ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ వేస్తున్న కుప్పిగంతులు చూస్తే చెరపకురా చెడేవు అని పెద్దలు ఎందుకు హితవు చెప్పారో అర్థమవుతుంది. నీరు పల్లమెరుగు అనే నైసర్గిక సూత్రాన్ని తిరగరాసి గోదావరి గంగను కొండలెక్కించిన మహత్తరమైన కాళేశ్వరం ఓ మానవ నిర్మిత అద్భుతంగా మన్ననలు అందుకున్నది. ఈ ప్రాజెక్టు సూత్రధారిగా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తిప్రతిష్ఠలు నలుదిక్కులా వ్యాపించాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలకులకు ఇది మింగుడు పడటం లేదు. దాంతో కాళేశ్వరానికి కళంకం అంటగట్టే పనిలో పడ్డారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా ప్రజాప్రయోజనాలనూ బలిపెట్టేందుకూ సిద్ధమయ్యారు. సుదీర్ఘకాలం దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన చరిత్ర గల కాంగ్రెస్‌కు రాష్ర్టాలు, దేశం కన్నా రాజకీయాలే ముఖ్యం. అందరి ప్రయోజనాల కన్నా అధికారమే పరమావధి. అందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. అంతిమంగా భంగపడ్డారు. క్లుప్తంగా ఇదీ కాళేశ్వరంలో కాంగ్రెస్ పితలాటకం కథ.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పాలనలోనే గడిచినా కూడా పంట పొలాలకు, నీళ్లు లేకపోవడం, సాగుకు సరైన సౌకర్యాలు అందుబాటులోకి రాకపోవడం అనేది సిగ్గుచేటైన సంగతి. ఇందుకు ఆ పార్టీ బాధ్యత వహించాలి. ఈ నేరంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీయేననేది ప్రత్యక్ష సత్యం. ప్రజలకు ప్రత్యక్ష అనుభవం. బంగారం పండే సారవంతమైన నేలలు, ఆరుగాలం కష్టించి పనిచేసే రైతాంగం కలిగిన గడ్డమీద ప్రతి అంగుళం పంటభూమికి నీళ్లివ్వాల్సిన కాంగ్రెస్ తాను ఇవ్వకపోగా.. ఇచ్చిన కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టేందుకు తంటాలు పడుతుండటం విడ్డూరం. ఈ వితండవాదాన్ని ప్రకృతే ఎండగట్టింది. ప్రజల ముందు కాంగ్రెస్‌నే దోషిగా నిలబెట్టింది. కాళేశ్వరంపై ఖర్చుచేసిన లక్ష కోట్లు వృథా అని, అందులో నీళ్లకు బదులుగా అవినీతి ప్రవహించిందని కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజలను నమ్మించజూసింది. అదంతా కూలగొట్టి వేరే ఏదో కట్టాలని నానా హంగామా చేసింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టుగా కేసీఆర్ మీది అక్కసు కాళేశ్వరంపై చూపాలని ఉరుకులాడింది. కానీ, చివరికి ఇరికి ఇగిలించాల్సి వచ్చింది.
అసలు కాంగ్రెస్ చేసిందేమిటి? అనాలోచితంగా ఎస్సారెస్పీ కట్టింది. ఎగువన మహారాష్ట్రలో కట్టిన ప్రాజెక్టులతో అది వట్టిపోయింది. పెట్టిన ఖర్చు వృథా అయిపోయింది. పైగా ఆ దిగువనే ఎల్లంపల్లి తలపెట్టింది. దాన్ని పూర్తి కూడా చేయలేదు. నీళ్లు లేకుండా కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం ఎన్ని ప్రాజెక్టులు కడితే ఏమి ప్రయోజనం? అన్నీ కూడా ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్లుగా తయారయ్యాయి. పిచ్చిమొక్కలు మొలిచిన ప్రాజెక్టులకు మళ్లీ జలకళ తెచ్చేందుకు కేసీఆర్ మేధోమథనం చేశారు. ఓ ఉపనదిని వినియోగించుకొని ఈ వ్యవస్థకు తిరిగి ప్రాణం పోసేందుకు జరిగిన అపూర్వ భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. ఉపనది ప్రాణహిత సాయంతో జీవనది గోదావరికి వైభవోజ్వల స్థితిని సమకూర్చేందుకు చేసిన తపస్సు ఫలమే కాళేశ్వరం. కరువు రోజుల్లో కడుపు నింపే కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఇది.
ప్రధాన నదిలో నీళ్లు ఇంకిపోయినప్పుడు ఉపనది నీటితో మళ్లీ బతికించడమే దీని వెనుకనున్న మహత్తరమైన జలసూత్రం. గతంలో ఎస్సారెస్పీ నుంచి నీళ్లందని తెలంగాణ జిల్లాలకు, అలాగే మంజీర వంటి ఉపనదుల మీద నిర్మించిన సింగూరు వంటి ప్రాజెక్టులకు పుష్కలంగా నీళ్లు సమకూర్చడమే కాళేశ్వరం లక్ష్యం. కానీ కక్షతో ఈ ప్రాజెక్టును పడావు పెట్టేందుకు సమకట్టింది కాంగ్రెస్. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపి కాళేశ్వరం పనైపోయిపోయిందని గావుకేకలు పెట్టింది. కుటిల బుద్ధితో, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కాళేశ్వరం విధ్వంసాన్ని కోరుకున్నది. ఉద్దేశపూర్వకంగా నీళ్లు ఎత్తిపోయకుండా నయవంచనతో తాత్సారం చేసింది. కానీ ప్రకృతి ఎదురు తిరిగింది. కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెట్టింది. నీళ్లు లేక పొలాలు వెలవెలపోయాయి. చెరువులు నెర్రెలు బారాయి. రైతాంగం విలవిలలాడింది. కాళేశ్వరం పంపింగ్ చేయక తప్పని పరిస్థితి వచ్చిపడింది.
రాజకీయ స్వార్థం కోసం ప్రజలను, ప్రాజెక్టులను బలిచేయొద్దని, అట్లా చేస్తే ప్రజా దండుతో కదిలివచ్చి తామే కార్యరంగంలోకి దూకుతామని కేసీఆర్ ముందే హెచ్చరించారు. నీళ్ల మోటర్లు ఆన్ చేయకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి మేమే మోటర్లు నడిపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాఖీదు ఇచ్చారు. కొరడా ఝళిపిస్తే కాంగ్రెస్ సర్కారు దిగివచ్చింది. అన్నీ దిగమింగుకొని కిక్కురుమనకుండా నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టు కష్టకాలంలో ఆదుకుంటుందని నోటితో కాకున్నా చర్యల ద్వారా ఒప్పుకొన్నది. లక్ష కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చేసిన తలకుమాసిన ఆరోపణలు తప్పని తేలిపోయింది. పనికిరాదని ముద్రవేయాలనుకున్న ప్రాజెక్టు సకాలంలో ఆదుకుంటున్నది. కేసీఆర్ ముందుచూపు రాష్ట్ర ప్రజలకు రక్షణ దుర్గమైంది. జలసంరక్షణ మార్గమైంది. మరి వృథా ఎక్కడ జరిగింది? బట్టకాల్చి మీదేయాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టి కాంగ్రెస్‌కు తలవంపులు తెచ్చింది. రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను బలిపెట్టాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా కాంగ్రెస్‌కు ఈ ఉదంతం కనువిప్పు కలిగిస్తే పది వేలు.