పద్నాలుగేండ్ల ఉద్యమంతో ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష అయినతెలంగాణను సాధించిన యోధుడు కేసీఆర్. తండ్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్ల పాలనతో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన దార్శనికుడాయన. కేంద్రం సహకారం లేకున్నా, అప్పటి విపక్షాలు విషప్రచారం చేసినా, కేసులతో అడ్డుకోవాలని చూసినా వెనకడుగు వేయకుండా అభివృద్ధి చేసిన పాలకుడు కేసీఆర్.
అబద్ధాల ప్రచారమో, అరచేతిలో వైకుంఠం చూపించిన హామీల ఫలితమో కానీ, హస్తం పార్టీని నమ్మి ప్రజలు ఏమరుపాటుగా ఓట్లేయడంతో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. మోసం చేయడం తన డీఎన్ఏలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కిన వెంటనే హామీలకు మంగళం పాడేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం పీఠాన్ని దక్కించుకున్న రేవంత్‌రెడ్డి దాన్ని నిలబెట్టుకునేందుకు తన గురువు చంద్రబాబు అండతో ప్రధాని మోదీ పరివారం ముందు మోకరిల్లారు. అదానీకి కాంట్రాక్టులు ఇస్తూ బీజేపీ అడుగులకు మడుగులొత్తుతు న్నారు. రేవంత్‌కు సీఎం పదవి ఇచ్చి పెద్ద తప్పు చేశామని కాంగ్రెస్ అధిష్ఠానం చివరికి తెలుసుకున్నా.. ప్రస్తుతం ఆయనను ఆ పదవిలో ఉంచలేని, దించలేని పరిస్థితి.
తెలంగాణలో కాంగ్రెస్ సీఎంగా ఉంటూ తనే నిస్సిగ్గుగా చెప్పుకొన్నట్టు చంద్రబాబు శిష్యుడి రూపంలో తమ స్కూల్ విద్యార్థి కమలం పార్టీకి దొరికారు. అందుకే కాళేశ్వరం మరమ్మతులు ఆగిపోయాయి. ఏదులలో పంప్‌హౌజ్‌లు పూర్తయి, నార్లాపూర్, వట్టెంలలో డ్రై, వెట్ రన్లు కూడా పూర్తయి, 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు నిలిచిపో యాయి. కృష్ణా, గోదావరిల మీద ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరెత్తడం లేదు. కాళేశ్వరం మీద కక్షగట్టి కేంద్రప్రభుత్వ సంస్థతో నివేదికలు ఇచ్చి నిందలు వేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ కూలి ఎనిమిది మంది మరణించినా, సుంకేసుల రిటైనింగ్ వాల్ కూలినా, వట్టెం పంప్‌హౌజ్ నీట మునిగినా దర్యాప్తు చేయట్లేదు, కమిషన్ వేయట్లేదు.
అటవీ చట్టాలను ఉల్లంఘించి హెచ్‌సీయూలో వన్యప్రాణులకు ఆవాసం లేకుండా చేసినా, మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లు తోలినా, లగచర్ల రైతుల మీద పగబట్టి జైలుకు పంపినా, ఇథనాల్ కంపెనీ పేరిట నడిగడ్డ రైతులపై దండెత్తినా కేంద్రం స్పందించడం లేదు. కక్షసాధింపు రాజకీయాలతో ముందుకుసాగుతున్న రేవంత్‌కు కుటుంబ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం అసలే పట్టవు. ఇక తెలంగాణ కన్నా ఏపీకి కేంద్రం పది రెట్లు అధికంగా నిధులు ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకోవడం శోచనీయం.
‘జై తెలంగాణ’ అని నినదించలేని వ్యక్తి ఈ రాష్ట్ర పాలకుడిగా ఉండటం, పాఠశాల పుస్తకాల నుంచి ఉద్యమ పాఠాలను తొలగించడం తెలంగాణ కోరి తెచ్చుకున్న దౌర్భాగ్యం. కేసీఆర్ పాలన మీద విషప్రచారం చేసి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పదవులు సంపాదించి కలుగుల్లో దాక్కున్న కుహనా మేధావుల గురించి, రేవంత్ నజరానాలకు ఆశపడి పెదవులు మూసుకున్న వాళ్ల గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పాత చింతకాయ పచ్చడి ఆరోపణలతో ప్రజల దృష్టిని రాష్ట్ర పాలకులు మళ్లిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పక్కనపెట్టారు. హామీలను అటకెక్కించారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొన్నాళ్లు ఉండి దిగిపోతాయి. కానీ, తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు ఒక్కసారి చేజారాక తిరిగి సాధించడం కష్టం. అందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్, బీజేపీ కుట్రలను గుర్తించి ప్రశ్నించాలి. తెలంగాణకు ఎవరి వల్ల మేలు జరుగుతుందో గుర్తెరిగి, వారికి అండగా నిలవాలి. ప్రాంతాన్ని ప్రేమించలేనివాడు జాతిని, జాతీయవాదాన్ని ప్రేమించలేడు. ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని బలహీనపరిచి జాతీయవాదం పేరుతో దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న శక్తుల పట్ల మనందరం అప్రమత్తంగా ఉండాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
శ్రీధర్ ప్రసాద్
95054 05950