పల్లెపదాలలో, పామరజనాలలో పరిఢవిల్లిన సమాజ సంస్కృతుల్లోని మహత్త్వాన్ని దాక్షిణాత్య భాషల్లోనే ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన క్రాంతదర్శులు ఆచార్య బిరుదురాజు రామరాజు. అనాధృత వాజ్ఞయంగా ఈసడించుకున్న జానపదాన్ని అందలాన్నెక్కించి అక్షరాభిషేకం చేసిన అమృతమూర్తులు వారు. జానపదం జ్ఞానపథం అంటూ వివిధ విశ్వవిద్యాలయాల్లో విశిష్ట పరిశోధన విభాగంగా విరాజిల్లుతూ నేటికి మూణ్నాలుగు వందలకుపైగా పరిశోధన గ్రంథాలు వెలువడడానికి నిస్సందేహంగా వారు చూపిన తోవయే రాజమార్గం. మరెన్నో సిద్ధాంత గ్రంథాలకు తెరిచిన ద్వారం వారి సిద్ధాంత గ్రంథం. ఎంత తరచి చూసినా తరగని గనిగా జానపదం ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉంది.
తాళీదళ సంపుట ప్రకట కాంతారాలలో మూలుగుతున్న ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్యాలనెన్నింటినో సేకరించి వెలుగులోకి తెచ్చిన పరిశోధన తత్పరులు వారు. సంస్కృత ‘వసుచరిత్ర’, శ్రీకృష్ణదేవరాయల ‘జాంబవతీ పరిణయం’, శ్రీనాథ కృత ‘శివరాత్రి మహాత్యం’ (పంచమాశ్వాసం), చింతలపల్లి ఛాయాపతి ‘రాఘవాభ్యుదయం’, సాయపనేని వెంకటాద్రి నాయకుని ‘సకలజీవ సంజీవనం’, మధురవాణి ‘రామాయణసార తిలకం’, కాకతీయ ప్రతాపరుద్రుని ‘ఉషా రాగోదయం’, వెల్లాల ఉమామహేశ్వరశాస్త్రి ‘శృంగారశేఖర భాణం’, ‘ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం’ మొదలైనవాటిని తొలిసారిగా లోకానికి తెలియజేసిన పరిశోధక వతంసులు వారు. ‘మరుగున పడిన మాణిక్యాల’ను ‘చరిత్రకెక్కిన చరితార్థులు’గా మార్చగలిగిన వారి పరుసవేదితనం ఆశ్చర్యదాయకం.
పారతంత్య్ర శృంఖలాబద్ధమైన సమాజంలో పుట్టి, కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజా ఉద్యమాలలో చూపిన తెగువ, కనబరిచిన ఆసక్తి, సమాజ పరిణామ గమనాల పట్ల వారికున్న అవగాహనకు దర్పణం. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యాపకులుగా, ఆచార్యులుగా చూపిన దీక్షాదక్షతలు, కాకతీయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ సమయంలో దాని రూపురేఖలను తీర్చిదిద్దిన వారి సామర్థ్యం.. దూరదృష్టి నేటికీ ఆదర్శప్రాయం. ప్రాచ్యవిద్వన్మహాసభల నిర్వహణలో, జానపద సదస్సులను, సారస్వత శిబిరాలను నడిపించిన తీరులో, పలు సాహిత్య సాంస్కృతిక సంస్థలకు పట్టుకొమ్మ అయి నిలిచిన రీతిలో వారి దార్శనికత సువ్యక్తం. వివిధ విశ్వవిద్యాలయ తెలుగుశాఖలకు పాఠ్యప్రణాళిక సంఘ సభ్యునిగా, పరీక్షకునిగా వారు చేసిన దోహదం అపూర్వం.
సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సేవను ఉగ్గడించినా, గీర్వాణాంధ్ర కావ్యాలను పరిష్కరించినా, ఉర్దూ-తెలుగు నిఘంటువులను నిర్మించినా, ఎన్నెన్నో పరిశోధనా పత్రాలను సమర్పించినా, ఎందరికో పర్యవేక్షకులై మార్గదర్శనం చేసినా ఇంకా ఎడతెగని సాహిత్యపిపాస వారిలో గోచరించి ఆశ్చర్యం గొలిపేది. మొదటి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ లభించినా, జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్గా ఉన్నతోద్యోగం వచ్చినా వాటిని తోసిరాజని అధ్యాపక వృత్తినే స్వీకరించడం తెలుగు భాషా సంస్కృతుల మీద, అధ్యయన అధ్యాపనల మీద వారికున్న ప్రగాఢ అభిమానానికి తార్కాణం. విద్యాభ్యాస కాలంలో, ఉద్యోగ నిర్వహణలో ఎవరికీ తలవంచని రాజసం, ఎవరినీ యాచించని ఆత్మాభిమానం, నిలబెట్టుకున్న ఆత్మగౌరవం సింహ సదృశంగా మెలిగిన విధానం అనితర సాధ్యం. అపూర్వాంశం. అఖిలభారత స్థాయిలో జాతీయ పరిశోధనాచార్యులుగా వారు పొందిన అరుదైన గౌరవం తెలుగునాట ‘అద్వితీయమైనది’, నిరుపమానమైనది. శివానంద విశిష్ట పౌరసన్మానం, అజో విభో కందాళ ప్రతిభామూర్తి సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్ సన్మానం, సీపీ బ్రౌన్ అకాడమీ సత్కారం మొదలైనవి వారు జీవితంలో పండించుకున్న ఉన్నతత్త్వానికీ, సాధించుకున్న ఉత్తమత్త్వానికీ ఎత్తిన జయపతాకలు.
సాహిత్య పరిశోధనం, సామాజిక పరిశీలనం, వైయక్తిక జీవనం అంతిమ గమ్యం ఆధ్యాత్మికపుటంచులు చేరుకోవడమేనన్నది వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఉద్యోగ విరమణ అనంతరం రెండున్నర దశాబ్దాలపాటు ‘ఆంధ్రయోగుల సేవ’లో వారు జీవితాన్ని కర్పూరంలా కరిగించుకొన్న తీరు అనితర సాధ్యం. ఏడు సంపుటాలలో 500 దాకా ఆంధ్రయోగుల జీవిత విశేషాలు, వారు చూపిన లీలలను సేకరించి, అక్షరీకరించి అందించిన వారి శ్రమ నాన్యతో దర్శనీయం. నవవిధ భక్తుల్లో స్మరణభక్తికి నిదర్శనం ఈ ‘ఆంధ్ర యోగుల’ సంపుటాలు సత్యసాయి పాదపద్మాల చెంత సమర్పించుకున్న వారి జీవితం ధన్యం, వారి రచనావ్యాసంగం ధన్యతమం.
1983లో ఎంఏ విద్యార్థిగా చేరిన నన్ను వారు చేరదీసిన తీరు, అజీవం ప్రదర్శించిన వాత్సల్యం ఎంతో అపురూపమైనవి. 1984లో వారి షష్టిపూర్తి ఉత్సవంలో కార్యకర్తగా పనిచేసిన నాకు, వారి అంతిమయాత్రలో చిట్ట చివరిదాకా నిలిచి అశ్రునివాళి అర్పించిన నాకు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుని హోదాలో అధికారికంగా వారి శతజయంతి ఉత్సవంలో అంజలి ఘటించే సౌభాగ్యం సిద్ధించడం నిజంగా నాకు ఆనందదాయకం.
-ఆచార్య వెలుదండ నిత్యానందరావు
94416 66881