తలంటు
జంతువులన్నింటిలో మానవ జాతికి విశిష్టమైన మస్తిష్కం ఉన్నది. ఆలోచనలు, పనితీరు, ఇతరులతో వ్యవహరించేతీరును మెదడు నియంత్రిస్తుంది. అయితే ఈ విషయాల్లో అందరి ఆలోచనా తీరు, ప్రవర్తనాతీరు ఒకేలా ఉండవు. వాటిని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. ఎవరికైనా కుటుంబ విలువలు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సంస్కారం, పెరిగిన వాతావరణం, ఆర్థిక స్థాయి, నలుగురి మధ్య చదువుకున్న తీరు, పెరుగుతున్న కొద్దీ అలవడుతాయి. ఇవన్నీ కలిసి ఎవరికైనా వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఒకే ఇంట్లో తోబుట్టువుల ప్రవర్తన కూడా ఒకేలా ఉండదు. అత్యంత నీచంగా, దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని చూసినప్పుడు ఈ ఉపోద్ఘాతం చెప్పుకోవాల్సి వస్తున్నది.
శతాబ్దాలపాటు అలయ్ బలయ్ ఇచ్చుకుంటూ మ ర్యాదలు పాటించుకున్న హైదరాబా ద్ రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పట్ల ప్రస్తుత ప్రభుత్వం అ త్యంత నీచంగా, దారుణంగా ప్రవర్తిస్తున్నది. పాలకుల తీరును చూసి ప్రజలు నివ్వెరపోయి, దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రజాప్రతినిధులకు దక్కే గౌరవం చాలా ఉంటుం ది. అందులోనూ మహిళలయితే ఇంకా ఎక్కువ గౌరవం ఉంటుంది. మహాభారత కథను తలపిస్తూ స్త్రీల వస్ర్తాలు లాగటం అంటే అది ఏ రాజ్యాంగంలో ఉన్నది? ఏ ప్రభు త్వం అటువంటి ఆజ్ఞలు ఇచ్చింది? ఏ పోలీసులు అంత సాహసం చేశారు? పురుష ప్రతినిధుల దుస్తులు ముట్టుకోవటానికే అధికారం లేని వారు ఆ పని ఎలా చేశారు? అసభ్యంగా ప్రవర్తించిన వారు ఎవరు? దుర్యోధన, దుశ్సాసన సంతతివారా? దేశం మొత్తం మణిపూర్ రాష్ట్రంలా తయారు కాబోతున్నదా?
దేశంలో అన్నదాతల ఆర్తనాదాలకు దిక్కులేదు. 750 మంది కృషీవలులను పోగొట్టుకున్నందుకు దుఃఖం లేదు. అంతర్జాతీయ క్రీడారత్నాలు ఆవేదన చెందితే పాలకుల నుంచి స్పందన లేదు. ఒక నిస్సహాయ మహిళ, తన సొంత ఇంట్లో 5 నెలల గర్భాన్ని, మూడేండ్ల కూతురును, 11 మంది కుటుంబ సభ్యులను కండ్ల ముందు పోగొట్టుకుంటే జాలిలేదు. కోట్లు పెట్టి కట్టిన వంతెనలు రెండు నెలలు కాకుండా కూలిపోతే దిక్కుదివాణంలేదు. సైనికులు, విహారాలెళ్లినవారు ఉగ్రవాదుల చేతుల్లో అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఏలికలకు సిగ్గులేదు. లక్షల పాటశాలలు మూసి, వేల పాయిఖానలు కట్టామని గొప్ప చెప్పుకొనేవారి మేధోస్థాయి దేనికి పనికి వస్తుంది. ఒక దేశాన్ని పాలించే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవేనా? యథారాజా, తథాప్రజా అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చూపిన దారినే మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి.
కాకులను కొట్టి గద్దలకు దోచిపెడుతున్నాయి. ఇది మారాలంటే మామూలు తలంటు చాలదు. దీనికి ఆయుర్వేదంలో చెప్పిన ‘అభ్యంగన స్నానం’ అవసరమవుతుంది. దాని గురించి తెలుసుకుందాం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకుండా చాలారోజులు మకిలి, మట్టి, కుళ్లు పట్టి ఉంటుందో అప్పుడు చేసే స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారు. ‘అభి+అంగన’ అంటే ప్రతి అంగాన్నీ శుభ్రపరచటానికి కావాల్సిన సామగ్రి. అంటే నువ్వుల నూనె, సున్ని పిండి, పసుపు వగైరా!
ఇప్పుడున్న ప్రభుత్వాధికారుల ఒంటికి రెండు మూడేండ్లుగా మట్టి పట్టేసింది. వారికి పట్టిన వాత రోగం, బద్దకం, నిర్లక్ష్యం వగైరా వదలాలంటే ఉట్టి తలంటు చాలదు. పూర్తి శరీరాన్ని, దాని ద్వారా మనసు, ఆలోచనలను సరైన మార్గంలోకి తెచ్చే ప్రక్రియ అవసరం. కేంద్ర ప్రభుత్వ పాలకులు తప్పించుకు తిరుగుతున్నారు. కనీసం రెండు రాష్ర్టాల నాయకులకు అభ్యంగన స్నానం పోస్తే, మన రాష్ర్టాలు బాగుపడతాయేమో! బహుశా ఈ ప్రక్రియకు రాష్ట్రపతి అనుమతి కావాలేమో! ఈ రాష్ర్టాల పాలకుల, అధికారుల ఉన్మాదం ఇంకా ముదరకముందే ఈ ప్రక్రియ కానిస్తే బాగుంటుంది. అభ్యంగన స్నానం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
ఇప్పుడున్న పాలకులకు రక్తప్రసరణ సరిగాలేక ఎక్కడి ఆలోచనలు అక్కడ ఆగిపోయి బుర్రలు పని చేయడంలేదేమో! అభ్యంగన స్నానంలో నూనెతో శరీరం అంతటా మర్దన చేయడంతో రక్తప్రసరణ పెరుగుతుంది. కొద్దిగా ముద్దకట్టిన బుద్ధి పని చేస్తుంది. స్నానం చేయకపోవడం వల్ల బర్రె చర్మంలా మందంగా మారిన చర్మం సున్నితం అయి, ఆలోచనలు పెరుగుతాయి. ప్రజలు, వారికి అండగా నిలుస్తున్న స్థానిక పార్టీల పట్ల విద్వేషం తగ్గుతుంది. సున్నిపిండి, పసుపుపెట్టి ఒళ్లంతా నలుగుపెట్టి రుద్దుకోవటం వలన, దశాబ్దాల తరబడి తెలంగాణేతర నాయకుల ఊడిగం చేసి సంతరించుకున్న మడ్డి, మకిలి, స్థానిక ప్రజల మీద విద్వేషం తగ్గి తమ సొంత ప్రాంతమేదో గుర్తుకువస్తుంది.
మాతృభూమికి మించినది, స్వయంపాలన, సొంత గడ్డకు మించినవి లేవన్న జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఇండ్ల నుంచి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, సొంత,స్థానిక పాలకుల స్వీయ విధ్వంసక పాలన ఆగుతుంది. తాము కూర్చున్న చెట్టును నరుక్కోవడం లాంటి చర్యలు మానుతారు. ఈ స్వయం రోగనిరోధక చర్యలు మాని ఎవరి మాతృభూమి వారు కాపాడుకోవాలన్న సోయి కలుగుతుంది. ఇంత శృతిమించిన తర్వాత, చిన్న తలంటు చాలదు. వివరంగా ఈ పాలకులకు చక్కటి అభ్యంగన స్నానం చేయించాలి.
మానవులెవరికైనా వారి స్థాయిలో వారికి గౌరవం ఉంటుంది. అయితే ఈ గౌరవం సంపాదించుకోవడానికి రెండు జాగ్రత్తలు అవసరం. ఒకటి ఎదుటి వారెవరైనా వారికి గౌరవం ఇవ్వడం. రెండు, స్వీయ గౌరవం కలిగి తమను తాము తక్కువ స్థాయికి దించుకోవడం కలిగి తమను తాము తక్కువ స్థాయికి దించుకోకపోవడం. ఇది మూడు విధాలుగా జరుగుతుంది. ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, ఈ మూడింటిలో ఏ స్థాయిలో అగౌరవంగా ఉన్నా, ఆ గౌరవం నిలబడదు.
చాలామందికి ఈ విషయం తెలియదు. ఎదుటివారిని అవమానిస్తే తమకు గౌరవం దక్కుతుందనుకుంటారు. కానీ అది సరికాదు. మనం ఇతరులకు ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇంకో రకం మనుషులు ఆత్రంతో వేరేవాళ్లు సాధించిన విజయాలు తమ ఖాతాల్లో వేసుకుంటారు. అది కూడా పని చేయదు. ఎందుకంటే ఇతర మనుషులు కూడా మనను గమనిస్తుంటారు కదా అబద్ధం ఎన్నాళ్లు దాగుతుంది? అందుకే నిజమైన విద్యలో సత్యం అనే విలువ మొట్టమొదటగా నేర్పుతారు. ఇతరులకు చెందినవి తాకని వాడికి, ఎప్పుడూ సత్యం పలికే వాడికి జీవితంలో విజయాలు తప్పక కలుగుతాయి. వారు ఎవరితోటి ‘తలంటు’ పోయించుకోనక్కరలేదు.
కనకదుర్గ దంటు