సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో తెలంగాణది తిండికి కూడా తన్లాడే పరిస్థితి. శోకమే తప్ప, సంతోషం ఎరుగని జీవితాలు. కూడుకు కూడా నోచుకోని కటిక దరిద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పాలకులు వచ్చారు, పోయారే తప్ప తెలంగాణ బిడ్డల స్థితిని మార్చలేదు. బతుకులు భారమై, జీవచ్ఛవంలా మారి జీవి విడవడం తప్ప మరో దిక్కులేని పరిస్థితి. రెక్కాడినా డొక్కాడని బతుకులు. కష్టం చేసేందుకు ఒంట్లో సత్తువ ఉన్నా.. దున్నెందుకు భూములే లేని పరిస్థితి. ఉన్నంతలో ఎవుసం చేద్దామంటే నీళ్లు ఉండవు. చెమట చుక్కే పెట్టుబడి.. అప్పులు, ఆర్తనాదాలే రాబడి. చెట్టుకొకరు, పుట్టకొకరు లెక్కన వలస పక్షుల్లాంటి బతుకులు తెలంగాణ బిడ్డలవి. ఆకలిచావులు, ఆత్మహత్యలతో చరిత్రగర్భంలో తెలంగాణ కలిసిపోయే దిశగా సాగుతున్న సమయంలో తెలంగాణ గాథల్లో నుంచి, ప్రజల బాధల్లో నుంచి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పురుడుపోసుకుంది.
తెలంగాణ ప్రజల దుస్థితిని చూసి చలించిపోయిన కేసీఆర్.. మన బతుకులు మార్చేందుకు ఉద్యమ జెండా ఎత్తుకున్నారు. ఒకవైపు ప్రజా ఉద్యమాలు.. మరోవైపు రాజకీయ ఉద్యమం చేశారు. రాజీనామాలే అస్త్రంగా, ఉప ఎన్నికలే శస్త్రంగా చేసుకొని ముందుకుసాగారు. తెలంగాణ వద్దన్న వాళ్లతోనే ‘జై తెలంగాణ’ అనిపించారు. మిలియన్ మార్చ్, సాగరహారంతో తెలంగాణ కాంక్షను ఢిల్లీకి తెలిసేలా చేశారు. సకలజనుల సమ్మెతో తెలంగాణ బిడ్డల సెగ ఢిల్లీ పాలకులకు తగిలేలా చేశారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఎక్కని మెట్టు.. తొక్కని కడప లేదన్నట్టు… జాతీయ పార్టీలన్నింటినీ ఏకం చేశారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారు.
చాలా మంది తమ లక్ష్యాన్ని ముద్దాడాక రిలాక్స్ అయిపోతారు. ఏం చేయాలో తెలియక చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోతారు. కానీ, కేసీఆర్ అలా కాదు. తెలంగాణ సిద్ధించక ముందే, మలి దశ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే తెలంగాణ వస్తే పరిశ్రమలు తరలిపోతాయన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పెద్దపెద్ద టెక్ కంపెనీల సీఈవోలతో సమావేశమై తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విద్య, వైద్యం తదితర ముఖ్యమైన రంగాల్లో ఏ విధంగా ముందుకువెళ్లాలనే విషయమై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగం కాకూడదని తన ఆలోచనలకు ఆచరణరూపం ఇవ్వాలని ఉద్యమకారుడే పాలకుడి అవతారమెత్తారు. ఎన్నో పథకాలు, పనులు చేసి, స్వరాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి పరిగెత్తించి, తెలంగాణ బిడ్డలు పాలితులే కాదు, పాలకులు కూడా అని చాటిచెప్పారు. తెలంగాణ అగమైపోతదని నవ్వినోళ్ల నోళ్లు మూయించారు.
పరాయి పాలనలో ఆగమై, కాటికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణను అనతికాలంలోనే అభివృద్ధికి నిలయంగా మార్చారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మారుమూల ప్రాంతాల్లోని తండాలు, గూడేలోని గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వచ్చాయి. కంపచెట్ల స్థానంలో హరితహారం మొక్కలు మొలిచాయి. బడులు, గుడులు, గోపురాలు, పల్లెప్రగతి వనం లాంటి అనేక సౌకర్యాలు కేసిఆర్ కల్పించారు. ఆఖరి మజిలీ కోసం వైకుంఠధామాలు నిర్మించారు. మిషన్ భగీరథతో తెలంగాణ ఆడబిడ్డలకు నెత్తిన బిందెను మోసే భారం లేకుండా చేశారు.
ఆగమైన వ్యవసాయాన్ని గాడిన పెట్టేందుకు కేసీఆర్ అనేక వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టారు. దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని నిజం చేస్తూ పోడు పట్టాలు పంచిపెట్టారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి నీళ్ల వసతి కల్పించారు. 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేశారు. రైతుబంధుతో పెట్టుబడి కష్టాలు తీర్చారు. దాంతో ఒకనాడు ఆకలితో అలమటించిన తెలంగాణలో పుట్లకు పుట్లు వడ్లు పండింది. ఆకలిచావులు లేని, ఆత్మహత్యలు లేని తెలంగాణ సాకారం అయింది.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అంగన్వాడీలో పౌష్టికాహారం అందించడంతో గర్భిణులు, తల్లీబిడ్డల చావులు తగ్గాయి. పాలు లేక కల్లు తాగించే దుస్థితి లంబాడా తల్లులకు తప్పింది. గురుకులాలను 1000కి పెంచడంతో తెలంగాణ బిడ్డలు బడిబాట పట్టారు. టీఎస్ ఐపాస్ లాంటి విధానాలతో రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. సాగు భూమి 131 లక్షల ఎకరాల నుంచి 268 లక్షల ఎకరాలకు పెరిగింది. సమైక్య పాలకుల ఏలుబడిలో 68 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 2023 నాటికి అది 3.5 కోట్ల టన్నులకు పెరిగింది. తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014లో 7,778 మెగావాట్లుగా ఉంటే ఇప్పుడు అది 18,567 మెగావాట్లకు ఎగబాకింది. సమైక్య పాలనలో ఆరేడు దశాబ్దాల్లో కేవలం 41 రిజర్వాయర్లు కడితే.. పదేండ్లలో వాటి సంఖ్య 157కు పెరిగింది. దాంతో తెలంగాణవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టారు.
చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద, గొర్రె పిల్లల పంపిణీతో పశుసంపద పెరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ అమలు చేసిన పథకాలు కోకొల్లలు. కానీ, మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ మాయలో పడ్డ తెలంగాణ ప్రజలు ఇప్పుడు అరిగోస పడుతున్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక ఒక ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది. అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయి ప్రజలు ఆగమవుతున్నారు. తెలంగాణ బిడ్డలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. మూసీ, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు రియల్ మాఫియా కోసం మూగజీవాల గూళ్లు కూల్చుతున్నది. నీళ్లు లేక గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయి. తాగునీళ్లు లేక తెలంగాణ గొంతెండుతున్నది.
సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవాలు జరుపుకొంటున్న వేళ తెలంగాణలో ఉన్నాయి. అప్పట్లో తెలంగాణ సాధన కోసం ప్రజలు టీఆర్ఎస్ వెంట నడిచినట్టే.. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం మరో పోరు సలిపేందుకు బీఆర్ఎస్ వెంట నిలబడ్డారు. కాంగ్రెస్‌ను కాలదన్ని, మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని తలుచుకుంటున్నారు. కేసీఆరే మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఏ సమస్య ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తలుపు తడుతున్నారు. తెలంగాణ భవన్ గడప తొక్కుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారాన్ని తెలంగాణ భవన్ వేదికగా వెతుక్కుంటున్నారు. ఇది కదా అసలైన విజయం.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
వై.సతీష్‌రెడ్డి 96414 66666