్రామ పంచాయతీలకు నెల నెల రూ.275 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.142 కోట్లు చొప్పున నిధులు విడుదల చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.3,300 కోట్లు, మున్సిపాలిటీలో రూ.1,700 కోట్లను కేటాయించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట రూ.20 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామానికో ట్రాక్టర్ చొప్పున 12 వేలకుపైగా ట్రాక్టర్లు సమకూర్చారు. కానీ, ఏడాది కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అధ్వానంగా మారాయి. పల్లెల్లో పాలకవర్గాలు లేకపోవడంతో పాలన పడకేసింది. సర్పంచ్‌లు లేకపోవడంతో నిధులు లేక పల్లెలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్ల డీజిల్‌కు కూడా డబ్బులు లేని దుస్థితి. పండగ పూట కూడా గ్రామాల్లో విద్యుత్తు దీపాలు వెలిగించలేని పరిస్థితి. నిధుల కటకట ఏర్పడటంతో వేసవిలో గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొన్నది. మోటర్లు, మిషన్ భగీరథ పైప్లైన్లకు మరమ్మతులు చేయిస్తేనే ఇంటింటికి నల్లా నీరు వస్తుంది. ఇప్పుడు ఆ పనులన్నీ చేయడానికి పంచాయతీల ఖజానాలో చెల్లిగవ్వ కూడా లేదు. అదే గ్రామ సర్పంచ్‌లు ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు.
ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయని కాంగ్రెస్ ఎన్నికలంటేనే భయపడుతున్నది. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని, ఊర్లలో తిరిగే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో ఏ మోహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఇటీవల జరిగిన సమావేశంలో స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని భావిస్తున్న ప్రభుత్వం.. పల్లెలను కష్టాల ఊబిలోకి నెడుతున్నది. స్థానిక సం స్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.