కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అలుపెరగని పద్నాలుగేండ్ల పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది. అరువై ఏండ్ల వలస పాలనలో అన్నిరకాల వివక్షకు గురై, వెనుకబడిన తెలంగాణను అనతికాలంలోనే ప్రగతిపథంలో నడిపించిన మహనీయుడు కేసీఆర్. జాతీయ పార్టీల కుట్రల నుంచి కాపాడటమే కాకుండా తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను అమలుచేసి రాష్ర్టాన్ని పునర్నిర్మాణం చేశారు. కేసీఆర్ అకుంఠిత దీక్షతో తెలంగాణ అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో దూసుకుపోయింది. అలాంటి తెలంగాణ నేడు మళ్లీ ఆగమవుతున్నది.
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కేసీఆర్ హయాంలోనే విశ్వనగరంగా అవతరించింది. మౌలిక వసతులు, శాంతిభద్రతల పరంగా ఎంతగానో పురోగమించింది. అంతేకాదు, అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యకు చెక్‌పెట్టారు. తత్ఫలితంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. స్వయంగా రైతు అయిన కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేశారు. ఏటా ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.10,000 అందించి తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఈ పథకాన్ని ఐరాస సైతం కొనియాడింది. అకాల మరణం చెంది న రైతుల కుటుంబసభ్యులు రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన రైతుబీమా పథకం విప్లవాత్మకమైంది. ఈ పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించారు. పేదోళ్ల బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదువులు చదివి, ప్రపంచంతో పోటీపడాలనే ఉద్దేశంతో అనేక గురుకులాలను స్థాపించారు. రాష్ట్రంలోని గురుకులాలను వెయ్యికి పెంచి, ఏటా లక్షలమంది విద్యార్థులకు అధునాతన సౌకర్యాలతో కూడిన నాణ్యమైన ఉచిత విద్యనందించారు.
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేవిధ ంగా పాలన వికేంద్రీకరణ చేసి జిల్లాలు, మండలాలు, పంచాయతీల సంఖ్యను పెంచారు. ప్రతి జిల్లాలో కలెక్టరేట్ల నిర్మాణం, మండల,గ్రామ పంచాయతీల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగును బాగు చేశారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రగతిపథంలో పరుగులు పెట్టించారు. అంతేకాదు, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కాయి. కానీ, వీటన్నింటిని ప్రచారం చేసుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైం ది. అదే సమయంలో నాటి ప్రతిపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేశాయి. వెరసి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడంతో అదే నిజమని ప్రజలు భ్రమపడి కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. కానీ, నమ్మి ఓట్లేసిన ప్రజలను హస్తం పార్టీ ప్రభుత్వం నట్టేట్లో ముంచింది. 9 నెలల కాలంలోనే రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజల్లో అసహనం మొదలైంది.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వైపు కన్నెత్తి చూడని ఆంధ్రా పెత్తందార్లు నేడు మళ్లీ రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉవ్విళ్లూతున్నారు. పదవుల పంపకంలో మళ్లీ ఆంధ్రోళ్ల ఆధిపత్యం మొదలైంది. తెలంగాణ బిడ్డల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆంధ్రాపెత్తందార్లకు వంతపాడుతున్నది. ‘మాకు తెలంగాణవాళ్లు వద్దు, ఆంధ్రావాళ్లే ముద్దు’ అనే ఎజెండాతో రేవంత్ సర్కార్ ముందుకుపోతున్నది. తెలంగాణవారికి న్యాయంగా దక్కాల్సిన పదవులను ఆంధ్రోళ్లకు కట్టబెడుతున్నది. ఆంధ్రాకు చెందిన సి.ఆంజనేయరెడ్డిని బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్‌గా, అనంతపురం జిల్లాకు చెందిన అనితా వావిళ్లకు తెలంగాణ రెడ్కో వైస్ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నీటి పారుదల జలవనరుల సలహాదారులుగా నియమించడం అందులో భాగమే.
అదేవిధంగా ఏపీకి చెందిన రఘునాథ్ రెడ్డికి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలోకి తీసుకోవడం, సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను తెలంగాణ శాసనమండలి సలహాదారుడిగా, శ్రీనివాస్‌రాజును తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా, ఆంధ్రాకు చెందిన జర్నలిస్టు శ్రీరామ్ కర్రికి తెలంగాణ మీడియా అండ్ కమ్యూనికేషన్ పదవి కట్టబెట్టడం కూడా ఈ కోవకు చెందినవే. ఈ నియామకాల వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. వీళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమివ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి రాష్ర్టానికి చాలా ప్రమాదకరం. దీనిపై పౌర సమాజం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-రాజేశ్ నాయక్
96035 79115