వందేండ్లకు పూర్వమే వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు సాహూ మహరాజ్. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక సంతకం చేసిన సాహూజీ ఆశయాలు, ఆలోచనలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో కూడా మన పాలకులు అమలు చేయకపోవటం విచారకరం. సగం జనాభాకు చట్టబద్ధమైన హక్కులు లేకుండా చేసిన విభజన రాజకీయాల అసలు రంగును సాహూజీ ఆనాడే పసిగట్టారు. ఆయనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఆధిపత్య రాజ్యాల అధిపతులు ఎన్ని ఆటంకాలు కలిగించినా సాహూజీ కింది కులాల పక్షాన్నే నిలిచారు.
ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో పాలకుడిగా బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం సాహూమహరాజ్ (26 జూన్ 1874-06 మే 1922) విశేష కృషి చేశారు. సామాజిక చైతన్యం, మహిళా అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. సాహూ మహరాజ్ వందేండ్లకు పూర్వమే అంతటి గొప్ప విధానాలను అమలు చేయగా, దశాబ్దాలుగా మన పాలకులు వాటిని కొనసాగించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహూమహరాజ్, జ్యోతిబాపూలే స్ఫూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 1235 గురుకులాలను నెలకొల్పారు.
వాటిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను కూడా అందించారు. ఈ గురుకుల ఫలాలు మరో మూడు నాలుగేండ్లలో బడుగుల బిడ్డలు అందుకోబోతున్నారు. ఇది తెలంగాణ సమాజంలో పదేండ్లలో వచ్చిన మార్పు. కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 1235 గురుకులాలను నిర్వీర్యం చేసే పనిని మొదలుపెట్టింది. గత రెండున్నరేండ్లలో గురుకులాల్లో 160 మంది పిల్లలు చనిపోయారు. తాజాగా 85 శాతం ప్రభుత్వ బడులను మూసివేస్తామని సీఎం ప్రకటించారు. వాటిల్లో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలే చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదని లెక్కలు చెప్పి, ఆ బడులను శాశ్వతంగా మూసివేసే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది.
నేడు బీసీలను అన్ని రంగాల్లో ఎదగకుండా చేస్తున్న ఆధిపత్య వర్గాల గుత్తాధిపత్యం ఎక్కడిదాకా వచ్చిందంటే రేవంత్‌రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బీసీలకు పాలించే లక్షణాలు లేవని అన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు ప్రకటించింది. కానీ ఇవన్నీ పచ్చి బూటకమని రెండున్నరేండ్ల పాలనలో తేలిపోయింది.
బీసీ మేధావులు, విద్యావంతులు బీసీలకు చట్టబద్ధమైన హక్కుల సాధనకై గొంతెత్తి గర్జిస్తున్న తరుణంలో సాహూజీ స్ఫూర్తితో బడుగుల అస్తిత్వం కోసం బలమైన ఉద్యమాలు నిర్మించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సామాజిక, ఆర్థిక సర్వే.. బీసీల జనాభాను తక్కువ చేసి చూపింది. వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రాజకీయ స్థితిగతులను సక్రమంగా రికార్డు చేసినట్టయితే వాటిని బహిరంగపర్చకుండా ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను అడుగడుగునా మోసపుచ్చుతూనే ఉన్నది.
ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పింది. కానీ ఎక్కడా అమలు కావడంలేదు. ఓట్లు దండుకోవటానికి ఏటా బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు ఇస్తానన్నది. కానీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు కూడా ఇవ్వడంలేదు. బీసీలకు అన్నింట్లో అన్యాయం చేసిన రేవంత్ ప్రభుత్వం, రోజుకు వంద అబబ్ధాలతో పాలన సాగిస్తున్నది. బీసీ పిల్లల ఉన్నత విద్యకు, చిరువ్యాపారాలకు పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఎంతమందికిచ్చారో లెక్కలు చెప్పగలదా ఈ ప్రభుత్వం?
హైదరాబాద్‌లో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కేటాయించారు. కొన్ని ఆత్మగౌరవ భవనాలు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని భవనాల నిర్మాణం జరుగాల్సి ఉన్నది. ఇంతలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ భవనాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కపైసా నిధులివ్వలేదు. ఇది బీసీ వర్గాల మనసులను గాయపరిచింది. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాల్లాంటి సంస్థలను ప్రతి మండల కేంద్రంలో బీసీ కొత్త గురుకులాలు ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీ పెడుతామన్నది. ప్రతి మండలంలో బీసీ వృత్తి కులాలకు 50 షాపులతో కాంప్లెక్సులు కడుతామన్నారు. ఇందులో ఏదీ అమలుకు నోచుకోలేదు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో గీత, నేత, గంగపుత్ర, ముదిరాజ్, యాదవ్‌లకు వృత్తిపరమైన సాయాలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ హామీలను చెత్తబుట్టలో పడేసింది. ఇప్పటికీ 850 రోజులు గడుస్తున్నా చేసింది శూన్యం. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడుతామని చెప్పిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత ముఖం చాటేసింది. విశ్వకర్మలు, రజకులకు కూడా పలు వాగ్దానాలు చేసింది. రెండున్నరేండ్ల పాలన ముగిసింది. కామారెడ్డి రిక్లరేషన్ పచ్చి బూటకమైంది. బీసీల ఓట్ల కోసం వేసిన గాలమని తేలిపోయింది. బీసీ రిజర్వేషన్ల పితామహుడు సాహూ మహరాజ్ జయంతి సందర్భంగా జరుపుకొనే సామాజిక న్యాయదినోత్సవం సాక్షిగా బీసీలకు దక్కాల్సిన హక్కుల కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై బీసీలు ఉద్యమదారి పట్టక తప్పదు.
– (వ్యాసకర్త: తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్)
జూలూరు గౌరీశంకర్