తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబడటానికి ముందున్న గతం మనందరికీ ఎరుకైందే. అరువై ఏండ్ల పాటు జరిగిన ఈ ప్రాంత విధ్వంసానికి వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన మాట వాస్తవమే. పైకి కనబడుతున్న ఈ నీళ్లు, నిధులు, నియమాకాలు అనే మూడు కారణాలే కాకుండా ఇంకో బలమైన కారణం కూడా ఉన్నది. మన దక్కన్ పీఠభూమిలోకి బహమనీలు, కుతుబ్‌షాహీలు ఆ తర్వాత నిజాం పాలకుల నుంచి ఉమ్మడి ఏపీ పాలకుల కాలం వరకు ముల్కీ-గైర్ ముల్కీ ఉద్యమంలో భాగంగా అంతర్లీనంగా ఉన్న ‘తెలంగాణ అస్తిత్వం’, దానికి ప్రాణమైన ‘తెలంగాణ ఆత్మ’నే.
మధ్యయుగాల కాలం నుంచి మొన్నటి ఉమ్మడి ఏపీ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ గడ్డ నిరంతరం తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, తన ఆత్మను ప్రదర్శించుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి, కొట్లాడి 2014, జూన్ 2న తెలంగాణ సాధించుకున్నది. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి శతాబ్దాల అస్తిత్వ పోరాటాలకు చరమగీతం పాడింది. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ తన ఆత్మను తాను ఆవిష్కృతం చేసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.
ఆచార్య జయశంకర్ తర్వాత తెలంగాణ ఆత్మ బాగా తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా ఉండి అరవై ఏండ్ల సమైక్య పాలనలో అన్నిరంగాల్లో జరిగిన విధ్వంసాన్ని పదేండ్ల పాలనలో వందేండ్ల తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తొలి పదేండ్ల పాలనలో తన ఆత్మను తాను పునరావిష్కరించుకున్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన ప్రతీ పథకం, ప్రతీ పనిలో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా తగిన చర్యలు తీసుకున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, సచివాలయం నిర్మాణం, యాదాద్రి ఆలయం, తెలంగాణ తల్లి విగ్రహం, 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. ఇలా ప్రతీ దాంట్లో తెలంగాణ ఆత్మ నిలబడేలా, కనపడేలా, వినపడేలా ప్రపంచం ముందుంచారు. మరో విధంగా చెప్పాలంటే తొలి పదేండ్ల పాలనాకాలంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు చూసుకున్నది ‘తెలంగాణ ఆత్మ’తో కూడిన అభివృద్ధి. కేసీఆర్ ఇందుకోసం ఖర్చుపెట్టిన ప్రతీ పైసాలో తెలంగాణ మార్కును చూపెట్టారు. అభివృద్ధిలో అతి తక్కువకాలంలోనే దేశంలో ముందు వరసలో తలెత్తుకుని నిలుచున్నది తెలంగాణ.
ఉద్యమకాలంలో సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినప్పటికీ, ప్రత్యేక తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రజలకు, పాలకులకు ఏదో జరిగిపోతుందనే భయాలు ఉత్పన్నమైనప్పటికీ, వాటన్నింటిని పటాపంచలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా మాత్రమే కేసీఆర్ తన పాలన సాగించారు. అంతేతప్ప ఎక్కడా వ్యక్తిగత ఎజెండా, సీమాంధ్రులు, ఇతర వ్యక్తులు, పార్టీల వ్యతిరేక ఎజెండాగా ఏనాడూ పాలన సాగించలేదు. ఉద్యమకారుడిగా సబ్బండ వర్ణాలను తన వాక్చాతుర్యంతో ఏకంజేసిన కేసీఆర్ పాలనలో మాత్రం ఒక పూర్తి స్టేట్స్మ్యాన్గా మారి తెలంగాణ ముద్రను వేసి తానే తెలంగాణ ఆత్మకు ప్రతీకగా నిలిచారనడంలో అతిశయోక్తి లేదు.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు అనే రాజనీతిజ్ఞతను తన జీవన విధానంలో భాగంగా చేసుకున్నారు కేసీఆర్. అందుకే తొలి పదేండ్ల కాలంలోనే తెలంగాణ అస్తిత్వాన్ని గట్టిగా నిలబెట్టగలిగారు. అందుకే పార్టీ ఓడినా ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం చెక్కు చెదరలేదు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే… ‘ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్టు’ ఈ ఒక్క సామెత చెప్తే చాలు. తెలంగాణ భావన, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ… అనే వాటిని పక్కనపెట్టి మోసపు వాగ్దానాలు, అసాధ్యమైన మాటలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కేవలం కేసీఆర్ వ్యతిరేక అజెండానే తమ పాలన గీటురాయిగా అన్నట్టు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతున్నది. తెలంగాణ ఆత్మ కేంద్రంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో నెలకొల్పిన వ్యవస్థలన్నింటినీ కూకటివేళ్లతో పడగొట్టడమే తమ పని అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మళ్లీ సీమాంధ్ర కాలం నాటి దృశ్యాలు తెలంగాణలో పునరావిష్కృతమవుతున్నాయి. నాడు మండు వేసవిలో సైతం అలుగులు దుంకిన చెరువులు నేడు నీళ్లు ఎండిపోయి నోళ్లు తెరిచి చూస్తున్నాయి. ఒకప్పుడు నీళ్లు లేక మెట్ట పంటలు మాత్రమే పండే ప్రాంతంగా ఉండే తెలంగాణ గత ప్రభుత్వ చర్యల వల్ల దేశానికే అన్నపూర్ణగా మారింది. ఒకానొక సమయంలో పంజాబ్‌ను తలదన్నింది. దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి సగర్వంగా తెలంగాణ అభివృద్ధి ఫలాలను ప్రపంచానికి చాటింది. ప్రస్తుత పాలకుల చర్యలను చూస్తుంటే మళ్లీ మనం మెట్ట పంటలకు మళ్లాలేమోననిపిస్తున్నది. ఇలా ఒక్కో రంగంలో తిరోగమనం మొదలవుతుందేమోనని సామాన్య ప్రజల కండ్లముందు ఒక ఆలోచన తిరుగుతున్నది. వాళ్లకు భయం కూడా మొదలైంది.
తెలంగాణ భౌగోళిక, భౌతిక, సాంస్కృతిక మూలాలు అణువణువూ తెలిసిన కేసీఆర్‌కు తెలంగాణలో ఏ ప్రాంతానికి ఎప్పుడు, ఏం కావాలో ? ఎప్పుడు ఏం చేయాలి? అనే దానిపై సూక్ష్మ అవగాహన ఉన్నది. అందుకే కేసీఆర్ తన పదేండ్ల పాలనా కాలంలో అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి వ్యక్తిగత ఎజెండాలు వాళ్లవి. అందుకే ప్రభుత్వానికి తెలంగాణ మీద దార్శనికత ఉన్నదనే నమ్మకాన్ని ప్రజల మనస్సులో కల్పించలేకపోతున్నది. అందుకే తెలంగాణ అభివృద్ధి మీద సామాన్య ప్రజల్లో ఇప్పటివరకున్న ఒక భరోసా క్రమంగా నశిస్తున్నది.
చివరగా… తెలంగాణ పాలకుడిగా ఎవరున్నా విజన్ మిషన్ అంతా తెలంగాణ ఆత్మ కేంద్రంగానే నడవాలని దారిచూపిన నేత కేసీఆర్. ఈ మౌలిక విషయం మరిచి ఏ రోటికాడ ఆ పాట పడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ప్రస్తుత పాలకులకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం తప్పక చెప్తారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నది గమనించాల్సిన వాస్తవం.
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్సీ)
-శేరి సుభాష్‌రెడ్డి