తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో ఉద్యమ అగ్గి రగిల్చిన నవంబర్ 29వ తేదీ నాడే కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం, రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికవడం చకచకా జరిగిపోయాయి. ఆయన హయాంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. నేడు తెలంగాణ సొమ్ముతో దేశాన్నే సాకే పరిస్థితి వచ్చిందంటే దానికి కేసీఆర్ పాలనే ప్రధాన కారణం. అయితే, తెలంగాణకు ‘దీక్షా దివస్’ ఓ గేమ్‌చేంజర్‌గా చరిత్రలో నిలిచిపోయింది.
పరాయి పాలకుల కబంధ హస్తాల మధ్య తెలంగాణ సమాజం నలిగిపోతున్న కాలమది. తెలంగాణ ఉద్యమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తున్న సందర్భం. మీడియా, పోలీస్, రాజకీయ తదితర వ్యవస్థలన్నీ వారి చేతిలో బందీ అయి తెలంగాణ ప్రజలను గోసపెట్టిన రోజులవి. నాడు సమైక్యవాదుల వాదనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. ఆ సమయంలో మీడియా ప్రతినిధిగా ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలను నేను చూసేవాడిని. కేసీఆర్ దీక్ష నా లాంటి ఎంతోమందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. సీఎంను నిలదీసే శక్తి కూడా ఆ స్ఫూర్తి నుంచే ఉద్భవించింది. నాటి సీఎం రోశయ్య మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ దీక్షను విమర్శించారు. ఆ సమావేశంలో నేను రోశయ్యను గట్టిగా ప్రశ్నించాను. దానికి కేసీఆరే స్ఫూర్తి. నాకే కాదు, ప్రతి తెలంగాణ పౌరుడికి ప్రశ్నించే శక్తినిచ్చింది కేసీఆర్ దీక్షే. ఆ స్ఫూర్తితోనే ఉద్యమం దావానలంలా అంటుకున్నది. రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా ప్రజలు కేసీఆర్ వెంట నడిచారు. స్వరాష్ర్టాన్ని సాధించుకున్నారు.
కేసీఆర్ సీఎం అయ్యేనాటికి తెలంగాణ ఆర్థిక, వ్యవసాయ, విద్యుత్, తాగు, సాగునీటిరంగాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లోనే తెలంగాణలో రాజకీయ అస్థిరతను సృష్టించటానికి చంద్రబాబు కుట్రలు చేశారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపెట్టడాకి ఆయన, రేవంత్‌రెడ్డి లాంటి సమైక్యవాద ఉన్మాదశక్తులు చేసిన కుట్రలెన్నో. దీనికితోడు తెలంగాణ వచ్చిన కొత్తలోనే ఉమ్మడి వారసత్వంగా వచ్చిన విద్యుత్తు కోతలు తెలంగాణను చిన్నాభిన్నం చేశాయి. దీంతో ‘ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?, ప్రభుత్వం విఫలమైంద’ని పచ్చ మీడియా విష ప్రచారం చేసింది. పసిగుడ్డు తెలంగాణపై ఇలాంటి విష ప్రచారాలు తొమ్మిదేండ్లూ కొనసాగాయి. వాటన్నింటిని తట్టుకొని కేసీఆర్ నిలబడ్డారు, తెలంగాణనూ నిలబెట్టారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెట్టించారు. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, సాగు, తాగునీరు అందించి తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా నిలిపారు. అయితే, 2023 ఎన్నికల్లో మార్పు పేరిట తెలంగాణ పాలనా పగ్గాలను కాంగ్రెస్ అందుకున్నది.
అంతేకాదు, తెలంగాణను అవిచ్ఛిన్నం చేయడానికి బాబుతో కుయుక్తులు పన్నిన రేవంత్‌నే ఆ పార్టీ సీఎంను చేసింది. అభివృద్ధి చెందిన రాష్ర్టాలతో పోటీ పడుతున్న తెలంగాణపై పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగినట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. పాలనలో కర్కశత్వం ప్రదర్శిస్తూ ప్రజలను గోస పెడుతున్నారు. ఏడాదంతా తిట్లు, బూతులు, కూల్చివేతలు, కేసులు, దాడులు, నిర్బంధాలు, కక్షలు, మళ్లింపు రాజకీయాల కేంద్రంగా పాలన సాగిస్తున్నారే తప్ప, అభివృద్ధిలో మాత్రం అడుగుముందుకు పడటం లేదు. అందుకే, ఏడాదిలోనే తెలంగాణ ఆర్థి కవ్యవస్థ కుప్పకూలింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. హైడ్రా కారణంగా రియ ల్ ఎస్టేట్ పతనమైంది. రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడ్డ ది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను అమలుచేయాలంటూ ప్రజల నుంచి నిరసనలు పెరిగిపోయాయి. ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక రాష్ట్రంలో పోలీస్ పాలనను కొనసాగిస్తున్నారు.
ప్రశ్నిస్తే నిర్బంధాలు, దాడు లు, కేసులు, వేధింపులు. రేవంత్ సొంతూ రు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడులు, తాజాగా రేవంత్ సోదరుల వేధింపులతో ఆ ఊరి మాజీ సర్పంచ్ ఆత్మహత్య, లగచర్ల ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసులు మఫ్టీలో అరెస్టు చేసిన విధానం.. ఇవన్నీ చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులు తలపించాయి. లగచర్ల లో గిరిజన మహిళలపై పోలీసులు చేసిన దాడులు జుగుప్సాకరంగా ఉన్నాయి. కొణ తం దిలీప్‌ను వేధించిన పరిస్థితులు క్రూరం గా ఉన్నాయి. ఇవన్నీ గమనించిన కోర్టు ఆయనను రిమాండ్‌కు పంపించేందుకు అనుమతించలేదు.
ఇదిలా ఉంటే టీవీ చర్చ ల సందర్భంలో కాంగ్రెస్ నేతలను గట్టిగా నిలదీస్తే లైవ్‌లోనే కేసులు పెడతామని హెచ్చరిస్తుండటం నియంతృత్వాన్ని సూచిస్తున్న ది. సచివాలయంలోని మీడియా సెంటర్లో రాజకీయ, పాలనాపరమైన అభిప్రాయాలను జర్నలిస్టులు ఇష్టాగోష్టిగా పంచుకుంటారు. ఇది సహజం. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఒక అభద్రతాభావం ప్రస్తుతం జర్నలిస్టుల్లో నెలకొన్నది. ఉమ్మడి ఏపీలో విద్యుత్ ఉద్యమం జరిగిన సమయంలో చంద్రబాబు పత్రికల ఎడిటర్ల నే మార్పించారు. ప్రస్తుతం రేవంత్ కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉన్నది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినా, లైక్ కొట్టినా ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ఏడాది విజయోత్సవ సభల్లో కేటీఆర్ గురించి సీఎం రేవంత్ ప్రస్తా విస్తూ ఆయనను జైలుకు పంపడమే తమ లక్ష్యమని చెప్పడం విడ్డూరం. మనం అసలు ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? అనే ప్రశ్నను మనకు మనమే వేసుకోవాల్సిన దుస్థితి. దీన్ని ప్రజాపాలన అంటారా? ఎమర్జెన్సీ పాలన అంటారా అన్న విషయం రాష్ట్ర ప్రజలకు సులభంగా అర్థమవుతుంది. రేవంత్ పాలన చూస్తుంటే అచ్చం తెలంగాణ ఉద్యమ సమయంలో పరాయి పాలకులు అనుసరించిన విధానమే గుర్తుకువస్తున్నది.
ఇదిలా ఉంటే మోదీ స్నేహితుడైన అదానీకి తెలంగాణ విద్యుత్, సిమెంట్, భూము లు, ఇతర సహజ వనరులను కట్టబెట్టడానికి రేవంత్ రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ వెలుపల అదానీని అవినీతిపరుడిగా ప్రచారం చేస్తారు. తెలంగాణలో మాత్రం అదానీకి అన్నీ కట్టబెడతారు. అదా నీ, నిర్బంధాలు, కేసులు, కక్ష సాధింపులు, వేధింపులు, హక్కుల ఉల్లంఘనలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలకు ఎలాంటి వ్యత్యాసం లేదు.ఈ కార ణంగా కోరి తెచ్చుకున్న తెలంగాణలో అస్తి త్వమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ అస్తిత్వంపై జాతీ యపార్టీలు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి. కేసీఆర్ దీక్షా దివస్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పౌరుడూ ఉద్యమించాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– నర్రా విజయ్‌కుమార్