‘పురిటి నొప్పులు రానిదే తల్లి ప్రసవించదు, త్యాగాలకు సిద్ధం కానిదే విప్లవం సిద్ధించదు’ తెలంగాణలో విప్లవోద్యమాలు బలంగా వేళ్లూనుకొని ఉన్న రోజుల్లో ఆ ఉద్యమాల్లో కొనసాగుతున్న నేను గోడలపై రాసిన నినాదమిది. విప్లవోద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ, ఎంతో మంది క్యాడర్‌ను కోల్పోతున్న సందర్భంలో, బిడ్డను ప్రసవించడానికి తల్లి ఎన్ని పురిటి నొప్పుల్ని భరిస్తుందో.. ఒక నూతన వ్యవస్థ ఆవిర్భవించడానికి అంత బాధను అనుభవించాల్సి ఉంటుందని, అప్పుడే ఒక సుదీర్ఘ స్వప్నం నెరవేరి, సమసమాజ వ్యవస్థ ఏర్పడుతుందని కార్యకర్తల్లో మనో నిబ్బరాన్ని పెంచాను. సరిగ్గా అప్పటి తెలంగాణ ఉద్యమం కూడా అలాంటి పురిటి నొప్పుల్ని భరించి, సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అనేక మంది త్యాగాల పునాదులపై తెలంగాణ రూపుదిద్దుకుంది. ఈ త్యాగాల పరంపరలో, తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పి, 60 ఏండ్ల కల వాస్తవ రూపం దాల్చడానికి కారణమైన చారిత్రక ఘటన కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిన రోజు ఇది. ఈ రోజును ‘దీక్షా దివస్’గా జరుపుకొంటూ ఆ ఘట్టాన్ని మననం చేసుకోవడం మనందరి కర్తవ్యం.
KCR | పోరుబాటలోనే కాదు, త్యాగాల బాటలోనూ ముందు నిలిచినప్పుడే నాయకుడనేవాడు గొప్ప యోధునిగా కీర్తించబడతాడు. ఒకరి త్యాగాలపై వేరొకరు భోగాల సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం అత్యంత హేయమైనది, పాపమైనది. ‘తెలంగాణను ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే’ అని కాంగ్రెస్ వాళ్లు విజయోత్సవాలు నిర్వహించుకోవచ్చు. ‘మేము అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంద’ని టీడీపీ ప్రగల్భాలు పలకవచ్చు. ‘మా మద్దతు ద్వారానే సాధ్యమైంద’ని బీజేపీ క్రెడిట్ కొట్టెయ్యవచ్చు.
కానీ, తెలంగాణ ఆవశ్యకతను గుర్తించిందెవరు? ఆకాంక్షకు పురుడు పోసిందెవరు? గుండె గుండెలో తెలంగాణ భావవాల జెండాలెగరేసిందెవరు? ఆత్మబలిదానాల ద్వారా ఉద్యమ నిప్పు రగిలించిందెవరు? డప్పు మోగించిందెవరు? అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిందెవరు? ఇన్ని త్యాగాల అనంతరం చివరికి తెలంగాణ కల సాకారమైందంటే దీని సాధక శక్తులు, ఛోదక శక్తులు ఎవరు? వీటన్నింటికి తెలంగాణ లిఖించుకున్న పోరాట చరిత్రలో పుట్టుమచ్చలై మిగిలిపోయే సజీవ సాక్ష్యాలే సమాధానం చెబుతాయి. కవుల కలం కష్టం, గాయకుల గొంతు నష్టం, అమరవీరుల త్యాగాలు, మేధావుల అండదండలు, సబ్బండవర్గాల సంఘీభావం ఒక ఎత్తయితే, అన్నింటికి మించి ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘తెలంగాణ జైత్రయాత్రనా, కేసీఆర్ శవయాత్రనా’ అన్న నినాదాలే తన పోరాట విధానంగా మలుచుకొని, తన జీవితం తెలంగాణ సాధనకే అంకితం చేసుకున్న కారణజన్ముడు కేసీఆర్ పోరాట పటిమ మరొకెత్తు.
ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు? తెలంగాణ సమాజమంతా పోరుబాటలో సాగుతూ, యువకులు బలిదానాలు చేసుకుంటున్న సమయంలో వీళ్లెక్కడ దాక్కున్నారు? న్యాయమైన పోరాటాలకు మహా నియంతలే తలవంచక తప్పని పరిస్థితిని చరిత్రలో మనం ఎన్నోసార్లు చూశాం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తెలంగాణ న్యాయమైన పోరాటానికి తలవంచక తప్పని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ కాదా?
తెలంగాణ ఇవ్వక తప్పని చారిత్రక మలుపులో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు. కానీ, తెలంగాణను సాధించుకుంది తెలంగాణ పోరాట శక్తులు కావా? ఆ పోరాట శక్తులను ముందుకు నడిపించిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది కాదా? భారత స్వాతంత్రోద్యమ తాకిడిని తట్టుకొని నిలిచే శక్తిని కోల్పోయి, స్వాతంత్య్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాతంత్య్రమిచ్చిన ఘనత దక్కుతుందా? లేదా జాతియావత్తునూ ఏకం చేసిన బాపూజీకి దక్కుతుందా? అలాగే, సీమాంధ్ర పాలకుల మహాకుట్రలను చేధించి 12 ఏండ్లుగా ఎత్తిన పిడికిలి దించకుండా అటు ఉద్యమజ్వాల ఆరిపోకుండా, ఇటు పార్టీ క్యాడర్ జారిపోకుండా అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని సజీవంగా నిలిపి, రాష్ర్టాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్‌కు దక్కుతుందా? ఆయన లేని తెలంగాణ చరిత్రను లిఖించగల సాహసం ఏ చరిత్రకారుడైనా చేయగలడా? గాలిని బంధించగలిగితే, నీటిని మూటగట్టగలిగితే, భూమిని చాపగా చుట్టగలిగితే, నిప్పుకు చెదపట్టగలిగితే, సూర్యోదయపు దిక్కును మార్చగలిగితే కేసీఆర్ చరిత్రను మీరు మార్చగలుగుతారు.
మలిదశ ఉద్యమ నాయకత్వాన్ని కేసీఆర్ స్వీకరించే సమయానికి తెలంగాణవాదం కాని, భావజాలం కాని, అసమానతల పట్ల అసంతృప్తి గాని కొందరు మేధావుల్లో ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ ఏకం చేసి, బలమైన ఆకాంక్షలుగా మలిచి, పోరాట వేదికను ఏర్పరచి, లక్ష్యాన్ని సాధించగల కార్యాచరణ రూపొందించినవారు ఎవరూ లేకపోయారు. ఆ పనిచేసింది కేసీఆర్ మాత్రమే.
తన గమ్యం, గమనం తెలంగాణ సాధన ఒక్కటే అన్న నిబద్ధత కలిగి ఉండటం వల్లే అంతిమ విజయమే తన ధ్యేయంగా మనసా, వాచా, కర్మణా కేసీఆర్ భావించారు. ఆఖరికి తన బలిదానంతోనైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలన్న కఠిన నిర్ణయంతో ఆమరణ నిరాహార దీక్ష ద్వారా బలిపీఠమెక్కారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 2009, డిసెంబర్ 9 ప్రకటనను తేగలిగారు.
కాలానుగుణంగా కొనసాగిన దోపిడీ, వివక్షలు.. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు తెలంగాణ సమాజాన్ని నిత్యపోరాటాల్లో భాగస్వాముల్ని చేశాయి. ఈ దోపిడీ అంతా ఒక ఎత్తయితే.. సమైక్య రాష్ట్రంలో కొనసాగిన సీమాంధ్రుల దోపిడీ మరొకెత్తు. స్వరాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు భౌగోళికంగా, రాజకీయంగా విముక్తులయ్యారు. కానీ, తెలంగాణ పునర్నిర్మాణమే మన అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరాలంటే, ఏ త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందో ఆ త్యాగాల విలువను తెలుసుకోగలిగిన నాయకుడు కావాలి. పోరాటాన్ని నిర్మించి, వాటిలో భాగస్వాములై, ఆ ఆటుపోట్ల తాకిడిని అనుభవించిన వాళ్లకే అది సాధ్యం. దటీజ్ కేసీఆర్.
కేసీఆర్‌కు తెలంగాణ పునర్నిర్మాణం పట్ల ఒక దార్శనికత ఉంది. పునర్నిర్మాణానికి ప్రధాన బలంగా నిలిచే మేధావులతో అనుసంధానత ఉంది. ప్రగతిశీల భావజాలం కలిగిన ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేసిన భావసారూప్యత ఉంది. అన్నింటికీ మించి తెలంగాణలోని అన్ని రంగాలు, అన్ని వర్గాల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహనతో పాటు వాటి పరిష్కారాలు కూడా ఆయన ఏర్పరచుకున్న విజన్‌లో సిద్ధంగా ఉన్నాయి. అంతే కాదు, వాటిని అమలుపరిచిన అంకితభావముంది.
కాళోజీ కలలుగన్న మానవీయ విలువలు, జయశంకర్ సార్ ఆశించిన స్వీయ రాజకీయ అస్తిత్వ బలం, బాలగోపాల్ బతుకంతా పలువరించిన మానవహక్కుల పరిరక్షణ, కవులు కలవరించిన భాషాసంస్కృతుల వికాసం, విద్యార్థులు ఆకాంక్షించిన నిరుద్యోగ రహిత, స్వయం సమృద్ధికారక తెలంగాణ నిర్మాణమే ప్రధానమైనదని కేసీఆర్ భావించారు. అందుకనుగుణంగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి, వాటి ఫలాలను గడపగడపకు అందించారు. ఇక్కడి ప్రజలందరూ తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తమ సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకున్నాయని సంతోషంలో ఉన్నారు. పురుగుల మందుకు బలైన రైతన్నలు తమ పచ్చని పంట పొలాలతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. ఉరితాళ్లకు బతుకును వేలాడదీసుకున్న నేతన్నలు తమ మగ్గాలపై ఆశలపూలు పూశాయన్న సంబరంలో ఉన్నారు. ఫ్లోరైడ్ భూతం తమ ప్రాంతం నుంచి పారిపోయిందని నల్లగొండ వాసులు, వలసపోయిన తమ బిడ్డలు తిరిగి రాకతో తమ లోగిళ్లు రంగుల హరివిల్లులుగా వెల్లివిరిశాయనే సంబరంలో పాలమూరు వాసులు ఉన్న సమయంలో వారి జీవితాల్లో కాంగ్రెస్ నిప్పులు పోసింది.
రాష్ట్ర ఏర్పాటుకు ముందైనా, తర్వాతైనా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరింపజేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఒక జాతి స్వప్నం సాకారం కావడానికి బతుకును బలిపీఠమెక్కించి కూడా వెనుకడుగు వేయని త్యాగధనుడు కేసీఆర్. నాలుగున్నర కోట్ల ప్రజల కలల తెలంగాణ భావి నిర్మాత కేసీఆర్.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ)
– నారదాసు లక్ష్మణ్‌రావు