తెలంగాణలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా అతిపెద్దది. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర.. ఇంకోవైపు భీమా.. దుందుబీ నదులు. అపారమైన నీటి వనరులు. మరోవైపు రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన ఎర్ర, నల్లరేగడి నేలలు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 1935 నుంచే హైదరాబాద్ స్టేట్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నికరంగా 174 టీఎంసీలను ఒడిసిపట్టి, కేవలం భూమ్యాకర్షణ శక్తితోనే (గ్రావిటీ) ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒప్పందాలను చేసుకున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం కడుతున్న సమయంలోనే విలీనం పేరిట ఊహించని వంచనకు గురైంది. అది తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరుకు శాపంలా మారింది. అప్పటివరకు కృష్ణాలో కేవలం 8 శాతంగా ఉన్న కర్ణాటక పరీవాహక ప్రాంతం హైదరాబాద్ స్టేట్‌లోని అనేక ప్రాంతాలు (ఇప్పటి రాయచూర్, బీదర్, యాద్గిర్, కొప్పల్, గుల్బర్గా తదితర ప్రాంతాలు) కలవడంతో ఏకంగా 44 శాతానికి పెరిగింది. తెలంగాణకు ఆ మేరకు పరీవాహక ప్రాంతం తగ్గి బచావత్ కేటాయింపుల్లోనూ మొదట అన్యాయానికి గురైంది. హైదరాబాద్ స్టేట్ ప్రణాళికలన్నీ అటకెక్కాయి. కనీసం కాగితాలపైనా లేకుండా కనుమరుగయ్యాయి.
మరోవైపు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విలీనం నాటి బాసలన్నీ నీటిమూటలయ్యాయి. సీమాం ధ్ర ఏలికల జలకుట్రలతో, స్థానిక కాంగ్రెస్ నేతల అవగాహనారాహిత్యం.. మౌనంతో వివక్షకు గురై ఉన్న పరీవాహకం మేరకు కూడా కేటాయింపులు లేక పాలమూరు అల్లాడిపోయింది. జూరాలను అంతర్రాష్ట్ర చిక్కుల్లోకి నెట్టి గాలికొదిలేశారు. ప్రతిపాదిత రాజీవ్ భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను ఏండ్ల తరబడి ఫైళ్లలో మగ్గబెట్టారు. నిధుల కొరత, భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే రోడ్డు క్రాసింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులు వంటి అనేక సమస్యల్లో కూరుకునేలా చేసి, వాటిని సకాలంలో పరిష్కరించకుండా తెలంగాణ ప్రాజెక్టులను పండపెట్టారు. మరోవైపు ఏపీ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. కృష్ణమ్మ ఒడ్డునున్న మా బిడ్డల నోళ్లు బిగియగట్టి, 700 కిలోమీటర్ల దూరంలోని చెన్నైవాసుల దాహార్తి తీర్చే ముసుగులో పోతిరెడ్డిపాడు పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు పొక్కకొట్టారు.
దౌర్జన్యంగా పోతిరెడ్డిపాడును విస్తరించుకుంటూ పోయారు. కృష్ణా జలాల దోపిడీకి తెరతీశారు. ఆర్డీఎస్ను బద్దలుకొట్టి తుంగభద్ర జలాలను తన్నుకుపోయారు. పెన్నా బేసిన్లో భారీ రిజర్వాయర్లను నిర్మించుకున్నారు. వందల టీఎంసీల నీటినిల్వలను పెంచుకున్నారు. ఉమ్మడి పాలకుల వివక్షకు ఇవే తార్కాణాలు, సజీవ సాక్ష్యాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా జలాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా కనీసం 20 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని దుస్థితి. సాగునీరు కాదు గుక్కెడు తాగునీళ్లకు తండ్లాడాల్సిన దుర్భర పరిస్థితి. ఫలితంగానే పాలమూరు వలసకాటు బారినపడింది. పుట్టిన గడ్డకు.. అవ్వయ్యలకు.. ఆలు బిడ్డలకు.. అన్నదమ్ములకు.. అయినోళ్లకు దూరమై పరాయిపంచన మనుగడ సాగించే దౌర్భాగ్యానికి చేరుకున్నది. జీవన విధ్వంసానికి గురైంది. తరాలకు తరాలే ఉనికిని కోల్పోయింది. ఉమ్మడి పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నా.. ప్రపంచ బ్యాంకు రుణాలు, కేంద్రం గ్రాంట్లు కూడా పాలమూరులో గంజి కేంద్రాలను కనుమరుగు చేయలేదు. కంటనీరు ఆగలేదు.
పాలమూరు గోస చూసి గొడగొడమని ఏడ్చింది కేసీఆర్. ఉమ్మడి పాలకుల దుర్నీతిని.. కపటనీతిని నిలదీసింది కేసీఆర్. నీళ్ల దోపిడీపై గళం విప్పింది.. కదం కదిపింది.. కవనం సాగించింది కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు గోసను ఓ రణ నినాదం చేసింది కేసీఆర్. నవజీవన ఆశలను కల్పించింది, వలస బతుకులకు భరోసా ఇచ్చింది కేసీఆర్.. గులాబీ జెండానే. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరు జీవితాల్లో మార్పు తెచ్చిందీ కేసీఆరే. అటకెక్కిన ప్రాజెక్టుల దుమ్ము దులిపారు. నిధుల వరద పారించి.. చిక్కుముళ్లను విప్పి.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. చెరువులను పునరుద్ధరించి, చెక్‌డ్యామ్‌లను నిర్మించి, ప్రాజెక్టుల కాల్వలతో అనుసంధానించి నెర్రెలిడ్సిన పాలమూరుపై జలధారలను పారించారు.
నీటినిల్వ సామర్థ్యాలను, నీటివినియోగ అవకాశాలను మెరుగుపరిచి తాగు, సాగునీటికి భరోసా కల్పించారు. కల్లలైన కలలకు జీవం పోశారు. తరాల వలసరాతలను చెరిపేశారు. అందుకే పాలమూరు దశ, దిశను మార్చింది.. ప్రగతి ప్రదాతగా నిలిచింది కేసీఆర్ ఒక్కరే. ఇది సత్యం. పాలమూరు బిడ్డల స్వానుభవం.
ఇప్పుడు మిగిలింది పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక్కటే. పాలమూరుకు శాశ్వత తాగు, సాగునీటి కేంద్రం అది. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు స్వరూపమే మారిపోతుంది. పచ్చని మాగాణమై తీరుతుంది. ఇది తథ్యం. ఆ ఆశయంతోనే కేసీఆర్ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టును అడ్డుకునే పొరుగు రాష్ర్టాల, అంతర్గత శత్రువుల కుటిల పన్నాగాలను తిప్పికొడుతూ పనులను ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించారు. ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పంప్‌హౌజ్‌లు, సర్జ్‌పూల్‌లు, విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్ల నిర్మాణాలు, పంపుల బిగింపులు, ప్రధాన నీటిసరఫరా కాలువలు, రిజర్వాయర్ల తవ్వకాలు పూర్తిచేశారు. శ్రీశైలం నుంచి కృష్ణమ్మను ఎదురెక్కించి చూపారు. ప్రస్తుతం చేపట్టాల్సింది సాగునీటి కాల్వల తవ్వకం పనులే. అందుకు గత కేసీఆర్ ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక మళ్లీ ‘పాలమూరు’పై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ సర్కారు ఆ కాల్వల టెండర్లను రద్దు చేసింది. ప్రాజెక్టు పనులు పూర్తిచేయకుండా పొరుగు రాష్ట్రం జలదోపిడీకి వంతపాడుతున్నది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టును 45 టీఎంసీలకే పరిమితం చేసేందుకు సిద్ధమైంది. ఇది తెలంగాణకు, ‘పాలమూరు’ ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం.. తీరని విద్రోహం.
కాంగ్రెస్ సర్కారు తీరుపై పాలమూరు సమాజం అప్రమత్తం కావాలి. లేదంటే కృష్ణమ్మ మళ్లీ దక్కకుండా పోవడం ఖాయం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను పాలమూరు బిడ్డలు ఎండగట్టాలె. పొరుగు రాష్ట్ర కుట్రలకు కొమ్ముకాస్తూ, పాలమూరు హక్కులను పణంగా పెట్టడాన్ని ప్రశ్నించాలె. నీటివాటా కుదింపును నీలదీయాలె. ఎక్కడికక్కడ అడ్డుకోవాలె. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేలా సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలె. మన బిడ్డల భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలె. ఇది తక్షణావసరం. పాలమూరు పక్షాన గళం విప్పుతున్న బీఆర్ఎస్ వెంట నడవాలె. పాలమూరు ప్రగతి ప్రదాత కేసీఆర్ పోరుకు బాసటగా నిలవాలె. గులాబీ జెండాను ఎత్తిపట్టి భుజం భుజం కలిసి నడవాలె. కాంగ్రెస్ సర్కారు తక్షణం నీటివాటా కుదింపు అనాలోచిత ప్రతిపాదనలను విరమించుకోవాలి. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తిచేయాలి. లేదంటే మళ్లీ గుణపాఠం చెప్పక తప్పదు. అది తథ్యం. ఇది పాలమూరు బిడ్డల శపథం.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త,బాపనపల్లి సర్పంచ్)
-గవినోళ్ల శ్రీనివాస్
94412 72503