2008, హెచ్ఎంటీవీలో ట్రైనీ జర్నలిస్టుగా మొదలైన నా పాత్రికేయ ప్రయాణం ఆ తర్వాత ‘టీ’ న్యూస్, ఇప్పుడు ‘తెలుగు స్ర్కైబ్’లో కంటెంట్ హెడ్‌గా కొనసాగుతున్నది. పాత్రికేయురాలిగా ప్రజలకు నేనందించిన సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం నన్ను ఉత్తమ జర్నలిస్టుగా గుర్తించింది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే..? నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందన్నట్టు.. ‘ఆవుల సరిత అసలు జర్నలిస్టే కాదని’, ‘ఆమె ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త’ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేశారు. నేనేంటో,గత 16 ఏండ్లుగా నాతో పాటు పనిచేసిన జర్నలిస్టులందరికీ తెలుసు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పే అబద్ధాలు ఒకరిద్దరు నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి, నా గతాన్ని ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే.. 16 ఏండ్ల నా జర్నలిజం ప్రస్థానంలో 2024, ఆగస్టు 22 ఒక చీకటి రోజు. అదొక దుర్దినం. ఆ రోజు అసలేం జరిగిందంటే..?
Attack On Journalists | రక్షణ కోసం మా కార్లు వెంటనే వెల్దండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. పోలీస్‌స్టేషన్ లోపలికి కార్లు వెళ్లే మార్గం లేకపోవడంతో గేట్లముందే కార్లు ఆపి దిగి లోపలికి వెళ్లే లోపు మా వెంటే నాలుగైదు కార్లు వచ్చి ఆగాయి. ద్విచక్ర వాహనాలపైనా రౌడీలు వచ్చారు. సుమారు అరువై మంది ఠాణాకు వచ్చారు. ఫోన్లు, కెమెరాలు ఇవ్వండంటూ మళ్లీ దాడులు మొదలుపెట్టారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే నాపై దాడికి ప్రయత్నించారు. మహిళా జర్నలిస్టులమని కూడా చూడకుండా ఆ రౌడీలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే రాయలేని భాషలో బూతులు తిట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ‘రుణమాఫీ’పై చర్చలు జరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఆ చర్చలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాకు తెలిసిన కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు పాపం వాళ్లకు రుణమాఫీ కాలేదనే విషయం తెలిసింది. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఒకేసారి రైతులందరికీ మొత్తం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు రైతులేమో మాకు రుణమాఫీ కాలేదంటున్నారు. దీంతో ఎవరు నిజం చెప్తున్నారో?, ఎవరు అబద్ధం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. అందుకే ఫీల్డ్‌లోకి వెళ్లి రుణమాఫీపై కేస్ స్టడీ చేయదలచుకున్నాను. అందులో భాగంగానే పది రోజుల కిందట ఓ రోజు మెదక్ నియోజవర్గంలోని ఒక ఊరుకు వెళ్లాను. అక్కడి రైతులతో మాట్లాడితే చాలామంది రైతులు తమకు రుణమాఫీ కాలేదనే చెప్పారు. రుణమాఫీ అంశంపై రైతులతో మాట్లాడేందుకు రాష్ట్రం మొత్తం కలియదిరగాలని అప్పుడే, ఆ క్షణమే అనుకున్నాను. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోని సర్వేల్, సంస్థాన్ నారాయణపూర్, మల్లారెడ్డిగూడెంతో పాటు ఇతర గ్రామాల్లోనూ నాతో పాటు మా ఛానల్ జర్నలిస్టులు సందర్శించారు.
2024, ఆగస్టు 22 గురువారం రోజు ఉదయం 6 గంటలకు సోమాజిగూడ నుంచి కొండారెడ్డిపల్లికి మా కారు బయల్దేరింది. ‘మిర్రర్ టీవీ’ ప్రతినిధిగా జర్నలిస్టు సోదరి విజయారెడ్డి కారు కూడా మాకు తోడైంది. ఆమెతో సహా అందులోనూ ముగ్గురు వ్యక్తులున్నారు. కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఊరు. కొండారెడ్డిపల్లిలో ఇలా కాలుపెట్టామో లేదో.. ఎడమవైపున పాల కేంద్రం కనపడింది. పాల కేం ద్రంలో రైతులు ఎక్కువగా ఉంటారనే ఆలోచన రావడం, డ్రైవర్‌కు ఆపమని చెప్పడంతో ఆయన కారుకు బ్రేకులు వేశాడు. వెంటనే మా కెమెరామెన్ మైక్, కెమెరాలతో సిద్ధమయ్యాడు. అప్పటికే ఉదయం 9 అవుతున్నది. కారులోంచి దిగిన మేం ముగ్గురు రైతులతో మాట్లాడినం.
‘మీకు రుణమాఫీ అయిందా?’ అన్న మా ప్రశ్నకు ముగ్గురూ ‘మాకు కాలేదు’ అని చెప్పారు. అక్కడి నుంచి మా కార్లు కదిలి, కొంచెం ముందుకువెళ్లిన తర్వాత కిరాణా దుకాణం వద్ద జన సమూహం కనపడటంతో అక్కడ ఆగాయి. అక్కడ కూడా నలుగురు రైతులతో మాట్లాడినం. ఆ నలుగురు రైతులూ ‘మాకు రుణమాఫీ కాలేదు’ అనే చెప్పారు. మేం అక్కడనే ఉన్నాం. అటుగా వెళ్తున్న ఇద్దరు రైతులను రుణమాఫీపై ప్రశ్నిస్తే.. ఒక రైతేమో ‘నాకు రుణమాఫీ అయ్యింది’ అని చెప్పగా, ఇంకో రైతు ‘నాకు రుణమాఫీ కాలేదు’ అని చెప్పాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మరో రైతును ప్రశ్నిస్తే.. ‘రుణమాఫీ కాలేదని చెప్తే మమ్మల్ని కొట్టి చంపుతరమ్మా… మా ఊరోళ్లు, అసలే మంచోళ్లు కారు’ అని చెప్పడం గమనార్హం. కొండారెడ్డిపల్లిలో ఉన్న రైతులను ‘మీ ఊళ్లో ఎన్ని క్రాప్ లోన్లున్నాయి, ఎంత మందికి మాఫీ అయ్యింది’ అని అడిగితే.. ‘వెయ్యి నుంచి పదకొండు వందల మందికి క్రాప్లోన్లుంటే… మూడొందల మందికే మాఫీ అయిందని’ చెప్పారు.
కిరాణా దుకాణం నుంచి రేవంత్‌రెడ్డి ఇల్లు పక్కన కొంచెం అటూ ఇటుగా ఉన్న గ్రామపంచాయతీకి మా కార్లు బయల్దేరినయి. అయితే, అప్పటికే రెండు వాహనాలపై నలుగురు వ్యక్తులు మా కదలికలను గమనిస్తున్నారనే విషయాన్ని మేం పసిగట్టలేకపోయాం. మా కార్లు గ్రామ పంచాయతీకి చేరేసరికి ఆ రెండు వాహనాలు కాస్తా నాలుగయ్యాయి. ఆ నాలుగు కాస్తా ఎనిమిది అయ్యాయి. ఇలా పంచాయతీలో కారు ఆపి ఇలా మేం దిగామో, లేదో.. మా చుట్టూ సుమారు వంద మంది గుమిగూడారు. ఒకతను.. ‘మీరెవ్వరు? ఎందుకు కొండారెడ్డిపల్లికి వచ్చారు?’ అని అడిగాడు. ‘మేం జర్నలిస్టులం, రుణమాఫీపై ప్రజల స్పందనను తెలుసుకునేందుకు వచ్చాం’ అని చెప్పడంతో.. ‘మా కొండారెడ్డిపల్లికి వచ్చేందుకు మీకెన్ని గుండెలు’ అంటూ రాయలేని భాషలో దుర్భాషలాడటం మొదలుపెట్టారు.
ఆ సమయంలో వాళ్లంతా రౌడీల్లా, నర రూప రాక్షసుల్లా వ్యవహరించారు. ‘మీరు కేవలం రుణమాఫీ కాని రైతులతోనే మాట్లాడుతున్నారు, రుణమాఫీ అయిన రైతులతో మాట్లాడటం లేదు. మా ఊరు దాటి ఆ కెమెరాలు బయటికి ఎలా పోతాయో చూస్తాం’ అంటూనే కెమెరాలు, మైక్‌లు, ఫోన్లు గుంజుకున్నారు. అడ్డుకున్న నా చున్నీని లాగారు. నెట్టేస్తే నేను వెళ్లి బురదలో పడిపోయాను. అడ్డుకున్న విజయారెడ్డిపైనా అదే తీరు. నాపై జరుగుతున్న దాడిని విజయారెడ్డి తన ఫోన్లో రికార్డు చేస్తుండగా ఆమె ఫోన్‌ను సైతం లాక్కున్నారు. ఈ పెనుగులాట గంటకుపైగా జరిగింది. ఆ తర్వాత బయటపడ్డ మేం ఎలాగోలా తప్పించుకొని ఒంగూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాం. పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న క్రమంలో మా కార్లపై రాళ్లతో దాడిచేశారు. పోలీస్‌స్టేషన్‌లో మేం పిటిషన్ రాస్తుండగానే విజయారెడ్డిని పిలిచి ఎస్సై ఫోన్ ఇచ్చేశాడు. ‘ఇది ఎవరు ఇచ్చారు సార్’ అనడిగితే ‘ఊరిలో ఈ సెల్‌ఫోన్ దొరికిందని ఎవరో ఒకతను తీసుకువచ్చి ఇచ్చాడని’ ఎస్సై చెప్పడం గమనార్హం.
కంప్లయింట్ ఇచ్చి, హైదరాబాద్‌కు బయల్దేరాం. మేం హైదరాబాద్‌కు చేరుకోవాలంటే మళ్లీ కొండారెడ్డిపల్లి మీదుగా రావాల్సిందే.. మేం కొండారెడ్డిపల్లికి చేరుకోగానే.. నాలుగైదు కార్లు మా కోసం కాపు గాస్తున్నాయి. ఆ కార్లలోంచి మమ్మల్ని చూస్తున్న వాళ్లు చూపుడు వేలు ఊపుతూ బెదిరించారు. వాటిని మా కార్లు దాటగానే అవి మా వెనుకే వచ్చాయి. మేం ఎటు వెళ్తే అటే మమ్మల్ని ఫాలో అవుతున్నాయి. నాకు తెలిసీ మా కార్లు ఆగితే అక్కడ మమ్మల్ని కొట్టేవాళ్లేమో, ప్రాణాలతో మేం బయటపడేవాళ్లం కాదేమో.. ఇక గత్యంతరం లేదు, ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిందేనని గమనించిన మేం దగ్గరలో ఏ పోలీస్‌స్టేషన్ ఉందని గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. వెల్దండ ఠాణా కనిపించింది.
రక్షణ కోసం మా కార్లు వెంటనే వెల్దండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. పోలీస్‌స్టేషన్ లోపలికి కార్లు వెళ్లే మార్గం లేకపోవడంతో గేట్లముందే కార్లు ఆపి దిగి లోపలికి వెళ్లే లోపు మా వెంటే నాలుగైదు కార్లు వచ్చి ఆగాయి. ద్విచక్ర వాహనాలపైనా రౌడీలు వచ్చారు. సుమారు అరవై మంది ఠాణాకు వచ్చారు. ఫోన్లు, కెమెరాలు ఇవ్వండంటూ మళ్లీ దాడులు మొదలుపెట్టారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే నాపై దాడికి ప్రయత్నించారు. మహిళా జర్నలిస్టులమని కూడా చూడకుండా ఆ రౌడీలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే రాయలేని భాషలో బూతులు తిట్టారు. మా కండ్లలోంచి నీళ్లు ఉబికివస్తున్నాయి. ఇది గమనించిన ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లు మమ్మల్ని లోపలికి తీసుకువెళ్లి బ్యాక్‌సైడ్ తలుపులు క్లోజ్ చేశారు.
మా కెమెరామెన్లు తీసిన వీడియోల్లో ఒకటి సోషల్‌మీడియాలో షేర్చేశాం. అంతే.. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్‌కర్నూల్ ఎస్పీతో మాట్లాడారు. ఆ ఎస్పీ ఆదేశాలతో మా రెండు కార్లకు పోలీస్ ఎస్కార్ట్ తోడైంది. భయం, ఆందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో హైదరాబాద్ పరిసరాలకు చేరుకున్నాం.
తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు జర్నలిస్ట్‌గా సాగరహారం, సడక్‌బంద్, సంసద్‌యాత్ర, వంటావార్పులతో పాటు అనేక ధర్నాలను, ఎన్నో కార్యక్రమాలను కవర్చేశాను. కానీ, ఏనాడూ ఇలా రౌడీలు నాపై దాడి చేయలేదు. ఒక్క నాపైనే కాదు, ఏ మహిళా జర్నలిస్టుపై కూడా దాడులు జరగలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో తన సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి జరగడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉన్నదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఊరు అయితే మాత్రం జర్నలిస్టులు వెళ్లకూడదా? రైతులతో మాట్లాడకూడదా? రైతులకు సంబంధించిన సమాచారాన్ని ఒక జర్నలిస్టుగా ప్రభుత్వానికి చేరవేయకూడదా? చేరవేస్తే తప్పవుతుందా?
చివరాఖరు: ప్రజల సుదీర్ఘ పోరాటాల తర్వాత తెలంగాణను ఇక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు సిద్ధమైంది. ఆ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సైతం అధిష్ఠానం చిన్న హింట్ ఇచ్చింది. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో దాడులు జరగడం మొదలైంది. ఆ తర్వాతే అర్థ మైంది. ఆ దాడులు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి సంకేతమని!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సుమా రు తొమ్మిది నెలలు కావస్తున్నది. ఈ తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకున్నది. నివురుగప్పి ఉన్న నిజాలను బయటపెడుతున్న నా లాంటి జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కిరాయి రౌడీలను ఉసిగొల్పుతున్నది, దాడులకు పాల్పడుతున్నది. మరి ఈ దాడులు ఇస్తున్న సందేశం?
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
ఆవుల సరిత యాదవ్
95539 55313