KCR అంటే సమగ్ర, సమతుల్య ఫలాల సాధనల FACTORY. హస్తవాసి గల డాక్టర్ సకల రోగాలను ఎట్లా నయం చేయగలడో అట్లే ప్రజా జీవనాడి పట్టి, దేశ సుసంపన్నతకు అడ్డుగా నెలకొన్న సకల రుగ్మతలకు రాజకీయ చికిత్స చేయగల సౌత్ ఇండియా పొలిటికల్ స్పెషలిస్ట్ మన కేసీఆర్. ఆయన అమ్ముల పొదిలోని అస్త్రంగా ఉనికిలోకి వచ్చిన బీఆర్ఎస్ అంటే దేశానికి బేఫికర్ భరోసా ఇస్తోన్న వర్తమాన, భవిష్యత్తు ఆశా కిరణం.
నాడు టీఆర్ఎస్ సృష్టికి ఎటువంటి టైమింగ్ తోడైందో నేడు బీఆర్ఎస్గా రూపాంతరానికీ అటువంటి సక్సెస్ఫుల్ టైమింగే తోడైంది. పేరుకు జాతీయ పార్టీలే అయినా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలుగా డౌన్ అయిన సమయం. దేశం గురించి, దేశ పౌరుల బాగోగుల గురించి, భావి తరాల ఉజ్వల భవిత గురించి కించిత్ బాధ్యత లేని పైన పటారం. సోకు జోకుల నిజ రూపాన్ని దేశం ముందు ఉంచే సందర్భం. అప్రజాస్వామిక పోకడలు, దేశ పాలనా వైఫల్యాలు, లోటుపాట్లు, పొరపాట్ల చిట్టాను విప్పుతూనే సాధికార పరిష్కార చిట్కాల ముల్లె ఖుల్లా చేస్తోన్న శుభ తరుణం. తెలంగాణ మాదే, దేశమూ మాదే అంటూ విజయ గర్వంతో ఉప్పొంగే ఉద్విగ్న ఘడియలు. బీఆర్ఎస్ సాంకేతికంగా ఉనికి సంతరించుకున్న తొలి పూటలోనే ఈ నోటా ఆ నోటా యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నారు కేసీఆర్. బడా రాష్ట్రమైన యూపీ మొదలు బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ర్టాల రాజకీయ దిగ్గజాలు దేశానికి మంచి రోజులు రాబోతున్నాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడం సక్సెస్ ఇండికేషన్‌కు స్పాట్ రిజల్ట్.
దేశ రాజధాని ఢిల్లీకి నేడు రొటీన్‌గా తెల్లవారడంలేదు. ఇది సాదాసీదా వేకువజాము కానేకాదు. దేశ సమగ్రత, సమ సమాన సమతా మమతలకు అంకురార్పణ పూర్వక శుభోదయం. సరికొత్త చైతన్యపు భానోదయ కెరటం. ఇండియా నలుమూలలా సమ ప్రకాశానికి శ్రీకారం చుడుతోన్న నూతన అధ్యాయంతో పులకించే గుడ్ మార్నింగ్. దేశ సమూల ప్రగతి సుమాల సుగంధ పరిమళాల గుబాళింపునకు పురుడు పోసుకున్నది.
దేశానికే రోల్ మోడల్‌గా భాసిల్లుతోన్న తెలంగాణలో బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం హస్తిన దిశగా వడివడి అడుగులు పడ్డాయి. దేశ వ్యాప్తంగా రాజకీయ కార్యాచరణ, కార్యకలాపాలకు కేంద్రంగా ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం అందుబాటులోకి రానే వచ్చింది. మఖలో పుట్టి, పుబ్బలో పోయేదిగా పేర్కొన్న మానసిక దారిద్య్రులు, ఓర్వలేని అల్ప బుద్ధిగ్రస్థులు, అత్యాశ బాపతు పార్టీలు, సంస్థల పుట్టినే ముంచిన జన చైతన్య శిఖరం బీఆర్ఎస్. అధునాతన యుగంలోనూ ఆనాటి గాంధేయ మార్గాన్నే పాటించింది. ఉద్యమాన్ని నడిపించి ఒక జాతి ఆత్మగౌరవ పతాకగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. మన దేశమే కాదు, ఇతర దేశాలూ చూసి నేర్చుకునే ఫలితాలు చూపింది. ఈ అద్భుతాల చిరునామా కల్వకుంట్ల చంద్రశేఖర రావుది బేసిక్‌గా పెద్ద మనసు, పెద్ద చేయి. అందుకే తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతటా విస్తరింపజేయాలనే విశాల ఆకాంక్షకు తెలంగాణ సమాజం జేజేలు పలికింది. ఇతర రాష్ర్టాల నేతలు, పౌర సమాజాలు దిల్ సే స్వాగతం పలికాయి. దేశాన్ని ఇన్నేండ్లు పాలించిన, ప్రస్తుతం పాలిస్తున్నవారు దేశంలో సమృద్ధిగా ఉన్న ప్రకృతి వనరులను ప్రజలకు వినియోగించడంలో విఫలమయ్యారు.
జనం నెత్తిన మోయలేని పన్నులను, ధరా భారాలను మోపుతున్నారు. అసంబద్ధ, అనాగరిక విధానాలతో అణచివేత, సాచివేతల రుచి మరిగారు. పైగా దేశాన్ని, దేశ ప్రజలను తామే మోస్తున్నామని తెగ పోజులు కొడుతున్నారు. నిజానికి దేశ పౌరులే ఆ ఏలికలను, వారి పిడికెడంత మంది వ్యాపార సామ్రాజ్యాధీశులను తమ భుజ స్కంధాలపై మౌనంగా, అమాయకంగా, నిస్సహాయంగా మోస్తున్నారు. ఇటువంటి కటిక చీకట్లను చీల్చి చెండాడే కాంతి రేఖగా దక్షిణాది తెలంగాణ గడ్డపై నుంచి భారత రాష్ట్ర సమితి బయల్దేరింది. చైతన్య వీచికై, జాగృత జాడగా మారి దేశ సేవకు కంకణం కట్టుకుంది. ఎన్నో ప్రత్యేకతల టవరెస్ట్ పర్సనాలిటీగా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ భారత దేశంలో సమకాలీన, సరికొత్త చరిత్రకు నాంది పలకడం శుభ పరిణామం.
(వ్యాసకర్త : ఇల్లెందుల దుర్గాప్రసాద్ , 94408 50384, ఇండిపెండెంట్ జర్నలిస్ట్)