భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఇరువై మూడేండ్లు. ఇరువై మూడేండ్ల కిందటి తెలంగాణ ఓ వెనుకబాటుతనానికి నిదర్శనం. ‘తెలంగాణ’ పదం మాట్లాడటమే కష్టం. ఆ పదాన్ని దాదాపు నిషేధిత జాబితాలో చేర్చిన సందర్భం. అలాంటి తెలంగాణ ఈ ఇరువై మూడేండ్లలో ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. కండ్లముందు కనిపిస్తున్న సంస్కరణ తెలంగాణనే దీనికి నిదర్శనం. ఈ అద్భుత మూలం.
తెలంగాణ రాష్ట్ర సమితి సృష్టికర్త కేసీఆర్. ‘కేసీఆర్’ వేరు, ‘తెలంగాణ’ వేరు అనడానికి వీల్లేని విధంగా కేసీఆర్ ‘తెలంగాణ’ను పునర్నిర్మించారు. కేసీఆర్ అంటే తెలంగాణకు పర్యాయపదంగా ప్రజల్లో స్థిరపడింది. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నా ప్రజాదరణలో కించిత్ కూడా తేడా లేదు. పైగా ఇతర రాష్ట్రాల ప్రజల్లో ఆమోదం, ఆదరణ పెరిగింది. తెలంగాణ ఉద్యమం పద్నాలుగేండ్ల పాటు జరిగిన కాలం ఒక దశగా, ఆ తర్వాత తొమ్మిదేండ్ల పాటు జరుగుతున్న పరిపాలన మరో దశగా చెప్పవచ్చు. ఈ రెండు దశల్లో చూసుకున్నట్లయితే తెలంగాణను పలు రకాలుగా చూడవచ్చు.
2001లో కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమరూపం దాల్చుకున్న సమయం నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకు తెలంగాణలో కేసీఆర్ మాట, ఉద్యమ నినాదాలేవైనా అప్పటి ఉమ్మడి ప్రభుత్వాలకు ఒక ఆదేశంగా, ఒక సూచనగా పనిచేశాయి. అలా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల గొంతుకను అప్పటి ప్రభుత్వాలు తన మాటతో నిర్ణయాలను మార్చే శక్తి కేసీఆర్ సంపాదించుకున్నారు. ఆ పద్నాలుగేండ్లు కేసీఆర్ పేరు లేకుండా, కేసీఆర్ మాట లేకుండా ఒక్కరోజు కూడా తెలంగాణలో లేదు. అటు ప్రభుత్వంలో కానీ, రాజకీయ పార్టీలో కానీ, వ్యాపార వర్గాల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, మీడియాలో కానీ… పద్నాలుగేండ్ల పోరాటం, ఉద్యమంతో కేసీఆర్ పేరు నిత్యం ప్రజల్లో నానింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పాటుకావడం.. ప్రభుత్వం ఏర్పడటంతో తన పంథా మార్చి తెలంగాణ అభివృద్ధి వైపు అడుగులు వేసేవిధంగా కేసీఆర్ పాలన సాగించారు. ఆ పరిపాలనతో వచ్చిన గుర్తింపు.. ప్రజల్లో వచ్చిన మార్పుతో తెలంగాణ దేశం ముందు ఆర్థికశక్తిగా నిలబడింది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. ఆయన చేసి న సంస్కరణలను పక్క రాష్ర్టాలు, కేంద్రం ఆచరణలో పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
10 జిల్లాలుగా ఉన్న తెలంగా ణ 33 జిల్లాల తెలంగాణగా రూపాంతరం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పెంచింది. 12,769 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఇప్పుడున్నాయి. మండలాల సం ఖ్య 612. మెడికల్ కళాశాలలు జిల్లాకు ఒకటి తయారైంది. రెవె న్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్లు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో సంస్కరణలను తీసుకువచ్చింది. విద్యుత్తురంగంలో చేసిన మార్పులు, సంస్కరణలు పూర్తిగా తెలంగాణ విద్యుత్ వ్యవస్థనే మార్చివేశాయి. 24 గంటల పాటు కరెంటు తెలంగాణ ప్రజలకు సరఫరా అవుతున్నది. ఈ సంస్కరణ తీసుకురావటం అంత చిన్న విషయం కాదు. తెలంగాణనే ఇప్పుడు ఒక సంస్కరణగా మార్చి దేశానికి మార్గదర్శకం చేశారు కేసీఆర్. ‘కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్’ అనేవిధంగా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. ఇరువై మూడేండ్ల చరిత్రలో ఒక్కో దశలో ఒక్కో ఉద్యమం. పరిపాలనతో కేసీఆర్ ప్రజల హృదయాల్లో నాటుకుపోయారు. బీఆర్ఎస్తో విస్తరించే కార్యక్రమం మరో దశ 23వ సంవత్సరం నుంచి మొదలైంది. తెలంగాణను చూసి ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్యను పెంచుకున్నది. ఈ సంస్కరణలు ఇంత అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎందుకు చేయలేకపోయారని ప్రతి ఒక్కరి మెదడులో ప్రశ్న ఉత్పన్నమయ్యేలా కేసీఆర్ పాలన సాగింది.
తెలంగాణలో సాధించిన విజయాలు కొందరికి తక్కువగా కనిపిస్తుండవచ్చు. కొందరు గుర్తించకపోవచ్చు. రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయాల కోసం ఆ గుర్తింపును కావాలని కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు. ప్రజలు నీళ్ల కోసం, కరెంటు కోసం ఎన్నోరకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎంత సులభమైన వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో ప్రజలు అనుభవంలో చూస్తున్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణను.. భవిష్యత్తులో మరింత అభివృద్ధి వైపు దూసుకువెళ్లాలనే లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి, సంస్కరణలతో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
నర్రా విజయ్‌కుమార్
90521 16316