తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు ఆవిష్కరించిన రోజు, కేసీఆర్ ఆమరణ దీక్షతో, సబ్బండ వర్గాల వీరోచిత పోరాటంతో, ప్రాణ త్యాగాలతో రాష్ట్రం సాధించిన చారిత్రక సందర్భం జూన్ 2. ముల్కీ ఉద్యమం నుంచి సకల జనుల సమ్మె వరకు ఉద్యమం వివిధ రూపాల్లో జరిగింది. ప్రజా సంఘాలు, ఉద్యోగులు, కవులు, కళాకారులు ఉద్యమించినా అంకితభావంతో నిలబడి పోరాడే రాజకీయ వ్యవస్థగా ఏర్పడలేదు. నిర్బంధాలు, లోపాయికారి ఒప్పందాలు, రాజకీయ పదవుల పందేరానికి తలొగ్గి నిరంతర ఉద్యమంగా కొనసాగలేదు. పదవుల కోసం వాడుకొనే ఒక వస్తువుగా తెలంగాణను కొందరు ఉపయోగించుకున్నారు. కానీ తెలంగాణ కోసం ఉద్యమించే రాజకీయ పార్టీ అవసరమని భావించి 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారు. ఆ తర్వాత రాష్ట్ర సాధన వరకు మన కండ్ల ముందున్న చరిత్రనే.
తెలంగాణ పేరెత్తితే నక్సలైట్‌గా చిత్రీకరించి, కాల్చి చంపడం, మాయం చేయడం, ఆట, పాటపైనా ఆంక్షలు విధించ కూడా బంద్ కావడం, ప్రశ్నిస్తే అణచివేతకు గురిచేయడం.. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నిర్బంధాల కొలిమిగా మారిన తెలంగాణ పరిస్థితి. అలాంటి సమయంలో ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచి రైతుల నడ్డి విరిచింది. ఉద్యమించిన రైతులను బషీర్‌బాగ్‌లో పోలీసు తూటాలకు బలి చేసింది. ఆ సంక్షోభ సమయంలో సమరశంఖం పూరించారు కేసీఆర్. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులతోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రజాక్షేత్రంలో అడుగుబెట్టి పోరు నిర్మించారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప సాహసం చేసిన యోధుడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడం వల్లనే కేసీఆర్‌కు పదవి వచ్చిందని కాంగ్రెస్, తమ మద్దతుతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని బీజేపీ కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలకు అవకాశం వచ్చినా, ఉద్యమాలు జరిగినా, ప్రజలు రాజకీయ వ్యక్తీకరణలు చేసినా తెలంగాణ ఇవ్వలేదు అని అందరికి తెలిసిందే. పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీజేపీ విషం కక్కింది. ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చడం, తల్లిని చంపి శిశువు జన్మించిందని చెప్పడం, తలుపులు మూసి చీకట్లో బిల్లు ఆమోదించారని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా?
ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడం దారుణం కాదా? విభజన చట్టంలో ఉన్న హామీలను గాలికి వదిలేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల సోయి లేని బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నదా? చిన్న రాష్ర్టాలకు సహకారం అందించి ప్రగతిశీల రాష్ట్రంగా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వకుండా చట్టబద్ధంగా రావాల్సిన నిధులలో కోత పెట్టి సరిపెట్టుకొండని సలహాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 12 ఏండ్లుగా చేసింది ఏమీలేదు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వివిధ రూపాల్లో జరిగింది. 1969 లో విద్యార్థులు, ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించారు. ఆ ఉద్యమంలో 369 మంది యువకులు పోలీస్ కాల్పుల్లో మరణించారు. తెలంగాణా ప్రజా సమితి పార్టీ అభ్యర్థులను 11 మందిని గెలిపించి పార్లమెంట్‌కు పంపితే, ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టించింది. వివిధ ఒప్పందాలతో, హామీలతో రాజకీయ నాయకత్వాన్ని దారికి తెచ్చుకొని ఉద్యమాన్ని నీరుగార్చింది. ఒప్పందాలను గాలికి వదిలేసి తిరిగి కొద్ది కాలంలోనే తెలంగాణ బిడ్డలు తమ ప్రాంతంలోనే పరాయి బిడ్డలుగా బతికే అత్యంత విషాద పరిస్థితులు కల్పించారు, ముల్కీ రూల్స్ రద్దు చేశారు, ప్రెసిడెన్షియల్ చట్టం ప్రకారం 4 ఏండ్లు నివసిస్తే స్థానికులుగా నిర్ధారించి తెలంగాణ బిడ్డల హక్కులను కాలరాశారు.
నిధులన్నీ ఆంధ్రా ప్రాంతానికే పరిమితం చేశారు, తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, విద్య, వైద్యం, విద్యుత్తు లేకుండా చేశారు. తెలంగాణలో నీటి వసతి లేక వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లింది. బోర్ల మీద ఆధార పడ్డ రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఉద్యమం విఫలం కావడంతో అనేక మంది విద్యార్థులు వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆక్రోశంతో ఆవేదన చెంది నక్సల్బరీ ఉద్యమానికి ఆకర్షితులై అడవి బాట పట్టారు.
ఇక తెలంగాణ రాష్ట్రం రాదని అనేక మంది రాజీ పడ్డారు. కానీ తెలంగాణ కవులు, మేధావులు, కళాకారులు భావజాల వ్యాప్తితో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టారు. జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావుజాదవ్తోపాటు అనేక మంది తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే విశ్వాసాన్ని నింపారు. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ప్రశ్నించే స్వేచ్ఛ దొరికింది. రాజకీయ వ్యక్తీకరణకు వేదికగా నిలిచింది.
కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఒక వైపు కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచుతూ, క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించింది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, దేశవ్యాప్తంగా 32 రాజకీయ పార్టీలను కూడగట్టింది. చివరకు ప్రజాభిప్రాయాన్ని బలంగా వినిపించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులకు, ఎంపీ, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేసి ఉపఎన్నికలతో ఉద్యమం మరింత బలోపేతం చేసింది.
సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం, పెన్‌డౌన్, సహాయ నిరాకరణ, సడక్ బంద్, చలో అసెంబ్లీ, సన్సద్ యాత్ర లాంటి వీరోచిత పోరాటాలు తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు. వీరోచిత పోరాటాలతో, అసమాన త్యాగాలతో, సబ్బండ వర్గాల సమరంతో, కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ స్వరూపాన్ని అన్ని రంగాల్లో మార్చే నిరంతర కృషి వల్లే నిరంతర విద్యుత్తు సాధ్యమైంది. నీళ్ల కోసం తండ్లాడిన తెలంగాణ సాగునీరు, తాగునీరు అందించడంలో అద్భుతాలు సృష్టించింది. వ్యవసాయం సంక్షోభం నుంచి విముక్తి పొంది, దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వమే రైతులకు అండగా నిలిచి, పెట్టుబడి సాయం రైతుబంధు ద్వారా అందించింది. ఇది కేసీఆర్ వినూత్న ఆలోచనకు నిదర్శనం. చిన్న రాష్ర్టాలు అభివృద్ధిని సాధించలేవు అని చెప్పిన విమర్శకులకు తెలంగాణ చెప్పిన జవాబు విస్మయానికి గురిచేసింది. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే రోల్ మాడల్ కావడం తెలంగాణ సాధించిన విజయం.
2023 ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. రెండున్నరేండ్లు గడిచినా హామీలు నెరవేర్చలేదు. అన్ని వర్గాలు తమ సమస్యల కోసం నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రైతు పరిస్థితి దారుణంగా తయారైంది. రైతు బంధు లేదు, బోనస్ లేదు, కనీసం పండించిన పంటను కూడా కొనడంలేదు. అన్ని డిక్లరేషన్లు అటకెక్కాయి. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యమకారులు ఆగ్రహంగా ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో భూకబ్జాలు, అక్రమ మైనింగ్, మూసీ అభివృద్ధి పేరిట పేద ప్రజల బతుకు ఛిద్రం చేయడం, హైడ్రా పేరిట ఇండ్ల కూల్చివేత, ప్రశ్నించిన ప్రజలపై దాడులు, అక్రమ కేసులు.. కాంగ్రెస్ పాలకులకు ఇదే పనులుగా మారాయి. కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు పోరాట దినంగా జరుపుకుందాం. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం, సకల జనులం మరో ఉద్యమానికి సన్నద్ధమవుదాం. జై తెలంగాణ.

– (వ్యాసకర్త: బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్) దేవీప్రసాద్