తెలంగాణ సాహిత్య ప్రపంచం మరో అపూర్వమైన వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ప్రముఖ రచయిత, తెలంగాణవాది, సామాజిక పరిశోధకుడు కొంపల్లి వెంకట్‌గౌడ్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడవడం తెలంగాణ సాహిత్య, ఉద్యమ, సామాజిక చరిత్రలో తీరని లోటు.
తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొంపల్లి వెంకట్‌గౌడ్ తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ తత్వం, ఉద్యమ చైతన్యం, సామాజిక బాధ్య త, ప్రజల ఆత్మగౌరవం, బడుగు వర్గాల సమస్యలను ఆయన రచనలు ప్రతిబింబించాయి. ఆయన రచనల్లోని ప్రతి అంశం సమాజంలో పరిపక్వతను తీసుకొచ్చింది. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించింది.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితాన్ని, ఆయన అనుభవాలను ‘వొడువని ముచ్చట’లో ప్రతిబింబించారు వెంకట్‌గౌడ్. తద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి, స్వతంత్ర ఆలోచనాశక్తిని కలిగించి, సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. ఈ గ్రంథం విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యమకారులకు మార్గదర్శకంగా నిలిచింది. జయశంకర్ సార్ సూత్రప్రాయ భావాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన అవిరళ కృషి, ప్రజా సమస్యల పరిష్కారానికి చూపిన శ్రద్ధకు నిదర్శనం ఈ గ్రంథం. రాష్ర్టానికి చెందిన నీటిపారుదలరంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్‌రావు ఆలోచనలను ‘నీళ్ల ముచ్చట’ పేరిట గ్రంథరూపమిచ్చారు వెంకట్‌గౌడ్. తద్వారా తెలంగాణ చరిత్రలో కొంపల్లి వెంకట్‌గౌడ్ స్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
కొంపల్లి వెంకట్ గౌడ్ విరచిత ‘సర్వాయి పాపన్న చరిత్ర’ బడుగువర్గాల ఆత్మగౌరవాన్ని, రైతు ఉద్యమాల చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. గౌడన్నలకు సంబంధించిన సంఘటనలతో పాటు, తెలంగాణ గ్రామీణ ప్రజల కష్టాలు, సామాజిక అన్యాయాలు, ఉద్యమ చైతన్యాన్ని సాహిత్య రూపంలో తదుపరి తరాలకు అందించారాయన. కొంపల్లి వెంకట్ గౌడ్ రచనలు సాంకేతికంగా, పరిశోధనాత్మకంగా ఉంటాయి. ప్రతీ గ్రంథంలో నిజ జీవిత సంఘటనలకు ఆయన ప్రాధాన్యమిస్తారు. పాఠకులకు తాత్కాలిక వినోదం మాత్రమే కాకుండా ఆలోచనాత్మక తృప్తిని అందిస్తారు. తెలంగాణ ఉద్యమ చైతన్యం, ప్రజల ఆత్మగౌరవం, భూమి-నీటి సమస్యలు, గ్రామీణాభివృద్ధి, సామాజిక సమానత్వం, బడుగువర్గాల సమస్యలపై ఆయన రచనలు అవగాహన కల్పించాయి. ఈ రచనలు సమాజంలో మార్పునకు, ప్రజల సాధికారికతకు మూలస్తంభంగా నిలిచాయి.
వెంకట్ గౌడ్ తుది శ్వాస విడిచినప్పటికీ ఆయన రచనలు, పరిశోధనలు తెలంగాణ సాహిత్య, సామాజిక, ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ‘వొడువని ముచ్చట’, ‘నీళ్ల ముచ్చట’, ‘సర్వాయి పాపన్న చరిత్ర’ వంటి గ్రంథాలు తెలంగాణ ప్రజల్లో సామాజిక భావాన్ని కలిగిస్తూనే, బాధ్యతను గుర్తుచేస్తాయి. వెంకట్ గౌడ్ జీవితం తెలంగాణ యువత, ఉద్యమకారులు, సాహితీ ప్రియులకు మార్గదర్శకం. ఆయన చూపిన దారిలో నడుస్తూ తెలంగాణ యువత సమాజంలో సాధికారత, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవాన్ని పెంపొందించాలి. కొంపల్లి వెంకట్ గౌడ్ మృతి తెలంగాణ సాహితీ లోకానికి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తెలంగాణ సాహిత్య ప్రపంచం ఆయనను ఎల్లవేళలా స్మరించుకుంటుంది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
రామకిష్టయ్య సంగనభట్ల 94405 95494