48 జట్లతో మొదలై.. 38 రోజులుగా యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 103 హోరాహోరీ పోరాటాల తర్వాత సాకర్ ప్రపంచకప్ కథ ైక్లెమాక్స్‌కు చేరింది. క్రీడా జగత్తులోనే అత్యుత్తమైన ఫుట్‌బాల్ సింహాసనాన్ని అధిరోహించే అత్యున్నత దేశం ఏదో తేల్చే మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఒకవైపు మైదానంలో నిప్పులు చెరిగే అర్జెంటీనా ఆవేశం.. మరోవైపు ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే స్పెయిన్ వ్యూహాత్మక ఆటకు మధ్య న్యూజెర్సీ గడ్డపై అభిమానులకు అల్టిమేట్ కిక్ ఇచ్చే ‘ఫైనల్ వార్’ జరగనుంది. 39 ఏండ్ల వయసులో మరోసారి విశ్వవిజేతగా నిలవాలని కసిగా ఉన్న లియోనెల్ మెస్సీ ఆఖరి ప్రయత్నం.. బాల్యంలో అతడి చేతుల్లోనే ఒదిగిపోయి నేడు అదే దిగ్గజానికే సవాల్ విసురుతున్న స్పెయిన్ నయా సంచలనం లామిన్ యమాల్ ప్రతిఘటన.. ఈ ఫైనల్ పోరులో ప్రధాన ఆకర్షణగా మారాయి. మైదానం వెలుపల గురుశిష్యులైన ఇరు జట్ల కోచ్‌ల వ్యూహ ప్రతివ్యూహాల నడుమ జరగబోయే ఈ సాకర్ కురుక్షేత్రంలో గెలిచి.. ప్రపంచ కిరీటాన్ని కైవసం చేసుకునే అజేయ శక్తి ఏదో మరికొద్ది గంటల్లో తేలనుంది!
న్యూయార్క్: సాకర్ ప్రపంచంలోనే అత్యున్నత సమరానికి వేళయింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా జరగబోయే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ కింగ్ స్పెయిన్‌తో తలపడనుంది. మెస్సీ మ్యాజిక్‌తో వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని అర్జెంటీనా పట్టుదలగా ఉంటే, 2010 తర్వాత తొలిసారి ఫైనల్ చేరిన స్పెయిన్ ఎలాగైనా విశ్వవిజేతగా నిలవాలని ఆశిస్తోంది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టులో 2022 టైటిల్ గెలిచిన 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ టోర్నీలో అర్జెంటీనా ప్రయాణం అంత సులువుగా సాగలేదు. గ్రూప్ దశను అలవోకగా దాటినప్పటికీ నాకౌట్లో ప్రతీ మ్యాచ్‌లో కఠిన సవాల్‌ను ఎదుర్కొంది. అరంగేట్రం జట్టు కాబో వెర్డెపై ఎక్స్ట్రా టైమ్‌లో నెగ్గిన మెస్సీసేన ఈజిప్ట్, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌పై కష్టపడి గెలిచి ఫైనల్ చేరింది. అయితే తీవ్ర ఒత్తిడిలో, ఓటమి అంచున నిలిచిన సమయాల్లో ఏమాత్రం వెనక్కుతగ్గకపోవడం..
అఖరి క్షణాల్లో వరుస గోల్స్ చేయడం అర్జెంటీనా అతిపెద్ద బలంగా మారింది. 39 ఏండ్ల వయసులోనూ మెస్సీ తన అద్భుతమైన గోల్స్, అసిస్ట్‌లతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటికే హ్యాట్రిక్ సహా 8 గోల్స్ కొట్టి కప్పుతో పాటు గోల్డెన్ బూట్ రేసులోనూ ముందున్నాడు. తన చివరి ప్రపంచకప్ మ్యాచ్‌ను ఒక అద్భుత విజయంతో ముగించాలని అతను పట్టుదలతో ఉన్నాడు. ఆఖరాటలో మెస్సీపై అర్జెంటీనా భారీ అంచనాలు పెట్టుకుంది. అతనికితోడు సెమీస్‌లో అద్భుత గోల్స్ కొట్టిన ఎంజో ఫెర్నాండెజ్, లూటరో మార్టినెజ్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
స్పెయిన్ ప్రస్తుతం ఓటమెరుగని పవర్హౌస్లా దూసుకెళ్తోంది. వరుసగా 37 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన స్పెయిన్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2010 తర్వాత రెండో ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, గతంలో 38 మ్యాచ్‌లతో ఇటలీ (2018-2021) నెలకొల్పిన అంతర్జాతీయ అజేయ రికార్డును బద్దలు కొడుతుంది. గ్రూప్ దశలో కాబో వెర్డెతో తొలి పోరును డ్రా చేసుకున్న తర్వాత రోడ్రి కెప్టెన్సీలోని స్పెయిన్ అసాధారణ ఆటతీరును చూపెడుతూ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు అందుకుంది.
సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన రోడ్రిసేన ఒత్తిడిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఫేవరెట్‌గా నిలిచింది. ఫ్యూయెంటె మార్గదర్శకత్వంలో ఆడుతున్న ఈ జట్టు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ ప్రత్యర్థులకు కోలుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా ఇవ్వలేదంటే ఆ జట్టు డిఫెన్స్ ఎంత బలంగా ఉందో చెప్పొచ్చు. దాంతో అర్జెంటీనా ఫార్వర్డ్స్కు స్పెయిన్ డిఫెండర్లకు మధ్య రసవత్తర పోరు అభిమానులను అలరించడం పక్కా అనొచ్చు.
ప్రపంచకప్‌లో ఇరు జట్లు 1966లో ఒకేసారి తలపడగా.. అర్జెంటీనా 2-1తో గెలిచింది. అయితే మొత్తంగా ఆడిన 13 ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో స్పెయిన్ 6, అర్జెంటీనా 5 మ్యాచ్‌ల్లో గెలిచాయి, రెండు డ్రా అయ్యాయి. 2018లో జరిగిన చివరి పోరులో స్పెయిన్ 6-1తో అర్జెంటీనాను చిత్తు చేసింది.
ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి గంటన్నర ముందు వరల్డ్ స్టార్లతో కూడిన క్లోజింగ్ సెర్మనీ జరగనుంది. ప్రముఖ రాప్ స్టార్ పోస్ట్ మలోన్, రాబీ విలియమ్స్, ప్రముఖ స్ట్రీమర్ ఐషోస్పీడ అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. ఫైనల్ చరిత్రలోనే తొలిసారిగా హాఫ్-టైమ్ షోను ప్రవేశపెడుతున్నారు. మ్యాచ్ విరామ సమయంలో ఫుట్‌బాల్, సంగీతం కలబోతగా సాగే ప్రదర్శనలో పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్, మడోన్నా, షకీరాతో పాటు సౌత్ కొరియా మ్యూజిక్ సెన్సేషన్ బీటీఎస్ స్టేజ్‌పై సందడి చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినోతో కలిసి విజేతకు ట్రోఫీని అందజేస్తారు.
ఫైనల్ పోరు కోసం అడిడాస్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ‘ట్రియోండా ఫైనల్’ బంతిని ఉపయోగిస్తారు. బంగారం, నలుపు, తెలుపు రంగుల కలయికతో ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించిన ఈ బంతి, ఈ టోర్నీ జరిగిన 16 ఆతిథ్య నగరాల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి బార్సిలోనాకు చెందిన ‘లా మాసియా’ అకాడమీ పుత్రులైన లియోనెల్ మెస్సీ, యువ సంచలనం లామిన్ యమాల్పైనే ఉంది. ఒకప్పుడు మెస్సీ బార్సిలోనాలో ఆడుతున్న రోజుల్లో పసిపాపగా ఉన్న యమాల్‌ను స్నానం చేయిస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పుడు అదే యమాల్ తన ఆరాధ్య దైవమైన మెస్సీని వరల్డ్ కప్ ఫైనల్లో ఢీకొంటున్నాడు. మరోవైపు అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని.. ప్రస్తుత స్పెయిన్ కోచ్ లూయిస్ డి లా ఫ్యూయెంటె దగ్గరే విద్యార్థిగా శిక్షణ పొందాడు. ఇప్పుడు ఆ గురువు, శిష్యుడే ప్రపంచకప్ ట్రోఫీ కోసం వ్యూహాలు ప్రతివ్యూహాలతో తలపడనున్నారు.
ఫైనల్ మ్యాచ్‌ను న్యూజెర్సీవాతావరణం, మెట్‌లైఫ్ స్టేడియం పిచ్ పరిస్థితులు కూడా శాసించే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్ నాణ్యత బంతిని ఆధీనంలో ఉంచుకుని ఆడే స్పెయిన్ శైలికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇది అర్జెంటీనాకు కలిసిరావచ్చు. ఆదివారం 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన వేడి, ఉక్కపోత ఉండనుంది. కెనడా అడవుల మంటల వల్ల ఏర్పడిన ప్రమాదకరమైన పొగ ఈ ప్రాంతాన్ని కమ్మేయడం 80 వేల మందికి పైగా వచ్చే అభిమానులతో పాటు ఆటగాళ్లలోనూ ఆందోళన కలిగిస్తోంది. .