మొన్నీ మధ్యే యూఎస్, యూకే దేశాల్లో రెండు వారాలు పర్యటించి తెలంగాణకు రూ.36,000 కోట్ల పెట్టుబడులను సాధించుకొచ్చారాయన. తద్వారా ప్రత్యక్షంగా 42,000 కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పనను కూడా సాధించారాయన. ఇది జస్ట్ ఒక ఉదాహరణ.
దావోస్‌లో ఆయన నాయకత్వంలో మన తెలంగాణ స్టాల్ అంటే ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలకు, వాటి సీఈవోలకు, అక్కడ కవర్ చేసే జర్నలిస్టులకు పిచ్చి క్రేజ్. కేంద్రమంత్రులు, ఇతర రాష్ర్టాల మంత్రులెవ్వరూ సాధించలేని వాణిజ్య ఒప్పందాలను రికార్డు స్థాయిలో సాధించి అక్కడనుంచి వెనక్కిరావడం ఆయనకు ఒక హాబీ. ఒక్కోసారి.. వరుసగా ప్రతి రోజూ ఏదో ఒక భారీ జాతీయ, అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం చేసుకోవడమనేది తెలంగాణలో ఒక సర్వసాధారణ విషయం అనిపించేలా చేశారాయన.
టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టీ-శాట్, టాస్క్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్.. దేశంలో ఎవ్వరూ ఇంతవరకు తలపెట్టని, ఊహించని ఇలాంటి ఇంకో డజన్ కాన్సెప్టులు, ఆలోచనలు, ఆవిష్కరణలు.. ఆయన విధాన నిర్ణయాలే, ఆయన ముందుచూపు ఫలితాలే. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల నుంచి ఆ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణ కోసం సాధించాలంటే ఎంతో పోటీ ఉంటుంది. ఆ పోటీ మన దేశంలోని రాష్ర్టాలతోనే అనుకుంటే పొరపాటే. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ పోటీలో ఉంటాయి. ‘హైదరాబాద్‌ను ఒక అత్యుత్తమ స్థాయి నగరంగా తీర్చిదిద్దే విషయంలోనూ మా ఆలోచన, మా పోటీ ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయి నగరాలతోనే తప్ప దేశంలోని నగరాలతో కాదు’ అంటారాయన. అదీ ఆయన ఆలోచనల స్థాయి.
విదేశాల్లో ఆయన పర్యటనలప్పుడు, వివిధ సమావేశాల్లో ఆయనతో మాట్లాడిన అక్కడి దిగ్గజ కంపెనీల అధినేతలు, సీఈవోలు ఒక సందేహం వ్యక్తం చేస్తారు. ‘భారత దేశంలోని కేంద్రమంత్రులు, ఇతర రాష్ర్టాల్లోని మంత్రులు ఈయనలా ఎందుకుండరు’ అని.
మామూలుగా కేంద్రమంత్రుల స్థాయిలోనే ఆహ్వానించే అనేక ప్రపంచస్థాయి చర్చాగోష్టులకు భారతదేశం నుంచి ఎవరినైనా పిలువాలనుకున్నప్పుడు అందరికీ మొట్టమొదట స్ఫురిం చే పేరు ఇప్పుడు ఆయనదే అయింది.
ఆయన కనుసన్నల్లో పనిచేసే వివిధ రంగాల్లో నిష్ణాతులైన అత్యంత సమర్థవంతమైన అధికారుల బృందం బహుశా దేశంలోని ఏ మంత్రి దగ్గరా లేకపోవచ్చునంటే అతిశయోక్తి కాదు. అధికారుల సామర్థ్యాన్ని గుర్తించి, తదనుగుణంగా వారి సేవలను అత్యుత్తమస్థాయి ఫలితాల రూపంలో, అమిత వేగంతో రాబట్టుకోగలగటం ఆయనొక్కడికే సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, గత తొమ్మిదేండ్లలో మంత్రిగా ఆయనొక్కడి చొరవ, కృషి వల్లనే ఇప్పటివరకు మన రాష్ర్టానికి మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కనీసం ఒక 22.50 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల్లో పాజిటివ్ పాలిటిక్స్‌ను ఇష్టపడే పౌరులంతా ‘మాకూ ఆయనలాంటి ఒక మినిస్టర్ ఉంటే బాగుండు’ అనుకుంటారు. అదే కోరికను ఆర్టికల్స్‌లో రాశారు, ఉపన్యాసాల్లో మాట్లాడారు, ట్వీట్లు చేశారు, ఇతర సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్నారు. ‘ఈయన్ని క్లోనింగ్ చేసి, రాష్ర్టానికొకర్ని ఈయనలాంటి మంత్రిని తెచ్చుకుంటే బాగుండు’ అని కూడా సరదాగా ఆశపడ్డారు.
కట్ చేస్తే… ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో ఆయన ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. స్పోర్ట్స్, గేమ్స్ ఫాలో అవుతుంటారు. నిత్యం వివిధ సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓటీటీల్లో వెబ్‌సీరీస్‌లు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. తాను చూసిన లేటెస్ట్ నాన్-తెలుగు సినిమా గురించి చెప్పి ఎదురుగా ఉన్న యాంకర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. సమావేశం ఏదైనా, సబ్జెక్టు ఏదైనా సరే.. అక్కడున్నది మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సరే.. తన మార్క్ చెణుకులు ఒకటో-రెండో అలా అలవోకగా పడాల్సిందే!
మొన్నీ మధ్యే ఒక పాపులర్ టీవీ చానెల్లో గంట నలభై నిమిషాల పాటు ఎలాంటి తడబాటు లేకుండా, ఏకధాటిగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతిఅంశానికి గణాంకాలనిస్తూ ఆ ప్రోగ్రాం ప్రజెంటర్‌ను ఒక ఆట ఆడుకున్నారాయన.
ట్విట్టర్‌ను రాజకీయాలకే కాకుండా, వేగవంతమైన ప్రజాసేవకు కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని దేశంలోనే మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి ఆయన. ఎలాన్ మస్క్ కూడా ఆశ్చర్యపోయేలా, ఆయనలోని మానవీయ కోణాన్ని తెలిపే ఒక నిరంతర మహా యజ్ఞానికి వేదిక అయింది ట్విట్టర్. పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా రాజకీయ లక్ష్యాలుంటాయి. కానీ, కేవలం తన రాజకీయ లక్ష్యాల కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని ఎవరైనా అనుకుంటున్నారంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. తెలంగాణ మీద మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, ఈ స్థాయి కృషి అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ మమకారం ఆయనలోని అణువణువులో అనంతంగా ఉన్నది కాబట్టే ఇదంతా చేయగలుగుతున్నారాయన.
ఎప్పటికప్పుడు ఎవ్వరు ఊహించని స్థాయి లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, నిరంతరం ఇంకేదో చెయ్యాలి మనం అని తపిం చే ఒక డైనమిక్ మంత్రిగా, తన సామర్థ్యమే కొలమానంగా, మరిన్ని ఉన్నత పదవులు అందుకుటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలోని యువతరం, పాజిటివ్ పాలిటిక్స్‌ను ప్రేమించే ఇంటలెక్చువల్స్, ఆంత్రప్రెన్యూర్స్, విద్యావంతులు ఆయన్నుంచి అంతకు మించింది ఇంకేదో ఈ దేశం కోసం ఆశిస్తున్నారు.
ఆయన… మాస్, క్లాస్ కలిసిన మ్యాజిక్. పాలిటిక్స్‌లో ఒక మంత్రి పనితీరు ఇంత స్టయిలిస్టిక్గా కూడా ఉండొచ్చు అని నిరూపించిన పయొనీర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
(వ్యాసకర్త: రచయిత, ఫిల్మ్ డైరెక్టర్)
మనోహర్ చిమ్మని
99895 78125