మీ పెత్తనం ఇకపై సాగనీయం అంటూ ఎవరో ఒకరు బరిగీసి నిలబడితే తప్ప జాతులకు స్వీయ పాలన లభించదు. పరాయి పాలనలో,
బయటివారి ఆధిపత్యంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న జాతికి విముక్తి కలిగించిన వారిని ఆ జాతి ప్రజలు తమ జాతిపితగా గౌరవించుకుంటారు. ఆ వ్యక్తి అవిరళ కృషి, మొక్కవోని సంకల్పబలం వల్ల తమ తరాల బానిసత్వం కుప్పకూలిందని, వారి పోరాట ఫలితంగా స్వేచ్ఛా
వాయువులు పీల్చుకోగలుగుతున్నామని జనం నమ్మి ఆ పేరును తలచుకుంటారు. ఇందులో రాజకీయాలకు తావు లేదు. ఇది ఎన్నికల్లో గెలుపు, ఓటములకు సంబంధించినది కాదు. యోగ్యత గల వారిని జాతిపిత కాదని ఒకరు అన్నంత మాత్రాన ఆ గౌరవం వారికి చెందకుండా పోదు.
తెలంగాణలో కొన్ని రోజులుగా ఎవరు జాతిపిత? అనే మాట చుట్టూ రాజకీయ చర్చలు, విమర్శలు, ఆరోపణలు, తిట్ల దండకాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ పేరెత్తగానే చిర్రెత్తిపోయే రేవంత్రెడ్డి.. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సభలో మాట్లాడుతూ జాతిపిత అనే పదాన్ని ఎత్తుకొని, ఎన్నో పేర్లను పేర్కొంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతకుముందు జరిగిన రావి నారాయణరెడ్డి జాతీయ అవార్డు బహూకరణ సభలో కూడా ముఖ్యమంత్రి నోట జాతిపిత ప్రస్తావన వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాల జేఏసీ ద్వారా సిద్ధించిందని చెప్పారు. కానీ కేంద్రంలో ఏ పార్టీని ఢీకొట్టడానికి జేఏసీ ఏర్పాటు అయ్యిందో అదే వేదికపై ముఖ్యమంత్రి చెప్పాల్సింది. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ చేసిన మేలేమిటో చెప్తే బాగుండేది. మరి తెలంగాణ రాష్ట్రం గాల్లోంచి ఊడిపడిందా? కేసీఆర్ నాయకత్వంలోని ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి నడిపిన రాజకీయ, సామాజిక ఉద్యమం పాత్ర రేవంత్ మాటతో తుడుచుకుపోతుందా?
విఫలమైన తెలంగాణ తొలి పోరుకు కారకులెవరు? ఆయనది ఏ పార్టీ? ప్రజలు బ్రహ్మరథం పట్టిన తెలంగాణ ప్రజా సమితిని విచ్చిన్నం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? సొంత ప్రయోజనాలు చూసుకోకపోతే చెన్నారెడ్డి తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచేవారేమో! తిరిగి నలబై ఏండ్ల తర్వాత మలి తెలంగాణ ఉద్యమం రగిల్చిన బాటను రాజకీయంగా మలిచింది ఆనాటి టీఆర్ఎస్ కాదా? కేవలం ధర్నాలు, నిరసనల వల్ల రాష్ట్రం సాకారం కాదని, తెలంగాణ ప్రజల ఆక్రోశాన్ని ఉద్యమానికి తోడుగా ఎన్నికల్లో కూడా చూపించాలనేది కేసీఆర్ ఎంచుకున్న బాట. మైకులో కేసీఆర్ గొంతు వినబడితే ప్రజలు నిలబడి ఆయన చెప్పేది శ్రద్ధగా విన్నారు. వారంతా ఓట్లు వేయడం వల్లే ప్రజల ఆకాంక్ష చట్టసభల్లోకి చేరింది. 2014కు ముందు పదేండ్ల పాటు తెలంగాణ ఉద్యమ, రాజకీయ చరిత్ర అంతా గులాబీ పార్టీదే. మిగతా పార్టీలన్నీ ఊపిరాడక కప్ప గంతులేస్తూ కాలం గడిపినవే.
ఎన్నికలు ప్రభుత్వాలను మార్చుతాయి తప్ప చరిత్రను కాదు. నేటి గెలుపోటములు నిన్నటి పోరాటాన్ని తిప్పి రాయవు. 2014కు ముందు పదేండ్లు తెలంగాణ సాధనలో కేసీఆర్ కృషి ఒక చాఫ్టర్ అయితే, 2014 నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన మరో చాఫ్టర్. మరి, పదేండ్ల పోరాటం వల్ల దేశంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు మాత్రం ఒక జాతిపిత అవసరమే. ఇది ప్రజలు చెప్పాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును.. రెండింటికి ముడి వేసి జనాన్ని తికమక పెట్టాలని రేవంత్రెడ్డి చూస్తున్నారు. కానీ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చెరిగిపోదు.
-బద్రి నర్సన్