మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ జలసాధన ఉద్యమానికి పిలుపునిచ్చారు. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు 41 రోజులు సాగిన ఈ ఉద్యమం పది లక్షల మంది హాజరైన పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభతో తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించింది.
‘నీళ్లు మీకు.. కన్నీళ్లు మాకా?’ అంటూ ప్రశ్నించడం నేర్పింది. ‘దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి వలస జీవితాలు మనకిక వద్దు -కృష్ణా, గోదావరి జలాల్లో మా వాటా మాకు కావాలి!’ అంటూ నినదించడం నేర్పింది. ఆంధ్రుల జల దోపిడీకి అడ్డుకట్ట వేద్దామంటూ సుదీర్ఘకాలం సాగనున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోకి ప్రజలు కదిలివచ్చేలా చేశారు కేసీఆర్.
జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేండ్ల పాలనలో అప్పటికే నిర్మాణంలో ఉన్న గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్ప మరే ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత నాలుగున్నరేండ్లు కాంగ్రెస్ పాలన కొనసాగినా తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకుసాగలేదు. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటిరంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మూడంచెల విధానాన్ని చేపట్టారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడం, నిర్మాణ పనులు మొదలైన లేదా అనుమతులు పొందిన సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ-డిజైన్ చేయ డం, ‘కోటి ఎకరాల మాగాణం-నా స్వప్నం’ అని తాను ప్రకటించిన ఆకాంక్షను నెరవేర్చడం కోసం ప్రతి నియోజకవర్గానికి కనీసం లక్ష ఎకరాలకు సాగునీరివ్వడానికి కొత్త ప్రాజెక్టులు, పలు ఎత్తిపోతల పథకాలు చేపట్టడం లాంటి అనేక పనులు చేశారు.
వరుస కరువుతో ఒకనాడు విలవిలలాడిన తెలంగాణ 2023 డిసెంబర్ తొలివారంలో కేసీఆర్ పాలన ముగిసేనాటికి నిండుకుండలా మారి జలసంపన్న రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. 50 ఏండ్లుగా నిరాదరణకు గురై ఆక్రమణలతో, పిచ్చి మొక్కలతో నిండిన వేలాది గొలుసుకట్టు చెరువులు, కుంటలు మిషన్ కాకతీయ పథకంతో ప్రజల భాగస్వామ్యంతో పునర్ వైభవానికి నోచుకున్నాయి.
సమైక్య రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ధవళేశ్వరం ఆనకట్ట వరకు గోదావరి నదిపై (డెల్టాలోని సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోననే భయంతో) సుమారు 500 కిలోమీటర్ల వరకు ఒక్క బ్యారేజీని కూడా నిర్మించలేదు. ఈ వివక్ష వలన ఉప్పొంగే గోదావరి జలాలు ఉప్పు సముద్రం పాలైనాయే తప్ప తెలంగాణ బీళ్లను తడపలేదు.
కేవలం ఆరేండ్లలో ఆరు బ్యారేజీలను గోదావరికి అడ్డంగా నిర్మించి స్వయంపాలన ఎంత గొప్పదో చూపించారు కేసీఆర్. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరంతో, పాలమూరులో పూర్తిచేసిన పలు ప్రాజెక్టులతో వందలాది వాగులను, వేలాది చెరువులను అనుసంధానం చేసి, వాగులపై వెయ్యికి పైగా భారీ చెక్‌డ్యాంలను నిర్మించి, డజన్లకొద్దీ భారీ జలాశయాలను నిర్మించి, సుమారు రెండు వందల కిలోమీటర్లు గోదావరి నదినే నిండు తెలంగాణకు జలాభిషేకం చేశారు కేసీఆర్. దశాబ్దాలుగా అడుగంటిన పది లక్షలకు పైగా బావులు, బోర్లు మళ్లీ నీటితో నిండి ఎన్నో ఏండ్లుగా పడావున్న పొలాలు పంట చేలుగా మారినాయి. దశాబ్ద కాలం కూడా నిండకముందే రైతుల ఆత్మహత్యల, వలసల తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది, కోట్లాది టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది.
రెండేండ్లు పూర్తిచేసుకున్న కాంగ్రెస్ పాలనలో మరోసారి తెలంగాణ ఆగమైంది. 2023 అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కుట్రలు మొదలైనాయి. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ విధ్వంసానికి గురైంది. విధ్వంస చర్యల వల్ల బ్యారేజీకి ప్రమాదం జరిగిందని స్వయంగా ఆ ప్రాజెక్టు ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదు 25 నెలలైనా విచారణకు నోచుకోలేదు, బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. పర్యవసానంగా లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన వివిధ దశల కాళేశ్వరం పంపులు మూగబోయినవి. మండుటెండల్లో సైతం అలుగు దుంకిన చెరువులు, నిత్యం నీటితో కళకళలాడిన వాగులు ఎండిపోయి కనిపిస్తున్నవి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే 37 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సిన 28 ప్యాకేజీలలో పనులన్నీ రెండేండ్లుగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గోదావరిపై ఆరు బ్యారేజీలు కేసీఆర్ నిర్మించినా అవి ఇప్పుడు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మరోవైపు గోదావరి జలాలను రాయలసీమకు గంపగుత్తగా తరలించే చంద్రబాబు కుట్రలకు రేవంత్ సర్కార్ తలవంచి మద్దతిస్తూ తెలంగాణ ప్రయోజనాలను మంటగలుపుతున్నది.
బచావత్ ట్రిబ్యునల్ 1979లోనే గోదావరి జలాల పంపిణీ చేసినా తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీల నీటిలో కనీసం సగమైనా వినియోగంలోకి రాలేదు. పూర్తిస్థాయిలో తెలంగాణ వాటా జలాలను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం వద్ద నిర్మించే రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు వరకు గోదావరి ప్రాజెక్టులను రీ-డిజైన్ చేశారు.
గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన జలాలను బనకచర్ల, నల్లమలసాగర్ ద్వారా ఆంధ్ర, రాయలసీమకు అక్రమంగా తరలించే పన్నాగాలు పన్నుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చంద్రబాబుకు మద్దతునిస్తూ శాశ్వతంగా తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగమైనాయి. మరోవైపు 2023 నవంబర్ 30న తెలంగాణలో జనం పోలింగ్ కేంద్రాలకు పోతుంటే ఆంధ్ర పోలీసులు నాగార్జునసాగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం శ్రీశైలంపై ఆంధ్ర ప్రభుత్వానికి, నాగార్జునసాగర్‌పై తెలంగాణ ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. ఈ రెండు జాయింట్ ప్రాజెక్టులపై గత రెండేండ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం నడుస్తున్నది. ఆంధ్ర పోలీసులను సాగర్ నుంచి ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాల్సిన ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు మెప్పు కోసం తొమ్మిదిన్నరేండ్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించి తెలంగాణ సాగునీటి శాఖపై పూర్తి పెత్తనాన్ని ఇచ్చింది. అప్పటినుంచి మరోసారి కృష్ణా, గోదావరి జలాల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది.
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఉన్నా తెలంగాణకు ఎలాంటి ఫలితం సమకూరడం లేదు. వాటి వద్ద తెలంగాణ ప్రయోజనాల గురించి అడిగే నాథుడే లేడు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టును ఎండబెడుతూ కుడికాల్వ ద్వారా తెలంగాణ వాటా నీటిని ఆంధ్రకు తరలిస్తున్నా నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి సాగునీటి మంత్రిగా ఉన్నప్పటికీ జలదోపిడీని ఆపలేని నిస్సహాయ స్థితి. పాలమూరు రిజర్వాయర్లు ఎండిపోయినా పక్కనుంచి తరలివెళ్తున్న కృష్ణా జలాలను ఎత్తిపోసే ఆలోచన చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వందల టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు తరలించింది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు కేసీఆర్ పాలనలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పనులు కోర్టుల ‘స్టే’లను కాలరాస్తూ ముందుకు సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం ఆపే ప్రయత్నం చేయడం లేదు. కృష్ణా జలాల్లో అతిపెద్ద కుట్ర పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కొనసాగుతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు పూర్తయ్యే దశలో ఉండి ట్రయల్ రన్ ద్వారా విజయవంతంగా పాలమూరు నేలను తడిపినాయి కృష్ణా జలాలు. తన సొంత జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు కూడా నిధులను కేటాయించకుండా పెండింగ్‌లో పెట్టారు సీఎం రేవంత్.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ర్టాల నడుమ కృష్ణా జలాల పునఃపంపిణీపై సెక్షన్ 3 (ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956) కింద కేసీఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం అభ్యర్థించిన మేరకు కేంద్రప్రభుత్వం ఎనిమిదేండ్లు ఆలస్యం చేసి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ సాగునీటి హక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరితగతిన ట్రిబ్యునల్ విచారణను పూర్తిచేయాలని, తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలని ఏ మాత్రం ఒత్తిడి పెంచడం లేదు.
తెలంగాణ సాగునీటిరంగ విధ్వంసానికి కొసమెరుపు కేసీఆర్ పాలనలో నిర్మించిన తనుగుల చెక్‌డ్యాం (మానేరు నదిపై) పేల్చివేత. గత సంవత్సరం జనవరిలో ఇసుక మాఫియా హుసేన్ మియా వాగుపై చెక్‌డ్యాం పేల్చివేత ప్రయత్నాన్ని రైతులు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ జరపలేదు, చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా 21-నవంబర్ 2025న అర్ధరాత్రి తనుగుల చెక్‌డ్యాంను పేల్చివేసింది.
పెండింగ్‌లో ఉన్న, నిర్మాణంలో ఉన్న మరో వెయ్యి చెక్‌డ్యాంలను ఏ మాత్రం నిర్మించాలనే ప్రయత్నాలు చేయని రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ, తనుగుల వంటి నిర్మాణాలు ధ్వంసమవుతుంటే పట్టించుకోకపోవడం విద్రోహానికి మద్దతివ్వడమే అవుతుంది.
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కృషిచేస్తే, ఆ కృషిని ముందుకు కొనసాగించాల్సిన ప్రస్తుత ముఖ్యమంత్రి సాగునీటి విధ్వంసానికి, జలదోపిడీకి సహకరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.
మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమబాట పట్టాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణను కుట్రలు, కుతంత్రాల నుంచి కూడా పరిరక్షించుకోవాలి. జటిలమైన సాగునీటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగిన నాయకులు కేసీఆర్ ఒక్కరే. తన మాటల ద్వారా, కవులతో తాను దగ్గరుండి రాయించిన పాటల ద్వారా తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించగలిగారు. నలభై రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేస్తూ జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారు.
ఆంధ్రుల జలదోపిడీకి మళ్లీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి- ఆదిత్యానాథ్ దాస్ కుట్రలకు, కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం (2.0) ప్రారంభం కావాలి. ఈనాటి యువతరానికి ఆనాటి నీళ్ల గోస ఎలా ఉండేదో అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం, ఈ రంగంలో గతంలో సాధించిన విజయాల పరిరక్షణ కోసం కేసీఆర్, భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో మరో జెన్-జీ ఉద్యమం కొనసాగాలి. ప్రాణహిత జలాలు తెలంగాణ రైతుల ప్రాణధారలు కావాలి. కృష్ణవేణీ తరంగాలు సాగరమ్మై రూపు సవరించుకోవాలి. గొంతులెండుతున్న నల్లగొండ మాగాణాలకు మళ్లించాలి.
మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమబాట పట్టాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణను కుట్రలు, కుతంత్రాల నుంచి కూడా పరిరక్షించుకోవాలి. జటిలమైన సాగునీటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగిన నాయకులు కేసీఆర్ ఒక్కరే. తన మాటల ద్వారా, కవులతో తాను దగ్గరుండి రాయించిన పాటల ద్వారా తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించగలిగారు. నలభై రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేస్తూ జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారు.