72nd National Film Awards | 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శనివారం కేంద్రం ప్రకటించింది. 2024లో విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్టికల్’ 370’ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికకాగా, ఈసారి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరు నటులకు పంచారు. ‘భ్రమయుగం’ చిత్రానికి గాను మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి, ‘చందూ ఛాంపియన్’ చిత్రానికి గాను కార్తీక్ఆర్యన్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక ‘ఆర్టికల్ 370’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరచిన యామి గౌతమ్‌ని జాతీయ ఉత్తమనటి అవార్డు వరించింది. తమిళ చిత్రం ‘అమరన్’కి దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ పెరియసామి జాతీయ ఉత్తమ దర్శకునిగా విజయబావుటా ఎగురవేశారు. ఈ ఏడాది 9 అవార్డులతో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. సామాజిక అంశాలను చర్చించిన సినిమాలు ఈ ఏడాది ఎక్కువ అవార్డులను గెలుపొందాయి.
ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఈసారి జాతీయ అవార్డులలో తెలుగు సినిమా ప్రభావం గట్టిగానే కనిపించింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలవడం విశేషం. ఇదే సినిమా ద్వారా జాతీయ ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా నితిన్ జిహానీ చౌదరి ఎంపికయ్యారు. యదువంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా ‘పుష్ప 2’ సినిమాకు గాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎన్నిక కాగా, ‘లక్కీభాస్కర్’ చిత్రానికి అద్భుతమైన సంభాషణలు రాసిన ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, జాతీయ స్థాయిలో బెస్ట్ డైలాగ్ రైటర్‌గా అవార్డును గెలుచుకున్నారు. జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ‘35-చిన్నకథ కాదు’ చిత్రం ఎన్నిక కాగా, ఆ సినిమాలో నటించిన అరుణ్‌దేవ్ పోతుల ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యాడు. ‘కమిటీ కర్రోళ్లు’ చిత్రానికి మేకప్ అందించిన పి.రవికమార్ బెస్ట్ మేకప్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
కలర్ గ్రేడింగ్(సీజీ)తో వెండితెరపై వాస్తవికతను సప్తవర్ణాలతో ఆవిష్కరిస్తున్న డిజిటల్ యుగం ప్రస్తుతం నడుస్తున్నది. అలాంటి రోజుల్లో వచ్చిన ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’. ఇదొక ప్రయోగం. ఇందులో మమ్ముట్టి కొడుమన్, చేతన్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఆయన ఆహార్యం, అభినయం, హావభావాలు, చూపు, నవ్వు.. ఇలా ప్రతి ఒక్క అంశం విభిన్నంగా అనిపిస్తాయి. చేతన్‌గా ఆయన ఆలోచింపజేస్తాడు. ఓ దశలో భయపెడతాడు. ఆయన రాక్షసుడా? మాంత్రికుడా? రెండూగాక భూతమా? అనేది చివరి దాకా ఆడియన్‌కి ప్రశ్నగానే కనిపిస్తుంది. అతని ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఏ జీవీ బయటపడటం అసాధ్యం అన్నట్టుంటుంది ఆయన పాత్రచిత్రణ. పతాక సన్నివేశంలో అయితే.. మమ్ముట్టి నట విశ్వరూపాన్నే ప్రేక్షకులు చూస్తారు. సూపర్స్టార్డమ్ ఉన్న ఏ హీరో ఈ తరహా పాత్ర పోషించరు. ఇది మమ్ముట్టికి మాత్రమే సాధ్యం.
‘కల్కి’ ఆగమనం కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి ఒకరు. గర్భస్థ శిశువుగా ఉన్న కల్కిని కాపాడుకునేందుకు అవతరించిన పురాణపురుషుడు మరొకరు. ప్రపంచానికి అధినేత కావాలని కలలు కనే రాకాసి ఇంకొకరు.. వీరిమధ్య జరిగే పోరే ‘కల్కి 2898ఏడీ’. పురాణాలకు సైన్స్ఫిక్షన్ని జోడించి, హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ద్రోణసుతుడు అశ్వత్థామగా బిగ్‌బీ అమితాబ్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్‌హాసన్, భైరవగా, కర్ణుడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్, సుమతిగా దీపిక పడుకోన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. నాగ్ అశ్విన్ ఆలోచన, సాంకేతికత, వైజయంతీనిర్మాణ విలువలు ఈ సినిమాకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. ‘కల్కి 2’ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఎదురు చూస్తున్నారు.
యదువంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ద్వారా చాలామంది కొత్తతారలు తెరకు పరిచయం అయ్యారు. కోనసీమ నేపథ్యంలో సాగే ఈ కథ ఆద్యంతం భావోద్వేగాలతో, గత స్మృతులకు నెమరువేసుకుంటూ వినోదాత్మకంగా సాగుతుంది. ప్రధాన పాత్రల తొలి ప్రేమల అనుభవాలు, ఊరి జ్ఞాపకాలు.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇదే ఈ సినిమా కథ. అసభ్యత, అశ్లీలతలకు తావు లేకుండా ఫీల్‌గుడ్ మూవీగా దర్శకుడు యదువంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే వాణిజ్యపరంగా కూడా సినిమా బాగా ఆడింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవడం అభినందనీయం.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చుట్టూ అల్లుకున్న కల్పిత సంఘటనలతో ‘ఆర్టికల్ 370’ చిత్రాన్ని తెరకెక్కించారు. యామిగౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకుడు. ఈ సినిమా కథా వివరాల్లోకి వెళితే.. సిన్సియారిటీకి మారుపేరైన ఇంటెలిజెన్స్ అధికారిణి జాని హక్సర్ (యామీ గౌతమ్) కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తుంటుంది. ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్‌ని హతమారుస్తుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఆమెను ఢిల్లీకి బదిలీ చేస్తారు. ఈలోగా ఆర్టికల్ 370ని రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఆర్టికల్ 370 రద్దుకు ముందే అక్కడి కశ్మీర్‌లోని ఉగ్రమూకలు, వేర్పాటువాద శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని నిఘా సంస్థలకు ఆదేశాలు అందుతాయి. ఈ నేపథ్యంలో పీఎంఓ జాయింట్ సెక్రటరీ అయిన రాజేశ్వరి స్వామినాథన్ (ప్రియమణి) రంగంలోకి దిగుతుంది. ఆమె తన బృందంతో కలిసి కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఛేదిస్తుంది. కశ్మీర్ లోయలో గూఢచారి ఆపరేషన్లు, కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను అమలు చేసే విషయంలో అధికారులు అనుసరించే ఎత్తుగడల నేపథ్యంలో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
‘ఆర్టికల్ 370’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా తొలిసారి జాతీయ పురస్కారాన్ని అందుకుంది యామీగౌతమ్. కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’ (2010) ద్వారా వెండితెరపై అరంగేట్రం చేసిందామె. అంతకుముందే చాంద్ కి పార్ ఛలో, యే ప్యార్ న హోగా కామ్ వంటి టెలివిజన్ ధారావాహికల ద్వారా పాపులర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథల్ని ఎంచుకుంటూ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల ద్వారా పేరు తెచ్చుకుంది. ‘విక్కీ డోనర్’ చిత్రంతో బాలీవుడ్లో ఆమెకు తొలిబ్రేక్ లభించింది. ఆ తర్వాత బద్లాపూర్, కాబిల్, యూరి: ది సర్జికల్ ్రైస్టెక్, బాలా వంటి చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ‘ఆర్టికల్ 370’లో ఎన్ఐఏ అధికారిణి జాని హక్సర్ పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్ విమర్శకుల్ని మెప్పించింది.
స్పోర్ట్స్ బయోపిక్ ‘చందూ ఛాంపియన్’తో తొలిసారి జాతీయ అవార్డు గెలుచుకొని సంచలనం సృష్టించారు కార్తీక్ ఆర్యన్. భారతదేశపు తొలి పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ షెట్కర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ అత్యుత్తమ నటనను కనబరిచారు. ఈ పాత్ర కోసం పూర్తి శాఖాహార డైట్‌ని ఫాలో అవుతూ 18 కిలోల బరువు తగ్గారు. బాక్సింగ్, స్మిమ్మింగ్, రెజ్లింగ్‌లో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ తీసుకున్నారు. సంఘర్షణాత్మకంగా సాగిన ఈ పాత్రలో కార్తీక్ ఆర్యన్ పరకాయ ప్రవేశం చేశారని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
తమిళ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తీసినవి రెండే చిత్రాలు. అయినప్పటికీ రియలిస్టిక్ ఫిల్మ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు. రెండో సినిమా ‘అమరన్’తో జాతీయ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్‌లో శివకార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి రాజ్‌కుమార్ దాదాపు ఐదేళ్ల సమయం తీసుకున్నారు. వరదరాజన్ జీవితాన్ని అధ్యయనం చేయడంతో పాటు సంఘటనల తాలూకు ప్రామాణికత కోసం తీవ్ర పరిశోధన చేశారు. బలమైన భావోద్వేగాలతో పాత్రల్ని తీర్చిదిద్దడం, వాస్తవికత ప్రధానంగా మానవీయ కోణంలో కథావిష్కరణ చేయడం దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి ప్రత్యేకతలుగా చెబుతారు.
‘35- చిన్న కథ కాదు’.. పేరుకు తగ్గట్టే ఇది చిన్న కథ కాదు. ఆలోచింపజేసిన కథ. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథ.. పిల్లల విషయంలో పెద్దలు ఎలా ఉండాలో చెప్పింది. దర్శకుడు నందకిశోర్ ఇమాని సందేశాన్నిస్తూ, ఆసక్తిగా ఎక్కడా విసుగన్నదే లేకుండా కథ నడిపించారు. ఉపాధ్యాయులకు సైతం ఈ సినిమా ఓ పాఠం లాంటిదే. ఈ సినిమాలో ఉత్తమ నటన కనబరచిన నటి నివేతా థామస్‌కి ఉత్తమనటిగా రాష్ట్రప్రభుత్వం గద్దర్ అవార్డును కూడా అందించింది. ఇప్పుడు జాతీయస్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు రావడం నిజంగా సముచితం.